ETV Bharat / state

Mrugashira Karthe : పంట సాగుపై అన్నదాతల అయోమయం

author img

By

Published : Jun 8, 2021, 7:07 AM IST

నేటి నుంచి మృగశిర కార్తె  కావడంతో రైతులు పొలం బాట పట్టనున్నారు. ఈ తరుణంలో పంటకు కీలకమైన విత్తన సేకరణ సమస్యగా మారింది. ఏ రకం విత్తనం సేకరించాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. దొడ్డు రకాలు ప్రభుత్వం కొంటుందా, సన్నాలను పూర్తిగా మద్దతు ధరకు మిల్లర్లు కొనుగోలు చేస్తారా అనే అయోమయం నెలకొంది.

kharif crops ,kharif crops in telangana
ఖరీఫ్ సాగు, ఖరీఫ్ సాగుపై అయోమయం, తెలంగాణలో ఖరీఫ్ సాగు

గతేడాది వానాకాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 70 శాతం మంది రైతులు దాదాపు 9 లక్షల ఎకరాలలో సన్నాలను పండించారు. 2,50,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనకపోవడంతో మిల్లర్లే దిక్కయ్యారు. ప్రస్తుతం కేంద్రం బియ్యం సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టడం లేదు. పచ్చి బియ్యం ఎక్కువ పెట్టి ఉప్పుడు బియ్యం తక్కువ ఇవ్వాలని రాష్ట్రాలకు లేఖలు పంపుతోంది.

ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సైతం వేటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందనే చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ తగ్గిందని, అందుకే వరి తగ్గించి పత్తిసాగు పెంచాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకం లేదు. అంతా సన్నాలు సాగుచేస్తే మిల్లర్లు కొనలేక ధర పూర్తిగా తగ్గించే అవకాశముంది. దీనికి తోడు దిగుమతులూ కష్టమే. దొడ్డు రకాలు సాగు చేస్తే ప్రభుత్వం కొనకపోతే ఏం చేయాలనే సందిగ్ధత నెలకొంది.

ఆయకట్టులో సన్నాలకే మొగ్గు

సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో మాత్రం 70 శాతం మంది రైతులు సన్నరకాలనే సాగుచేస్తున్నారు. ప్రధానంగా స్వల్పకాలిక వంగడాలను అంటే 120-125 రోజుల్లో పంట చేతికి వచ్చే వాటిని ఎంచుకుంటున్నారు. ప్రైవేటు విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. రాజేంద్రనగర్‌, బాపట్ల, కూనారం, వరంగల్‌, మార్టేరు పరిశోధనా స్థానాల్లో విడుదలైన రకాల సాగు అంతంత మాత్రమే.

ముందస్తు చర్యలు అవసరం

సన్న రకాల సాగు పెరిగితే ప్రభుత్వం, అధికారులు, మిల్లర్లు ముందస్తు చర్యలు, ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. సన్నాలకు మద్దతు ధర రూ.1,900కి తగ్గకుండా చూడాలి. ప్రతిరోజు టోకెన్‌ల ప్రకారం ఎన్ని ట్రాక్టర్ల్లు దిగుమతి చేసుకుంటారో మిల్లర్లతో రెవెన్యూ, పోలీస్‌, పౌరసరఫరాల శాఖలతో సమావేశాలు నిర్వహించుకొని ఆ ప్రకారమే ధాన్యం తరలించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.