ETV Bharat / state

D Srinivas Return to Congress: కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రాక.. నిజామాబాద్​ రాజకీయాల్లో మొదలైన కాక!

author img

By

Published : Jan 3, 2022, 5:16 PM IST

D Srinivas Return to Congress: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే సీనియర్ రాజకీయ నాయకులు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు తన సారథ్యంలో అధికారంలోకి తెచ్చిన ఘనత. తన రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు ఉంది. రాష్ట్ర ఆవిర్భావంతో కాంగ్రెస్ వెనకబడటం.. పరిస్థితుల కారణంగా తెరాసలో చేరి రాజ్యసభకు వెళ్లారు. అక్కడా పొసగక తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. డీఎస్​ రాక ఖరారైన నేపథ్యంలో.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.

D Srinivas Return to Congress: కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రాక.. నిజామాబాద్​ రాజకీయాల్లో మొదలైన కాక!
D Srinivas Return to Congress: కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రాక.. నిజామాబాద్​ రాజకీయాల్లో మొదలైన కాక!

D Srinivas Return to Congress: కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రాక.. నిజామాబాద్​ రాజకీయాల్లో మొదలైన కాక!

D Srinivas Return to Congress: ధర్మపురి శ్రీనివాస్. ఇది పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి వుండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. డీఎస్​ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి కుర్చీపై కూర్చోబెట్టిన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్శించారు.

సొంత పార్టీ నేతలే నిందలేశారు..

D Srinivas Back in congress: 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్.. డీఎస్​ను కాదని ఆయన శిష్యురాలైన ఆకుల లలితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన డీఎస్​... కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్​ సమక్షంలో తెరాసలో చేరారు. తనతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్​.. డీఎస్​కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్ల పాటే మిగిలింది. తెరాస పార్టీకి డీఎస్​ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. సొంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు. డీఎస్​ రెండో కుమారుడు అర్వింద్ భాజపాలో చేరడం.. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో స్థానిక తెరాస నేతలు మూకుమ్మడిగా తెరాస అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీఎస్​ పలుమార్లు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెరాస నాయకత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టలేకపోయింది. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుండటం.. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించడం.. జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్​లో చేరిక.. అందుకోసమేనా?

DS Likely to join in Congress: డీఎస్​ అనుచరులుగా ఉండి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు సైతం ఆయన రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. డీఎస్​ రాక వెనుక అసలు కారణం మాత్రం ఆయన పెద్ద కుమారుడు సంజయ్ అంటున్నాయి పార్టీ వర్గాలు. సంజయ్ సైతం రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే పార్టీలో చేరేందుకు సంసిద్ధతను తెలిపారు. ఇప్పుడు సంజయ్‌కు రాజకీయ భవిష్యత్‌ను అందించేందుకు డీఎస్​ తిరిగి పాత గూటికి చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంపీ అర్వింద్ సైతం తన తండ్రిని భాజపాలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఒకవేళ డీఎస్​ భాజపాలోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. అయితే ఆయన వెంట వచ్చే సంజయ్, ఇతర నేతల రాకను మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నారు. డీఎస్​ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం పట్ల మిగతా పార్టీల నేతలూ తలలు పట్టుకుంటున్నారు. తన రాజకీయ వ్యూహాలతో అర్వింద్.. ఎంపీగా గెలవడం వెనక డీఎస్​ ఉన్నారని ఇప్పటికే స్పష్టమైంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ భాజపాకు ఎక్కువ సీట్లు వచ్చేలా చేశారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​లో చేరి మళ్లీ జిల్లా రాజకీయాలపై దృష్టి పెడితే.. పరిస్థితి ఏంటని తెరాస, ఇతర పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా రాజకీయాలపై తీవ్రప్రభావం

మొత్తం మీద డీఎస్​ తిరిగి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొందరు మాత్రం పదవుల కోసమే ఆయన పార్టీలు మారుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ను విడిచి తెరాసకు వెళ్లారని.. ఇప్పుడు పదవీకాలం అయిపోగానే మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.