ETV Bharat / state

'వెయ్యిమంది కేసీఆర్‌లు, అసదుద్దీన్‌లు వచ్చినా.. గెలిచేది మేమే'

author img

By

Published : Nov 29, 2022, 5:52 PM IST

Updated : Nov 29, 2022, 7:23 PM IST

Bandi sanjay comments on kcr in BJP Praja Sangrama Yatra bhimgal
వెయ్యిమంది కేసీఆర్‌లు, అసదుద్దీన్‌లు వచ్చినా.. గెలిచేది మేమే: బండి సంజయ్

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..... కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని...నిర్మల్‌ జిల్లా బైంసా వేదికగా జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభసభలో... భాజపా నేతలు నినదించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ పేరిట కొత్త నాటకానికి తెరతీశారని... వెయ్యి మంది కేసీఆర్‌లు, అసదుద్దీన్‌లు వచ్చినా మోదీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. భాజపా అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామని... వేధింపులకు గురైన హిందూ కార్యకర్తలపై కేసులు ఎత్తివేస్తామని బండి సంజయ్‌ తేల్చిచెప్పారు.

'వెయ్యిమంది కేసీఆర్‌లు, అసదుద్దీన్‌లు వచ్చినా.. గెలిచేది మేమే'

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభ సభ నిర్మల్‌ జిల్లా బైంసా సమీపంలో జరిగింది. . హైకోర్టు అనుమతితో పోలీసులు విధించిన షరతుల నడుమ నిర్వహించిన సభకు.... భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామారావు పటేల్‌కు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాషాయ కండువగా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మజ్లిస్‌ లక్ష్యంగా బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. భైంసా ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా...? ఇక్కడకు రావాలంటే వీసా తీసుకోవాలా...? అని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి రాగానే భైంసా పేరును మైసా మారుస్తామని స్పష్టంచేశారు. సౌకర్యాల కోసం పోరాడిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ కుట్రలను ప్రతిఘటిస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

‘‘బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కోసం భాజపా ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉంది. అక్కడి కాంట్రాక్టర్‌ కేసీఆర్‌ చుట్టం కాబట్టే విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిర్మల్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో సీఎం ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే మరో రూ.5లక్షల కోట్లు అప్పు చేస్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని భాజపా హామీ ఇచ్చింది. భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వండి. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముథోల్‌ నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో నిలువనీడలేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉంది. భైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదు.. భాజపా వారికి అండగా ఉంటుంది’’ బండి సంజయ్‌, బీజేపీ అధ్యక్షుడు

పాలనలో అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పేరిట కొత్త నాటకానికి తెరతీశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ ఒక్క సీటు కూడా రాదన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్‌ వంటి పార్టీలు, వ్యక్తులు ఎంతమంది వచ్చినా... మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని... రాష్ట్రంలో భాజపా అధికారంలో రాగానే... అవినీతిపై విచారణ జరిపిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పతనం ప్రారంభమైంది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో.. కేసీఆర్‌ ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తారా? వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా... వెయ్యి మంది అసదుద్దీన్‌ ఒవైసీలు వచ్చినా నరేంద్రమోదీ నాయకత్వాన్ని అడ్డుకోలేరు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. కేసీఆర్‌ చేస్తున్న అవినీతి కుంభకోణాలపై భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దర్యాప్తు చేయిస్తుంది. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

ప్రతిపక్షాలను అణచివేయడానికి కేసీఆర్‌ పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారని... ఇక ఎంతోకాలం ఇది కుదరదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. గురుకుల పాఠశాల్లలో దుర్భరమైన పరిస్థితులు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించినా, అడ్డుకోవాలని చూసినా... ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభసభ విజయవంతమైందని భాజపా తెలిపింది.

ఇవీ చూడండి:

ఆ కేసు విషయంలో సామ్​ యశోద మూవకి లైన్​ క్లియర్​.. క్షమాపణలు తెలిపిన చిత్రనిర్మాత

Last Updated :Nov 29, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.