ETV Bharat / state

గింజలంటే అతడికి ప్రాణం.. జీవ వైవిధ్య రక్షణలో లీనమైన విద్యార్థి

author img

By

Published : Nov 7, 2021, 10:58 PM IST

జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు నడుంబిగించాడో యువకుడు. అభిరుచిని తన వృత్తిగా మార్చుకొని జీవ వైవిధ్యం కోసం తనవంతు సాయపడుతున్నాడు. అంతరించిపోతున్న మొక్కలు, వాటి విత్తనాలను సంరక్షించేందుకు కృషి చేస్తున్నాడు. విత్తన సంరక్షణే లక్ష్యంగా పుడమిపై పురుడు పోసుకున్న ప్రకృతిని కాపాడటంలో లీలమైపోయిన యువకుడి అభిరుచిపై ప్రత్యేక కథనం.

green nuts
green nuts

గింజలంటే అతడికి ప్రాణం.. జీవ వైవిధ్య రక్షణలో లీనమైన విద్యార్థి

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరుకు చెందిన మల్లయ్య, ఎల్లమ్మల సంతానం రమేశ్​. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి రమేశ్​కు వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. పదోతరగతిలో ఉండగా.. జీవవైవిధ్య సదస్సుకు హాజరైన రమేశ్​కు వ్యవసాయంపై మరింత ఇష్టమేర్పడింది. ఆ ఇష్టంతోనే బీఎస్​సీ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు. ఖాళీ సమయాల్లో తమ చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ పొలాలకు వెళ్లి అక్కడ కనిపించే వివిధ రకాల పండ్లు, కాయగూరల మొక్కల విత్తనాలు సేకరించడం అలవాటుగా మొదలుపెట్టాడు. కాలక్రమేణా అది ఇష్టంగా మారిపోయింది.

సేకరించిన విత్తనాలు
సేకరించిన విత్తనాలు

సేకరించిన విత్తనాలను భద్రపరిచి... వాటి వివరాలు, ఆయా విత్తనాల శాస్త్రీయ నామాలు, వాటి ఉపయోగాలు, అవి ఎక్కడ లభిస్తాయి తదితర వివరాలన్నీ సేకరించి భద్రపరుస్తున్నాడు. కొన్ని విత్తనాల వివరాలు తెలియకపోతే ఊళ్లోని పెద్దలను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేవాడు. విత్తనాలు సేకరించడానికి కొన్ని సార్లు నల్లమల అడవులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. అక్కడ లభించిన విత్తనాల వివరాలు తెలుసుకోడానికి స్థానిక తెగల వారి సహాయం తీసుకునేవాడు.

అలవాటుగా మొదలై..

అటవాటుగా మారిన విత్తన సేకరణ... రమేశ్​ను విత్తనాల రమేశ్​గా మార్చింది. విత్తనాల సేకరణ కోసం ఒక్కోసారి కొన్ని వారాల పాటు వేరే ప్రాంతాలకు వెళ్లి... రవాణా సదుపాయం లేని కొండ ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి విత్తనాలు తెచ్చుకునేవాడు. ఇలా సేకరించిన వాటి గురించి తెలుసుకొని ఇతరులకు అవగాహన కల్పిస్తున్నాడు. పలు అవగాహన సదస్సులకు హాజరై మొక్కల ప్రాధాన్యతను వివరిస్తున్నాడు. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష జాతులకు సంబంధించిన విత్తనాలు సేకరిస్తూ ఎన్నో ప్రశంసా పత్రాలు, అవార్డులు అందుకున్నాడు.

రమేశ్​ సాధించిన అవార్డులు
రమేశ్​ సాధించిన అవార్డులు

హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు హాజరయ్యే వరకు నాకు బయోడైవర్సిటీ అంటే ఏమిటో తెలియదు. అక్కడ తెలుసుకున్న సమాచారంతో నేను పరిశోధన చేసి అందుకు నేనేమైనా చేయగలుగుతానా అని ఆలోచించి... అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ వాటి విత్తనాలు సేకరించడం మంచి పద్ధతని నేను అప్పటి నుంచి విత్తనాలు సేకరించడం మొదలు పెట్టాను. పొలానికి వెళ్లినప్పుడు అక్కడ లభించే రకరకాల విత్తనాలు సేకరించి ఊళ్లోకి తెచ్చి వాటి గురించి పెద్దలను అడిగి తెలుసుకునేవాడిని. కొన్ని కొన్ని విత్తనాలను గుర్తిండానికి మొక్క భాగాలను కూడా తీసుకెళ్లి అడిగి తెసుకునే వాడిని. అంతే కాకుండా వాటి శాస్త్రీయ నామాలు తెలుసుకోడానికి పలు పద్ధతులు ఉపయోగించి తెలుసుకునేవాడిని. అంతే కాకుండా వాటి ఔషధగుణాల గురించి సమాచారం సేకరించేవాడిని. దాదాపు ఇప్పటి వరకు 500 రకాల విత్తనాలు సేకరించాను. తెలంగాణ, ఆధ్రప్రదేశ్​లో సుమారు 650 కిలోమీటర్లకు పైగా నడిచాను. అంతే కాకుండా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆయా గ్రామాల ప్రజలతో వాటికి సంబంధించి వివరాలు తెలుసుకునేవాడిని. 2015లో రవీంద్ర భారతిలో నేను సేకరించిన విత్తనాలతో ప్రదర్శన ఏర్పాటు చేశాను. అప్పటి గవర్నర్​ నా ప్రయత్నాన్ని అభినందించారు. తర్వాత తెలంగాణ బయోడైవర్సిటీ వారితో సంబంధం ఏర్పడింది. వాళ్లు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తారు. కార్యక్రమాలకు హాజరైన వారికి జీవ వైవిద్యంపై అవగాహన కల్పిస్తున్నాను. నా ప్రయత్నానికి గాను సీజీఆర్​ వారు గ్రీన్​ స్టూడెంట్​ అవార్డు ఇచ్చారు. అహ్మదాబాద్​లో జరిగిన ఫుడ్​ ఫెస్టివల్​లో తెలంగాణ నుంచి ఎంపికై వ్యవసాయ పరంగా ఉన్న జీవ వైవిద్యం గురించి వివరించాను. మన ప్రకృతి ప్రతి మొక్క మనకు ఉపయోగపడుతుంది. కానీ వాటి మనకు చాలా వరకు తెలియదు. -విత్తనాల రమేశ్​, విద్యార్థి.

సాయం అందిస్తే...

కొండ కోనలు తిరిగి తాను సేకరించిన విత్తనాలను భద్రపరిచేందుకు సరైన సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ప్రకృతిని కాపాడానికి రమేశ్​ చేస్తున్న కృషికి కాస్త చేయూతనందిస్తే మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని రమేశ్​ కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబ సభ్యులతో రమేశ్​
కుటుంబ సభ్యులతో రమేశ్​

మా మేనళ్లుడు మేము పొలానికి వెళ్తున్న సమయంలో మా వెంట వచ్చేవాడు. ఖాళీ సమయాల్లో విత్తనాలు సేకరిస్తూ ఉండేవాడు. ఆయా విత్తనాలకు సంబంధించి మమ్మల్ని వివరాలు అడిగి తెలుసుకునేవాడు. చాలా దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు సేకరించేవాడు. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందిస్తే మరింతగా విత్తన సేకరణకు అనుకూలంగా ఉంటుంది. -మల్లేశ్​, రమేశ్​ మేనమామ.

ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది.. కానీ మనం ప్రకృతికి మనుగడ లేకుండా చేస్తున్నాం. ఊపిరినిచ్చే ప్రకృతికి ఊతం ఇచ్చేవారికి సాయం చేస్తే పరోక్షంగానైనా ప్రకృతికి సాయపడినవారమవుతాం.

ఇదీ చూడండి: Natural Farming : ఒకేచోట 130 రకాల వరి వంగడాలు సాగు.. ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.