ETV Bharat / state

నాలుగేళ్లుగా ఆమెకు నరకం.. ఇంతకీ వెన్నుపూసలో ఆ సూది ఎక్కడిది?

author img

By

Published : Oct 30, 2021, 5:27 PM IST

భరించలేనంత నడుము నొప్పితో ఆస్పత్రులన్ని తిరిగింది ఆ మహిళ. సుమారు 4 లక్షల దాకా ఖర్చుపెట్టింది. అయినా.. అసలు సమస్య బయటపడలేదు. ఇటీవలే.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్​రే తీశారు. అందులో అసలు సమస్య బయటపడింది. తన వెన్నుపూసలో సూది ఉన్నట్టు తేలింది. అసలు అక్కడికి సూది ఎలా వెళ్లిందంటే..

A needle in the woman vertebrae for four years at siricilla
A needle in the woman vertebrae for four years at siricilla

నాలుగేళ్లుగా వెన్నుపూసలో సూది.. నరకం అనుభవించిన మహిళ..

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్​కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుము నొప్పితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. తగ్గకపోగా.. రోజురోజుకు ఆమె సమస్య పెరిగిపోతుంటంతో బాధితురాలు.. కనపడిన ఆస్పత్రులన్నీ తిరిగింది. చూపించుకున్న వైద్యులందరూ.. ఆమెది సజహంగా వచ్చే నొప్పిగానే భావించి అందుకు తగిన మందులు రాసి పంపించేస్తున్నారు. కానీ.. అవేమి లచ్చవ్వకు ఉపశమనం ఇవ్వట్లేదు. ఇలా.. అన్ని ఆస్పత్రులకు కలిపి 4 లక్షలకు పైగానే లచ్చవ్వ ఖర్చు చేసింది. అయినా.. అసలు సమస్య బయటపడకపోగా.. ఇంకా తీవ్రమైంది.

సూదిని కనిపెట్టిన ఎక్స్​రే..

ఈ నెల 28న.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి లచ్చవ్వ వెళ్లింది. తను ఎదుర్కొంటున్న సమస్యను వివరించింది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగిందో.. వాటన్నింటి వైద్యులు రాసిచ్చిన్న మందుల చీటీలను ఆ వైద్యుని ముందుంచింది. వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన సదరు వైద్యుడు.. లచ్చవ్వకు ఎక్స్​రే తీయాలని సూచించాడు. ఆ ఎక్స్​రే తీయగా.. లచ్చవ్వకున్న అసలు సమస్య బయటపడింది. లచ్చవ్వ వెన్నుపూసలో సూది ఉన్నట్టు ఎక్స్​రేలో తేలింది. దాన్ని పరీక్షించిన వైద్యులు.. లచ్చవ్వను పూర్తిగా ఎగ్జామిన్​ చేశారు. గతంలో తన ఆరోగ్య పరిస్థితి, ఎమైన శస్త్ర చికిత్సలు జరిగాయా.. లాంటి ప్రశ్నలు లచ్చవ్వను అడగ్గా.. ఆ సూది అక్కడికి ఎలా వచ్చిందో తెలిసిపోయింది.

కడుపులోనే సూది, దారం..

ఆ ఎక్స్​రే.. వైద్యుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. గతంలో లచ్చవ్వకు వైద్యం చేసిన డాక్టర్ల ఘనకార్యమే.. ఆమె సమస్యకు అసలు కారణమని తేల్చింది. లచ్చవ్వకు నాలుగేళ్ల క్రితం గర్భాశయానికి గడ్డలు కాగా... సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2017 అక్టోబర్‌లో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్​ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులు.. కుట్లు వేసే సమయంలో సూది, దారం మహిళ కడుపులోనే మరిచిపోయారు. రెండేళ్ల తర్వాత లచ్చవ్వకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సూది మొల్లగా వెన్నుపూసలోకి జారి ఆగిపోయింది. అప్పటి నుంచి నడుము నొప్పి ప్రారంభమైనట్టు.. వైద్యులు గ్రహించి లచ్చవ్వకు చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు..

ఆ సూదిని బయటకు తీసేందుకు చాలా డబ్బులు ఖర్చవుతాయని వైద్యులు చెప్పినట్టు బాధితురాలు వాపోయింది. ఇప్పటికే.. నాలుగు లక్షలకు పైగా ఖర్చుపెట్టినట్టు లచ్చవ్వ పేర్కొంది. వైద్యులు చేసిన తప్పు వల్ల ఇన్ని రోజులుగా తాను బాధపడుతూ.. లక్షలు ఖర్చుపెట్టాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యంపై బాధితురాలు లచ్చవ్వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.