ETV Bharat / state

Check Dam Construction: అనువుగాని చోట చెక్‌డ్యాములు.. నిపుణుల పరిశీలనలో తేలిన లోపాలు!

author img

By

Published : Oct 31, 2021, 9:07 AM IST

Check Dam Construction, check dam planning errors
తెలంగాణలో చెక్ డ్యాం నిర్మాణాలు, చెక్ డ్యాం లోపాలు

రాష్ట్రంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాముల నిర్మాణాల్లో(Check Dam Construction) అనేక లోపాలున్నాయని నిపుణుల పరిశీలనలో తేలింది. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. తేలిన లోపాలపై డ్యాముల వారీగా నివేదికలను ప్రాథమికంగా ఈఎన్‌సీకి(ENC latest News) అందజేసినట్లు తెలిసింది.

రాష్ట్రంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాముల నిర్మాణాల్లో(Check Dam Construction) ప్లానింగ్‌, డిజైన్‌ లోపాలు భారీగా ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. రూ.2,847 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 596 చెక్‌డ్యాముల నిర్మాణాలను నీటిపారుదల శాఖ ప్రారంభించింది. అక్టోబరు నెలాఖరుకు దాదాపు 200 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ వానాకాలంలో భారీవర్షాలకు వాటిలో సగం వరకు దెబ్బతిన్నాయి. 35 డ్యాములు పూర్తిగా ఛిద్రమయ్యాయి. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం, లోపాలను తేల్చాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఇటీవల ఇద్దరు నిపుణులకు బాధ్యతలు అప్పగించారు. వారు క్షేత్రస్థాయిలో కొన్ని నిర్మాణాలను పరిశీలించారు. తేలిన లోపాలపై డ్యాముల వారీగా నివేదికలను ప్రాథమికంగా ఈఎన్‌సీకి(ENC Latest News) అందజేసినట్లు తెలిసింది.

లోపాలు ఇవే..

సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకుని మానేరుపై రూ.10.43 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయలేదు. డ్యాం ఒకవైపు గట్టు పల్లానికి ఉంది. అక్కడ మట్టికట్ట ఎంత గట్టిగా కట్టినా నిలవదనేది చూస్తే తెలుస్తోంది. పైగా డ్యాంకు దిగువనే 100మీటర్ల దూరాన నదిలో మట్టిగుట్ట ఉంది. వరద సమయంలో దీనివల్ల ప్రవాహం వెనక్కుతన్ని చెక్‌డ్యాంకు ఇరువైపులా నీరు విస్తరిస్తుందనేదీ అర్థమవుతోంది. అయినా అక్కడే కట్టేశారు. వరదలతో డ్యాం ఇరువైపులా నీటి ఉద్ధృతి పెరిగి కోతకోసింది. చెక్‌డ్యాం రెండుగా విడిపోయింది. అంతేకాదు.. మధ్యమానేరు ప్రాజెక్టు వెనుక జలాలు విస్తరించే చోటకు సమీపంలోనే ఈ నిర్మాణం ఉంది. డిజైన్‌, ప్లానింగ్‌ లోపంతో పాటు డ్యాం ప్రయోజనాన్నీ తుంగలో తొక్కారనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లోనే అధికం

  • ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో చెక్‌డ్యాములు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వాటితో పోల్చితే ఈ జిల్లాల్లో ఒక్కో నిర్మాణానికి భారీగా నిధులిచ్చారు.
  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మానేరు నదీపరీవాహకంలో నిర్మించిన వాటిలో చాలా వరకు మట్టికట్టలు కొట్టుకుపోయాయి. గట్లు కోతకు గురయ్యాయి. నిర్మాణ ప్రదేశం ఎంపికలో లోపం ఉన్నట్లు తేలింది. 12 మేజర్‌ డ్యాములను పరిశీలించిన నిపుణులు అనేక లోపాలు గుర్తించినట్లు తెలిసింది.
  • కొన్ని డ్యాముల బెడ్‌ నిర్మాణం ఒకేసారి వేయకుండా ఒకవైపు నుంచి నిర్మిస్తూ వచ్చే క్రమంలో వరదలకు కోతకు గురైంది. వాస్తవానికి రెండు గట్లను కలుపుతూ ముందుగా బెడ్‌ నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోలేదు.
  • నిర్మాణం చేపట్టడానికన్నా ముందే మట్టి పరీక్ష చేయించాలి. దీన్నీ పెడచెవిన పెట్టారు. మట్టి గుణాన్ని బట్టి లోతుగా తవ్వడం, కాంక్రీటును విస్తరించడం చేయాలి. వదులు మట్టి ఉన్నా కాంక్రీటులో నాణ్యతను పట్టించుకోక చాలాచోట్ల కట్టలు కొట్టుకుపోయాయి.
  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ చెక్‌డ్యాం లక్ష్యాన్ని విస్మరించినట్లు తేలింది. నాలుగు నిర్మాణాల్లో ప్రధానమైన లోపాలు వెలుగుచూసినట్లు సమాచారం. అవన్నీ ఒకచోటకు బదులు మరోచోట నిర్మాణాలు చేపట్టినవే!
  • ప్రవాహ ఉద్ధృతి ఉండే చోటును ఎంచుకోవడంతో పాటు డ్యాంకు ఇరువైపులా మట్టికట్టలను పటిష్ఠంగా నిర్మించలేదు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.