ETV Bharat / state

భారీ మెజార్టీతో కవిత గెలుపు... విపక్షాల డిపాజిట్లు గల్లంతు...

author img

By

Published : Oct 12, 2020, 7:50 PM IST

అందరి అంచనాలు నిజం చేస్తూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాసకే పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో జయభేరి మోగించారు. 823 ఓట్లలో 728 ఓట్లు అధికార పార్టీకి పోలైతే.. భాజపా, కాంగ్రెస్‌ కలిసినా వంద మార్కును అందుకోలేక ధరావతు కోల్పోయాయి. ఎన్నిక ఆసాంతం ఏకపక్షంగా సాగిందనడానికి ప్రబల సాక్ష్యంగా మొదటి రౌండ్​లోనే కవిత విజయం ఖరారైపోయింది. కారు జోరుతో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.

kavitha
kavitha

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లు పోలైతే 728 ఓట్లు తెరాసకే వచ్చాయి. భాజపా 56, కాంగ్రెస్ 29 ఓట్లతో సరిపెట్టుకుని డిపాజిట్లు కోల్పోయాయి. పోలైన 813 ఓట్లలో పది చెల్లకుండా పోయాయి. మొదటి రౌండ్​లోనే కవిత విజయం ఖాయమైపోయింది. తొలి రౌండ్‌లో 600 ఓట్లు లెక్కించగా... తెరాసకు 531 , భాజపాకు 39, కాంగ్రెస్‌కు 22 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్‌లో 223 ఓట్లు లెక్కిస్తే.. తెరాసకు 197, భాజపాకు 17, కాంగ్రెస్‌కు 7 ఓట్లు రాగా.. 2 ఓట్లు చెల్లకుండా పోయాయి.

నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా... పది గంటలకే పూర్తి ఫలితం వచ్చేసింది. పదకొండున్నర ప్రాంతంలో ఎమ్మెల్సీగా గెలిచినట్లు కవితకు రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ధ్రువీకరణ పత్రం అందించారు. అనంతరం కవిత నేరుగా నీలకంఠేశ్వరాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత ఇంటి పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

గులాబీ శ్రేణుల్లో సంబురాలు

మొదట్నుంచీ కవిత విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఊహించని విధంగా ఫలితం వచ్చింది. తెరాస నేతలు 650 ఓట్లు వస్తాయనుకుంటే... భారీ మెజార్టీతో 728 ఓట్లు రావడం గమనార్హం. ఫలితాల సరళి పరిశీలిస్తే కాంగ్రెస్, భాజపాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెరాసకే ఓటేసినట్లు తెలుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కవిత ఓడిపోగా.. ఇప్పుడు అదే నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీగా కవిత విజయదుందుభి మోగించినందుకు మిగిలిన జిల్లాల్లోనూ గులాబీ కార్యకర్తల సంబురాలు మిన్నంటాయి. కార్యకర్తలతో మంత్రి వేముల కూడా నృత్యం చేశారు.

సీఎం కేసీఆర్ అభినందనలు

ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ప్రగతిభవన్​లో సీఎంను కలిశారు. కేసీఆర్​కు పాదాభివందనం చేసిన కవిత... ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కవిత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలను ముఖ్యమంత్రి అభినందించారు. కవితకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులను అభినందించారు. సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డిని కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. కవితను పోచారం అభినందించి సన్మానించారు.

ఇదీ చదవండి : ఓటమి చవిచూసిన చోటు నుంచే కవిత గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.