ETV Bharat / state

కొల్లాపూర్ మామిడికి.. తామర పురుగు ముప్పు

author img

By

Published : Jan 27, 2023, 1:16 PM IST

Nagarkurnool district
Nagarkurnool district

Insect Pests of Kolhapur Mango: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కొల్లాపూర్ మామిడి ప్రఖ్యాతి గాంచింది. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్పత్తి అయిన మామిడి దేశ విదేశాలకు ఎగుమతి అవడమే కాకుండా.. తెలంగాణలోనూ మంచి డిమాండ్ ఉంది. అలాంటి పంటను పండించే కొల్లాపూర్ మామిడి రైతులు.. మూడేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. అదే జీవనాధారంగా బతుకుతున్న కౌలు రైతులు అప్పులపాలవుతున్నారు. కారణం.. రెండేళ్లుగా మామిడి పంటను సోకుతున్న తామర పురుగు సహా ఇతర తెగుళ్లు.. దిగుబడే లేకుండా చేస్తున్నాయి. పూత, పిందె, కాయ అన్నీరాలి.. ఏ తోట చూసిన ఒక్క కాయ కనిపించకుండా పోయిందంటే ఈ ఏడాది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కొల్లాపూర్ మామిడికి.. తామర పురుగు ముప్పు

Insect Pests of Kolhapur Mango: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా మామిడి తోటలున్న ప్రాంతం కొల్లాపూర్. కొల్లాపూర్ ప్రాంతంలో పండే మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయిన మామిడి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. నాగర్​కర్నూల్ జిల్లాలో 32,000 ఎకరాల్లో మామిడి సాగైతే.. అందులో 22,000 ఎకరాలు కొల్లాపూర్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి.

మూడేళ్లుగా నష్టాల ఊబిలో అన్నదాతలు: ఏటా లక్షా 28వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే.. అందులో 52,000 మెట్రిక్ టన్నుల వరకూ కొల్లాపూర్ నుంచే ఉత్పత్తి అవుతాయి. సుమారు 10,000 మంది రైతులు.. బేనేషాన్, దశేరి, కేసరి, హిమాయిత్, రసాల్, తోతాపురి రకాలను సాగుచేస్తారు. అంతటి ప్రాధాన్యమున్న మామిడిని పండిస్తున్న అన్నదాతలు మాత్రం మూడేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. కారణం మామిడిని ఆశిస్తున్నతెగుళ్లు. గతేడాది తామర పురుగు దాడి చేయడంతో.. పూత, కాత లేక దిగుబడులు సగానికి పైగా పడిపోయాయి.

కాయలు లేక వెలవెలబోతున్న తోటలు: అంతకుముందు సంవత్సరం కొవిడ్ కారణంగా డిమాండ్ లేకుండా పోయింది. ఈ ఏడాది పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చూస్తే పచ్చగా, తెల్లని పూతతో కనిపిస్తున్న తోటలు. కాయలే లేక వెలవెలబోతున్నాయి. పురుగు మందులమ్మే వ్యాపారులు, ఉద్యాన అధికారులు ఎన్నిరకాల మందులు సూచించినా.. దేనికీ తెగుళ్లు నియంత్రణలోకి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది తోటలు తీసేయక తప్పదు: పురుగుమందుల కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశామని.. బకాయిలు పెరిగి చివరికి వ్యాపారులు సైతం పురుగు మందులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రైతులంటున్నారు. తామర పురుగు ఉద్ధృతిని తగ్గించే మందులు కనిపెట్టలేకపోతే.. వచ్చే ఏడాది తోటలు తీసేయక తప్పదని అభిప్రాయపడుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో సొంతంగా తోటలు సాగుచేసే వాళ్లకంటే.. కౌలురైతులు సాగుచేసే విస్తీర్ణమే ఎక్కువ. వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

ఈసారి 10 శాతం దిగుబడి కూడా రాదు: ఈ ఏడాదైనా కలిసి వస్తుందని ఎంతో ఆశగా తోటల్ని తీసుకున్నారు. తామర పురుగు తెగులు వ్యాప్తిని చూసి.. ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈసారి 10 శాతం దిగుబడి కూడా రాదని వారు ఆవేదన చెందుతున్నారు. కొల్లాపూర్ మాత్రమే కాదు.. అచ్చంపేట నియోజక వర్గంలో 2,347, కల్వకుర్తిలో 5,000, నాగర్ కర్నూల్ 2,500 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. దాదాపు అన్నితోటల పరిస్థితి ఇదే. ఇప్పటికైనా ఉద్యానశాఖ తెగుళ్ల నివారణపై ప్రత్యేక దృష్టి సారించకపోతే రైతులు.. తోటల్ని తీసివేసి ప్రత్యామ్నాయా పంటల వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"పూతలు చెట్లపై నిలవడం లేదు. మొత్తం పూత రాలిపోతుంది. పురుగుమందులు వాడుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. తామర పురుగు ఆకును నల్లగా చేసి కాయ రాకుండా చేస్తుంది. ఈసంవత్సరం కూడా దిగుబడి సగానికి పైగా పడిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని కోరుతున్నాం." - మామిడి రైతులు

ఇవీ చదవండి: భాగ్యనగరానికి కొత్తందాలు.. మరిన్ని పర్యాటక సొబగులు

అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.