ETV Bharat / state

భూగర్భ జలాలు అడుగంటిపోయే.. కాలువ నీళ్లు ఆగిపోయే.. పంట చేతికొచ్చేదెలా..!

author img

By

Published : Apr 9, 2023, 8:14 AM IST

Farmers Face Problems Without Water For Crops
Farmers Face Problems Without Water For Crops

Farmers Struggling To Get Irrigation Water Under KLI: నీళ్లొస్తాయనే నమ్మకంతో పంటలు వేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. బోరుబావుల ద్వారా కాపాడుకుందామంటే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వచ్చీపోయే కరెంటుతో బోరుబావుల నుంచి సక్రమంగా జలాలు పారని పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్న కేఎల్ఐ చివరి ఆయకట్టు రైతుల దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

కేఎల్‌ఐ కింద సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు.. గగ్గోలు పెడుతున్న రైతులు

Farmers Struggling To Get Irrigation Water Under KLI: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగైన చివరి ఆయకట్టు ఎండిపోతోంది. కేఎల్ఐ కింద యాసంగిలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, మిరప సహా పలు రకాల పంటలు సాగు చేశారు. యాసంగిలో కేఎల్ఐ కింద 2 లక్షల 64 వేల ఎకరాలకు ఆరు తడి పంటలకు, వారాబందీ విధానంలో సాగు నీరు అందిస్తామని నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక రచించారు. శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత లేక పదిహేను రోజులుగా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. పంటలకు నీరందక అవి ఎండిపోయే స్థితికి వచ్చాయని.. కనీసం పెట్టుబడి రాని దుస్థితి నెలకొందని వాపోయారు.

Farmers Problems : కేఎల్​ఐ కింద నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నాగర్‌ కర్నూల్, కల్వకుర్తిలోని మండలాల్లో రైతులు మొక్కజొన్నను విస్తృతంగా సాగు చేశారు. కాల్వ నీళ్లపై నమ్మకం పెట్టుకుని వేసిన పంట సాగు జలాలు లేక ఎండిపోతోంది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి రాగా.. పాలకంకి దశలోనే పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వేరు శనగ సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. సకాలంలో పంటకు నీరందక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.

యాసంగిలోనూ కేఎల్​ఐ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పడంతో ఆరుతడికి కాకుండా వరికి ప్రాధాన్యమిచ్చారు. 15 రోజులుగా నీళ్లు అందక పొట్ట దశకు వచ్చిన వరి ఎండిపోతోంది. బోరుబావుల్లో జలాలు అడుగంటడం.. పులి మీద పుట్రలా కరెంటు కోతలతో సాగుదారులు అల్లాడిపోతున్నారు. కేఎల్​ఐ కింద చివరి ఆయకట్టుకు మాత్రం నీరందకపోవడం వల్ల 50 శాతం వరి ఎండిపోయే స్థితికి వచ్చిందని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. కేఎల్​ఐ ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలు బతకాలంటే.. మరో 20 రోజుల పాటు వారాబందీ విధానంలో సాగునీరు అందించాలి. బోరుబావుల్లోనూ నీరింకి పోవడం వల్ల పంటలను కాపాడుకోలేని పరిస్థితి. పరిహారం అందించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో మెక్కజొన్న వేశాను. పెట్టుబడి రూ.50 వేల దాకా అయింది. కాలువ రావట్లేదు.. ఎండిపోయింది. దీంతో నాకు రూ.రెండు లక్షల పంట నష్టం అయ్యింది. చేను మొత్తం ఎండిపోయింది. పంట తీస్తే ఇప్పుడు కూలీకి కూడా రావు. - బాధిత రైతులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.