ETV Bharat / state

CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

author img

By

Published : Aug 2, 2021, 1:22 PM IST

Updated : Aug 2, 2021, 2:41 PM IST

cm-kcr-speech-in-haliya-about-krishna-water
cm-kcr-speech-in-haliya-about-krishna-water

13:05 August 02

కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ చేస్తోంది: సీఎం కేసీఆర్

'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీర్​ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం... తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. సాగర్​ ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు హాలియాకు విచ్చేసిన సీఎం కేసీఆర్​... అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సమీక్షాసమావేశంలో ప్రసంగించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడం వల్ల నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందని వివరించారు.

హాలియాను బాగుచేసి చూపిస్తా...

"నాకు కరోనా సోకడం వల్ల హాలియాకు రావడం ఆలస్యమైంది. సాగర్ ప్రచారం తర్వాత కరోనా బారినపడ్డా. సాగర్‌ ఉపఎన్నికలో తెరాసను గెలిపించిందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. నాగార్జునసాగర్ సమస్యలను తెరాస నేతలు నా దృష్టికి తెచ్చారు. హాలియా ఏం బాగాలేదు.. బాగుచేసి చూపిస్తా. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌లో ఉన్నవారికి .. నందికొండ ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారికి క్రమబద్ధీకరిస్తాం. నెల రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందిస్తాం. హాలియా, నందికొండకు రూ.15 కోట్ల చొప్పున కేటాయించాం. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తాం. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించాం. నాలుగైదు రోజుల్లో సాగర్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తా. సాగర్ నియోజకవర్గంలో పెద్దఎత్తున బంజారాలు ఉన్నారు. వాళ్ల కోసం బంజారా భవనం నిర్మిస్తాం."

 - కేసీఆర్​, ముఖ్యమంత్రి.

దళితబంధుతో దేశానికే ఆదర్శం...

దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్​ పునరుద్ఘాటించారు. దళితబంధుపై అనేక అపోహలు, అనుమానాలు రేకెత్తిస్తున్నారని... పైలెట్​ ప్రాజెక్టు తర్వాత వాటన్నింటికీ సమాధానం దొరుకుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయన్న సీఎం... 12 లక్షల కుటుంబాలు దళితబంధు పథకానికి అర్హత ఉన్నవన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దళితబంధు పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. తానే స్వయంగా పర్యవేక్షించి.. ఆరునూరైనా దళితబంధు అమలు చేసి చూపుతామని ఉద్ఘాటించారు. ఈ పథకం అమలు తర్వాత... తెలంగాణ ఎస్సీలు దేశానికి ఆదర్శమవుతారని పేర్కొన్నారు. దళితబంధు అమలుచేస్తే తమకు పుట్టగతులు ఉండవని విపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

రెండు పంటలు పండించుకుందాం..

"సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నాగార్జునసాగర్ కట్టపై 50 వేల మంది రైతులతో దండోరా మోగించి.. ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయించుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఏపీ అడ్డుపడుతుంటే.. నిన్ననే మీ జిల్లా​ నాయకులు వెళ్లి నీళ్లు విడుదల చేశారు. 15వ సారి మన వాటా మనం తీసుకుని రెండు పంటలు సాగర్​ కింద పండించుకుంటున్నాం. ఇదే పద్ధతిలో కృష్ణాలో మన వాటా తీసుకుని కచ్చితంగా సాగర్​ ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే ఏర్పాటు చేసుకుందాం. రాబోయే రోజులలో కృష్ణా నది నీళ్లలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఎదుర్కునేందుకు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పెద్దదేవులపల్లి చెరువు నుంచి పాలేరు రిజర్వాయర్​ అనుసంధానం చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సర్వే జరుగుతోంది. ఇది జరిగితే.. సాగర్​ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం దొరికి... సురక్షితంగా ఉంటుంది."  - కేసీఆర్​, ముఖ్యమంత్రి

జానారెడ్డి భుజాన ఇంకా కాంగ్రెస్​ కండువానే ఉంది...

24 గంటల విద్యుత్ ఇస్తామంటే జానారెడ్డి ఎగతాళి చేశారు గుర్తు చేశారు. రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని జానారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తే తెరాస కండువా కప్పుకుంటానని జానారెడ్డి చెప్పారు. రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ ఇస్తున్నా... జానారెడ్డి మాత్రం కాంగ్రెస్‌ కండువా కప్పుకునే మొన్న సాగర్​లో పోటీ చేశారన్నారు. కాంగ్రెస్ కండువాపై పోటీచేసిన జానారెడ్డికి సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం తెలిపారు. 

కొనసాగనున్న ప్రగతి ప్రస్థానం...

ఎంత మంది అడ్డుపడినా.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని జీర్ణం చేసుకోలేకపోయినా... విజ్ఞులైన ప్రజలు తమను దీవిస్తే ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవ్వరికి ఎలాంటి బాధలున్నా, సమస్యలున్నా సమావేశాల్లో వెనక నుంచి అరిచే అవసరం లేదని... నేరుగా నాయకుల దగ్గరకొచ్చి చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. అందరి సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాల కృషిచేస్తామని కేసీఆర్​ మాట ఇచ్చారు.

ఇదీ చూడండి: 

Supreme Court : 'కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి'

Last Updated : Aug 2, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.