ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద మందుబాబుల జోరు.!

author img

By

Published : May 6, 2020, 9:30 PM IST

ఎన్ని రోజులు అయిందో బుజ్జిముండ... నిన్ను చూసి. ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతే ఎలా... నేను ఏమైపోవాలే. నిన్ను విడిచి నేను ఏనాడైనా ఉన్నానా.? నువ్వు లేకుండా నేను గడిపిన ఒక్కో క్షణం ఒక్కో సంవత్సరంలా అనిపించింది. నిన్ను చూడని ఈ 45రోజులు నాకు 45సంవత్సరాలుగా భారంగా తోచాయి. నువ్వు లేని సమయమంతా క్షణమొక యుగంలా గడిచిందంటే నువ్వు నమ్మలేవేమో. సరే ఏది ఏమైతేనేం... ఎట్టకేలకు మళ్లీ నువ్వు నా దగ్గరికి వచ్చావు. అదే నాకు పదివేలు... కాదు కాదు పది వేలంటే మరీ తక్కువైపోతుందేమో... అదే నాకు బ్లాంక్​ చెక్​... ఎందుకంటే ఈ ఆనందం వర్ణనాతీతం కదా...! అందుకే. ఇదీ 45రోజుల లాక్​డౌన్​ తర్వాత సగటు మందుబాబుల అంతరంగం.

The Joy of Alcohol Lovers
ఎట్టకేలకు మద్యం దొరికింది... మహదానందంగా ఉంది.

నెలన్నర తర్వాత లిక్కర్ షాప్​లు తెరవడంతో మద్యం ప్రియుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. మండుటెండలో గంటల తరబడి మరీ క్యూలైన్లలో నిల్చొని మద్యం కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల దుకాణాలు తెరిచే వరకూ చెప్పులు, ఇతర వస్తువులను వరుసలో ఉంచి మరీ మద్యం కోసం పోరుబాట పట్టారు. ప్రతి దుకాణం ముందు కిలోమీటర్ పైగా క్యూలైన్లలో ఎదురు చూశారు. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి మద్యం కొనుగోలు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 91 దుకాణాలకుగానూ 87 తెరుచుకోగా... కామారెడ్డి జిల్లాలో 40 దుకాణాలకుగానూ 36 తెరిచారు. మిగిలిన దుకాణాలు అధికారులు సీజ్ చేయడంతో తెరుచుకోలేదు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​లో మాత్రం ఓ మద్యం దుకాణం స్టాక్​ లేక తెరుచుకోలేదు. మద్యం దుకాణాలతో పాటు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన ఎలక్ట్రికల్, హార్డ్​వేర్, స్టీల్, వ్యవసాయ సంబంధిత దుకాణాలు తెరుచుకున్నాయి.

లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. అధిక శాతం జనాలు రోడ్లపైకి వచ్చారు. ఇక జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తే... బోధన్​లో మాత్రం బ్యాంకుల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు నగదు కోసం క్యూ కట్టారు. నిజామాబాద్ నగరంలో ఉదయం 6 గంటల నుంచే మద్యం కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని శివాజీనగర్, వర్ని చౌరస్తా, నిఖిల్​సాయి చౌరస్తా, కంఠేశ్వర్, దుబ్బ ప్రాంతాల్లో వైన్స్​ల ముందు భారీ క్యూలైన్లు కనిపించాయి. ఈ ప్రాంతాల్లో మహిళలు సైతం మద్యం కొనుగోలు చేయడం విశేషం.

ఇక ఆర్మూర్, బోధన్, బాల్కొండ, డిచ్​పల్లిలోని వైన్స్​ల వద్ద కూడా రద్దీ కనిపించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్​వాడ నియోజకవర్గ కేంద్రాలతో పాటు తాడ్వాయి, భిక్కనూర్, సదాశివనగర్, గాంధారి, రామారెడ్డి, బీబీపేట్, రుద్రూర్, కోటగిరి, నవీపేట్, ఎడపల్లి, మాక్లూర్, నందిపేట్ మండల కేంద్రాల్లోనూ జనం భారీగా కనిపించారు. దాదాపు అన్ని వైన్స్​ల వద్ద రద్దీ నెలకొంది. ప్రతి వైన్స్ వద్ద ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎస్సై, సీఐలు అందుబాటులో ఉండేలా చూశారు. ఏసీపీలు, డీసీపీలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కలెక్టర్ నారాయణరెడ్డి పలు వైన్స్​ల వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఎక్సైజ్ సిబ్బందిని సైతం వైన్స్​ల వద్ద అందుబాటులో ఉంచారు. నెలన్నర తర్వాత లిక్కర్​ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్లు చేశారు. చాలా రోజుల తర్వాత మద్యం లభించడంతో మందుబాబుల్లో మోముల్లో సంతోషం వెల్లివిరిసింది.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.