ETV Bharat / state

మిర్యాలగూడలో బారులు తీరిన సన్నరకం ధాన్యం ట్రాక్టర్లు

author img

By

Published : Nov 10, 2020, 1:56 PM IST

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో రైస్ మిల్లుల వద్ద సన్న రకం ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. సామర్ధ్యానికి మించి ధాన్యం ట్రాక్టర్లు రైస్ మిల్లుల వద్దకు వచ్చి చేరాయి. ధాన్యం కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఆదివారం క్రాప్ కటింగ్ హాలీడేగా అధికారులు ప్రకటిండంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. మరోవైపు 9, 10 తేదీల్లో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు.

Thin type of grain tractors line up atMiryalaguda, In Nallagonda district
మిర్యాలగూడలో బారులు తీరిన సన్నరకం ధాన్యం ట్రాక్టర్లు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సన్నరకాల ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, రైతులు ఇబ్బందులు పడకుండా రోజువారీగా టోకెన్ల విధానాన్ని రైతులు అనుసరించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. గత పదిరోజులుగా ఇతర ప్రాంతాల నుంచి మిర్యాలగూడకు అధిక మొత్తంలో ధాన్యం రావడంతో మిల్లర్లు స్థాయికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు.

బారులు తీరిన ట్రాక్టర్లు

గత కొన్ని రోజులుగా మిల్లుల వద్ద వేల సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరాయి. రైతులు మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేయడం వల్ల... మిల్లర్లు ఈనెల 9, 10 తేదీల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి 11 నాడు యాథావిధిగా కొనుగోళ్లను పునఃప్రారంభిస్తామని మిల్లుల యాజమానులు తెలిపారు.

దీనితో కొనుగోలు సాఫీగా జరగడానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మిర్యాలగూడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి రైతులు ఇబ్బంది పడకుండా మద్దతు ధర పొందేలా అధికారులతో ప్రణాళికను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, పోలీస్​ శాఖ, వ్యవసాయ మార్కెట్​ అధికారులు సమన్యయంతో టోకెన్​ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

మిర్యాలగూడ డివిజన్​కు 900, ఇతర జిల్లాల రైతులకు 600ల టోకెన్లు ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిల్లుల వద్ద రద్దీ లేకుండా చూసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆరబెట్టి తీసుకురావాలి

ఏ రోజు టోకెన్ పొందిన రైతు అదే రోజు తమ ధాన్యాన్ని మిల్లు వద్ద మద్దతు ధరకు అమ్ముకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టోకెన్ పొందిన రైతులు మాత్రమే ధాన్యాన్ని హార్వెస్టింగ్ చేసి మిల్లుల వద్దకు తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల మిల్లుల వద్ద రైతులు ధాన్యం ట్రాక్టర్లతో వేచి ఉండే పరిస్థితి ఉండదని, ధాన్యం పాడవకుండా మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుందని, అధికారుల సూచనలు పాటిస్తూ ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లు వద్దకు తీసుకువచ్చి ఉన్నట్లయితే మద్దతు ధర పొందవచ్చునని ఈ సందర్భంగా రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.