ETV Bharat / state

నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది

author img

By

Published : Oct 30, 2020, 11:32 AM IST

నిమ్మ దిగుబడుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాది అగ్రస్థానం. 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా... సరైన ధర దక్కని దుస్థితి. ఇక కొవిడ్ రూపేణా సరఫరా అగమ్యగోచరంగా మారి పరిస్థితి మరింత దిగజారింది. బయట రెండు రూపాయలకో నిమ్మకాయ అమ్ముతుంటే... అందుకు భిన్నంగా రైతుకు 23 కిలోల సంచికి రూ. 250 కూడా దక్కడం లేదు.

నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది
నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది

రోగనిరోధక శక్తి పెంచేందుకు నిమ్మ జాతి పండ్లను అధికంగా తీసుకోవాల్సిన కరోనా విపత్తు సమయంలోనూ... పంటకు గిరాకీ లేకుండా పోయింది. శానిటైజర్ల తయారీలోనూ ఉపయోగపడే ఈ జాతి పండ్లను కొనేందుకు... ఎవరూ ముందుకు రావడం లేదు. 23 కిలోల సంచికి గతంలో రూ. 800 నుంచి 1,000 పలికేది. కానీ ప్రస్తుతం రూ. 250 కూడా రాని పరిస్థితి. ఎకరానికి 80 చెట్లు పెంచే రైతన్నలు దిగుబడులు బాగున్నా... ఆశించిన ధర లేక పెట్టుబడులు సంపాదించడమే గగనమైపోతుంది.

దళారుల మాయాజాలం..

నిమ్మ పంట సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాది ప్రథమ స్థానం. నకిరేకల్ ప్రాంతం ప్రధాన కేంద్రం కాగా... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగుచేశారు. 18 వేల కుటుంబాలకు నిమ్మ సాగు జీవనాధారం కాగా ఏటా 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల టన్నులుంటే, అందులో సగానికిపైగా నల్గొండ జిల్లా నుంచే వస్తోంది. దళారులు, వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిమ్మ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నా... కార్యరూపం దాల్చడం లేదు.

ఎగుమతులు తగ్గిపోయాయి..

రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిమ్మ మార్కెట్​ను అందుబాటులోకి తెచ్చినా... ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. సరకును నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల ఉదయం తెంపితే రాత్రి కల్లా వాటిని అమ్ముకుని సరఫరా చేయాల్సి ఉంటుంది. దిల్లీ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల సంఖ్య తగ్గిపోయింది. పైపెచ్చు కొందరు కమీషన్ దారులు వ్యాపారులతో కుమ్మక్కవ్వడం ధరలు పడిపోవడానికి కారణంగా నిలుస్తోంది.

సిబ్బంది కొరత..

నకిరేకల్​లో నిమ్మ విపణి ఏర్పాటు చేసినా... అక్కడ ప్రత్యేక సిబ్బంది అంటూ ఎవరూ లేరు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి అనుబంధంగా ఉండటం వల్ల అందులో పనిచేసేవారే ఇక్కడా సేవలందిస్తున్నారు. ఇదే అదనుగా కమీషన్ దారులు, వ్యాపారులు... రైతులకు ధరల్ని దక్కకుండా చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.