ETV Bharat / state

Monkey fair: ఆ కోతిని వేడుకుంటే కొంగు బంగారం అవుతోంది!

author img

By

Published : Dec 21, 2021, 2:42 PM IST

Monkey fair in dharmaram: పక్కనున్న మనిషి చనిపోతేనే పట్టించుకోని నేటి సమాజంలో... ఓ వానరం చనిపోతే దానికి ఏకంగా గుడికట్టి పూజిస్తున్నారు. ఆ కోతిని వేడుకుంటే కొంగు బంగారం అవుతోందని నమ్ముతున్నారు. అంతే కాదండోయ్ ఇక్కడ​ ఏటా వైభవంగా జతర కూడా నిర్వహిస్తున్నారు. సుమారు 30 క్వింటాళ్ల బియ్యంతో అన్నదానం సైతం చేస్తున్నారు. అసలు కోతి చనిపోతే గుడి కట్టడం ఏంటీ... అది కోరిన కోర్కెలు తీర్చుతుందని నమ్మడమేంటీ? వింతగా ఉందికదూ!... అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది... ఎప్పటినుంచి ఇక్కడ జాతర జరుగుతుందో తెలుసుకుందాం....

Monkey fair
Monkey fair

ఆ కోతిని వేడుకుంటే కొంగు బంగారం అవుతోంది

Monkey fair in dharmaram: నిర్మల్‌ జిల్లా లక్ష్మణ్ చందా మండలం ధర్మారంలో ఏటా నిర్వహించే కోతి దేవుడి జాతర వైభవంగా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వానరానికి గుడి కట్టిన గ్రామస్థులు... అప్పటినుంచి కోతిని దేవుడిగా కొలుస్తున్నారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నమ్ముతున్నారు. 1978లో భక్తుల విరాళాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ వానర దేవుడి ప్రతిష్ఠ వెనుక పెద్ద కథే ఉంది. అదేందో చూద్దాం.

అసలు ఈ గుడి ఎందుకు కట్టించారంటే...

నాలుగు దశాబ్దాల క్రితం ధర్మారం గ్రామం దట్టమైన అడవులతో నిండి ఉంది. రాత్రి వేళల్లో ఇక్కడ బుర్రకథలు, వీధినాటకాలు నిర్వహించేవారు. ఆరోజులలోనే ఒక కోతి అడవి నుంచి వచ్చి నిత్యం ఈ కథలు వింటుండేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇలా గ్రామంలోకి రావడం మొదలుపెట్టిన వానరం కొన్ని రోజుల తర్వాత మితిమీరిన ఆగడాలతో వారికి విసుగు తెప్పించింది. దీంతో అందరూ కలిసి దానిని చంపి ఊరి పొలిమేరలో పాతిపెట్టారు. అదే రోజు రాత్రి వారికి కలలో వచ్చి నన్ను మామూలుగానే చంపారు. కానీ నాకు ఒక మందిరం కట్టండి. మీ ఊరికి ఎంతో సేవ చేస్తూ కొంగుబంగారంగా నిలుస్తానని చెప్పింది. దాంతో మూడు రోజుల తర్వాత కోతి శవాన్ని బయటకు తీసి మరల శాస్త్రోక్తంగా సమాధి కట్టించారు. ఆ తరువాత ఈ ఆలయాన్ని నిర్మించారు.

"ఈ కోతి దేవుడు 1977 నుంచి ఇక్కడ ప్రఖ్యాతి గాంచాడు. ఆ కాలంలోనే ఒక వానరం ఈ గ్రామానికి నిత్యం వచ్చి రాత్రి వేళల్లో వేసే నాటకాలు, బుర్రకథలు వింటుండేది. కొన్ని రోజులకు మితిమీరిన ఆగడాలతో విసుగు చెంది అందరూ కలిసి ఆ కోతిని చంపి ఊరి పొలిమేరలో సమాధి కట్టారు. అలా అప్పటి నుంచి ఏటా డిసెంబర్​లో రెండు రోజులు ఈ జాతరను జరుపుకుంటున్నాం. ఇక్కడ నిర్వహించే అన్నదానం ఈ జాతర ప్రత్యేకత. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా కోతిని కొలుస్తారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు." -రవికుమార్, స్థానికుడు ధర్మారం

దాదాపు 30 క్వింటాళ్ల బియ్యంతో...

అప్పటి నుంచి సమాధిని దర్శించుకుని కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా కోతిని కొలుస్తున్నారు. 1977 నుంచి ఏటా డిసెంబర్ 19 నాడు రథోత్సవం, 20న మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి గ్రామంలోని ప్రజలంతా తమకు తోసినకాడికి బియ్యం ఇవ్వగా... దానిని సేకరించి అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఈ జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి...

ఈ కోతి దేవుని జాతరకు తెలంగాణ నుంచే గాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చి తమ కోర్కెలు తీర్చుకుంటారు. అలాగే సమీప జిల్లాలైన మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్​నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్, గ్రామస్థులు పెద్ద ఏర్పాట్లు చేశారు.

"సుమారు 42 ఏళ్ల నుంచి ఈ కోతి దేవుని జాతరకు వస్తున్నాను. ఇక్కడ నేను ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈ ఆలయం దగ్గర గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా, క్రమశిక్షణతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు చాలా గ్రామాల నుంచి ఈ జాతరకు వస్తారు. ప్రభుత్వం ఈ ఆలయానికి సహాయం అందించి ముఖ్యంగా స్నానపు గదులు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది."-ఆనంద్, భక్తుడు హైదరాబాద్

ఇదీ చదవండి: Telangana Weather Update : తెలంగాణలో రెడ్ అలర్ట్.. మునుపెన్నడూ లేనివిధంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.