ETV Bharat / state

ఆర్టీసీ ఛైర్మన్ అల్లుడు వాహనంపై మేయర్‌ భర్త అనుచరుల రాళ్లదాడి

author img

By

Published : Mar 2, 2022, 7:50 PM IST

Updated : Mar 3, 2022, 9:18 AM IST

BHU_VIVADAM
BHU_VIVADAM

భూ వివాదం విషయంలో నిజామాబాద్​ మేయర్ భర్త అనుచరులు విరంగం సృష్టించారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి అల్లుడి వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

స్థల వివాద విషయంలో బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అల్లుడు మోటాడి సంపత్‌.. నగర పాలక సంస్థ మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త దండుశేఖర్‌ల మధ్య ఈ వ్యవహారం నడిచింది. సంపత్‌ అలియాస్‌ పింటు వాహనంపై బుధవారం మధ్యాహ్నం దాడి జరిగింది. అతడి స్నేహితుడైన వెంకట్‌యాదవ్‌పై కూడా కొందరు దాడి చేసి నిర్బంధించారు. తన స్నేహితుడు వెంకట్‌పై మేయర్‌ భర్త దండు శేఖర్‌ సహా మరికొందరు దాడి చేశారని సంపత్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తనపైనా రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మేయర్‌ భర్త దండు శేఖర్‌ సహా మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు వెల్లడించారు. అరగంట తర్వాత కేసు నమోదు చేయలేదంటూ సమాచారం ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు, ఇరువర్గాలు అధికార పార్టీ వారు కావడంతో చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది..

పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ సాయినగర్‌లో ఎమ్మెల్యే అల్లుడు సంపత్‌కు 2400 గజాల స్థలం ఉంది. ఈ భూమిని చదును చేయించి హద్దు రాళ్లు పాతించే పనులు జరుగుతున్నాయి. ఇదే ప్రాంతంలో తనకు కూడా 300 గజాల భూమి ఉందని సంపత్‌కు మేయర్‌ భర్త దండు శేఖర్‌ ఫోన్‌ చేశారు. తను భూమి దగ్గరే ఉన్నానని చెప్పడంతో తన మిత్రుడైన వెంకట్‌ ను సంపత్‌ అక్కడికి పంపారు. వెంకట్‌ వెళ్లేసరికి మేయర్‌ భర్త లేరు. అక్కడున్న కొందరు వెంకట్‌పై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సంపత్‌ కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆయన వాహనం దిగకుండానే వెళ్లిపోయారు. సంపత్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వెంకట్‌ను విడిపించారు. మేయర్‌ భర్త కూడా అప్పుడు అక్కడికి వచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాయంత్రం ఇరువర్గాల ఘర్షణచిత్రాలు బయటకొచ్చాయి.

ఇదీ చదవండి : క్లాస్​రూంలో క్రికెట్​.. స్టూడెంట్స్​ మధ్య గొడవ.. ఒకరు మృతి..

Last Updated :Mar 3, 2022, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.