floods to projects: వరుణ ప్రభావంతో కొనసాగుతున్న వరద.. నిండుకుండలా జలాశయాలు

author img

By

Published : Sep 8, 2021, 12:14 PM IST

floods to projects, waterflow to projects

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ(Telangana Irrigation projects) నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో నీరు గరిష్ఠ మట్టానికి చేరువ కావడం వల్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు.. భారీ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.

నిండుకుండలా జలాశయాలు

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీవరద కొనసాగుతోంది ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3,50,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండగా... 33 గేట్ల నుంచి 4,04,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.1 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు దిగువన గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ తీరం వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న నీటిమట్టం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండ్రోజుల క్రితం 23 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... క్రమంగా ఈ ఉదయానికి 36.7 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుడంటంతో నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. స్నానఘట్టాల వద్ద చాలామెట్లు నీటిలో మునిగాయి. రామాలయం ప్రాంతంలోని అన్నదాన సత్రం పడమర మెట్లవద్దకు వరద నీరు చేరకుండా మోటార్లు పెట్టి నీటిని తోడి గోదావరిలోకి పంపిస్తున్నారు. నీటిమట్టం పెరగడంతో పర్ణశాల వరద నీటిలో మునిగింది.

జంట జలాశయాలకు జలకళ

రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీవర్షానికి చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. ఎగువప్రాంతాల నుంచి వస్తున్న వరదతో హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్‌ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయికి చేరడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలమండలి సూచన మేరకు మూడు రోజుల క్రితం... ఉస్మాన్‌సాగర్‌ జలాశయం గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. రెండు రోజులుగా వరద పెరగడంతో రెండుగేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు... అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులను కిలోమీటర్‌ దూరం నుంచి వెనక్కి పంపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..

జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేటలకు కొనసాగుతున్న వరద

  • హిమాయత్ సాగర్‌లోకి వచ్చి చేరుతున్న 750 క్యూసెక్కుల నీరు
  • జలాశయంలో 1762.10 అడుగులకు చేరిన నీరు
  • హిమాయత్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం- 1763.50 అడుగులు
  • రెండు గేట్ల ద్వారా మూసీలోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల
  • ఉస్మాన్ సాగర్​లోకి వచ్చి చేరుతున్న 1200 క్యూసెక్కుల నీరు
  • ఉస్మాన్‌ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1789.35 అడుగులు జలాశయం గరిష్ఠ నీటిమట్టం-1790 అడుగులు
  • నాలుగు గేట్ల ద్వారా మూసీలోకి వెళ్తున్న 1800 క్యూసెక్కుల నీరు

పార్వతీ బ్యారేజీకి కొనసాగుతున్న వరద

పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజీకి వరద పెరుగుతోంది. పార్వతీ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7,03,866 క్యూసెక్కులుగా నమోదైంది. పార్వతీ బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతీ బ్యారేజీ గరిష్ఠ నీటినిల్వ 8.83 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 3.31 టీఎంసీలుగా ఉంది. మరోవైపు మానేరు వాగుకు వరద పోటెత్తింది. ముత్తారం, మల్హర్, మంథని మండలాల్లో మానేరు వాగుకు వరద వచ్చి చేరుతోంది. లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో మానేరు వాగుకు వరద కొనసాగుతోంది. వరద ఉద్ధృతితో పంట పొలాలు నీటమునిగాయి. గోదావరిలో మానేరు నది కలిసేచోట చొచ్చుకొస్తోంది

ఇదీ చదవండి: Rain Effect: జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న సిరిసిల్ల.. ఇక ఈ కష్టాలు మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.