నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు

author img

By

Published : Mar 14, 2021, 3:22 AM IST

Updated : Mar 14, 2021, 4:38 AM IST

నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు

నల్లమల అడవుల్లో వరుస అగ్నిప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అడవుల్లో చెలరేగిన మంటల్లో ఏడుగురు చెంచులు చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉస్మానియాలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న మషుషులే తీవ్రంగా గాయపడితే.. అటవీ జంతువుల పరిస్థితిని అంచనా వేయొచ్చు. మంటలు వ్యాపించకుండా ఫైర్ లైన్లు, వ్యూలైన్ల లాంటివి ఏర్పాటు చేసినా మంటలు చెలరేగినప్పుడల్లా వాటిని నియంత్రించినా ఎక్కడో మూల అగ్నిప్రమాదాలు జరగడం కలవరపెడుతోంది. మానవ తప్పిదాలే అడవుల్లో మంటలకు కారణమంటున్న అటవీశాఖ అధికారులు స్థానికులు సహా పర్యాటకుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.

నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు

నల్లమల అడవుల్లో ఏదోమూల నిత్యం జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో 5కు పైగా జరిగిన ప్రమాద సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఫిబ్రవరి 4న వట్వర్లపల్లిలో, ఫిబ్రవరి 14న పదర మండలం లక్ష్మాపూర్ సమీపంలోని చెన్నంపల్లిలో.. మార్చి 1న అక్టోపస్ వ్యూపాయింట్ సమీపంలో, మార్చి7న మల్లాపూర్ చెంచు పెంటల సమీపంలో.. మార్చి9న మల్లాపూర్, రోళ్లబండ పెంటల సమీపంలో నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మార్చి7న మల్లాపూర్ పెంట సమీపంలో మంటలు అంటుకున్న ఘటనలో.. ఏడుగురు చెంచులు చిక్కుకుని తీవ్రంగా గాయపడగా వారిని హైదరాబాద్, మహబూబ్ నగర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఉస్మానియాలో చికిత్స పొందుతూ.. ఓ వ్యక్తి శనివారం ప్రాణాలు కోల్పోయారు. మార్చి 12న అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపేట సమీపంలోనూ.. మళ్లీ మంటలు అంటుకున్నాయి. ఇలా వరుస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటవీ శాఖ వెబ్​సైట్ టీజీఎఫ్ఎమ్ఐఎస్ గణాంకాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో 987 ఫైర్ అలెర్ట్​లు రాగా.. 2 వేల 669 హెక్టార్ల అడవి మంటల బారిన పడింది. రాష్ట్రంలో అత్యధిక ప్రమాదాలు, ఎక్కువ విస్తీర్ణంలో అడవి దగ్ధమైంది కూడా... నాగర్ కర్నూల్ జిల్లాలోనే.

మానవతప్పిదాలే కారణమా..

మానవతప్పిదాల కారణంగానే అడువుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. ఇందులో లక్షా 75వేల హెక్టార్లు పులుల అభయారణ్యం. చెట్లరాపిడి వల్ల నిప్పు పుట్టేంత పెద్దవృక్షాలు నల్లమల అడవుల్లో లేవని అధికారులంటున్నారు. ఎవరైనా నిప్పు రవ్వల్ని వదిలితేనే... గడ్డి అంటుకుని, వేగంగా ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు

ఎన్ని ఏర్పాట్లు చేసినా..

అడవుల్లో మంటలు విస్తరించకుండా అటవీశాఖ అధికారులు ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. అడవిలోని రోడ్డు మార్గానికి ఇరువైపుల సుమారు 10మీటర్ల దూరం వరకూ పూర్తిగా గడ్డి, పొదలు లేకుండా చేస్తారు. ఆయా మార్గాల గుండా.. వెళ్లే ప్రయాణీకులు రోడ్డుపక్కన నిప్పురవ్వలు పడేసినా అవి ఇతర ప్రాంతాలకు విస్తరించవు. ఇక అడవుల మధ్యలో ఐదారు మీటర్ల వెడల్పుతో గడ్డి లేకుండా బాటల్లా ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక ప్రాంతంలో మంటలు అంటుకున్నా మరో ప్రాంతానికి విస్తరించకుండా... ఫైర్ లైన్లు అడ్డుకుంటాయి. అలా ఎన్ని ఏర్పాట్లు చేసినా మంటలు అంటుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.

మంటల్ని నియంత్రిస్తున్నారు..

మంటలు అంటుకున్నా వాటిని ఆర్పేందుకు నల్లమలలో 6 తక్షణ స్పందన బృందాలున్నాయి. వీరితో పాటు బీట్ అధికారులు, రేంజ్ అధికారులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటారు. పచ్చికొమ్మలు, బ్లోయర్లు, ఇతర అధునాతన యంత్రాలతో సిబ్బంది మంటల్ని నియంత్రిస్తున్నారు. కాని నల్లమల అడవుల్లో ఎత్తైన గుట్టలు, లోతైన లోయల్లాంటి ప్రాంతాలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో మంటలు అంటుకుంటే వెళ్లడం కష్టంగా మారుతోంది. అక్కడే నష్టం అధికంగా ఉంటోంది. ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని... అడవుల్లో నివసించే చెంచులు, ఇతర ఆవాస గ్రామాల ప్రజలకు, ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు అధికారులు.

ప్రశ్నార్థకంగా జంతుజాలం మనుగడ

నల్లమలలో జరిగే వరుస ప్రమాదాల కారణంగా అరుదైన వృక్ష సంపద అగ్నికి అహుతి కావడమే కాదు.. అక్కడ నివసించే జంతుజాలం మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అవసరమైతే అధిక నిధులు వెచ్చించి నల్లమలలో అగ్ని ప్రమాదాలను నియంత్రించాలని అటవీ ప్రేమికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కూలీ డబ్బులతో పొట్టపోసుకుంటున్న మహారాష్ట్ర కూలీలు

Last Updated :Mar 14, 2021, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.