ETV Bharat / state

అకాల వర్షంతో నేలరాలిన అన్నదాత కష్టం

author img

By

Published : May 1, 2021, 9:02 PM IST

Updated : May 1, 2021, 10:15 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి చేలల్లోని వరి నేలపాలైంది. నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దయింది. కోతకు సిద్ధమైన మామిడి ఈదురు గాలులకు నేల రాలి కర్షకులకు కంటనీరు మిగిల్చింది.

crop damaged for heavy rains in nizamabad district
crop damaged for heavy rains in nizamabad district

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వినాయక్​నగర్, ఖిల్లా రోడ్, కంటేశ్వర్ ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డుపైకి చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడం వల్ల గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

జిల్లాలోని ఇందల్వాయి, డిచ్​పల్లి, బోధన్, ధర్పల్లి సిరికొండ మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈ వానకు కొనుగోలు కేంద్రంలో నిల్వచేసిన ధాన్యం తడిసిపోయింది. ఇందల్వాయి మండలం గన్నారంలో ఈదురు గాలులకు ఓ చెట్టు విరిగి ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పంచాయతీ సిబ్బంది జేసీబీ సాయంతో ఇంటిపై కూలిన చెట్టును తొలగించారు.

బీర్పూర్ మండలం దామారం, కృష్ణాపురం, రైతునగర్​లో వడగండ్ల వాన కురిసి... వరి ధాన్యం నేలరాలింది. ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందే తడిసి పోవడాన్ని చూసి.. కర్షకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాల్కొండలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు వచ్చి ధాన్యం కుప్పలపై పరదాలు కప్పారు. అప్పటికే కొంత ధాన్యం తడిసింది. కార్మిక దినోత్సవం కావటం వల్ల కొనుగోళ్లు జరగలేదు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోగా... అకాల వర్షంతో ధాన్యం నీటిపాలైంది.

కొనుగోలు కేంద్రాల్లో కూలీల కొరత సైతం తీవ్రంగా ఉందని... ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకొంటుండగా.. కొనుగోలు కేంద్రాల్లో నిత్యం ధాన్యం ఆరబోయడం, కుప్ప చేయడంతోనే సరిపోయిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు. కొనుగోళ్లలో వేగం పెంచి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'

Last Updated :May 1, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.