ETV Bharat / state

jaggary Sales in Medaram Jatara: మేడారం దగ్గరపడింది.. బెల్లం ధర కొండెక్కింది..

author img

By

Published : Jan 31, 2022, 1:16 PM IST

Updated : Feb 1, 2022, 9:25 AM IST

jaggary Sales in Medaram Jatara: శివసత్తుల పూనకాలు.. డప్పు చప్పుళ్లు.. బంగారమెత్తుకుని బయల్దేరిన భక్తులు.. కనుచూపు మేరలో ఇసుకేస్తే రాలనంత జనంతో తెలంగాణ కుంభమేళా అదేనండీ.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. అయ్యో.. అదేనండీ మన సమ్మక్క-సారలమ్మల మహా జాతర సంబురం మొదలైంది. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మహా సంబురంగా చేసుకునే ఈ జాతరకు ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మలకు అత్యంత ప్రియమైన బంగారాన్ని నెత్తిన పెట్టుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు సమర్పించుకునే ఈ బంగారం.. అదేనండీ బెల్లం వ్యాపారం .. జాతరకు నెలరోజుల ముందే జోరందుకుంటుంది. భారీ మొత్తాల్లో దిగుమతి అవుతోంది.

Bellam Sales in Medaram Jatara
Bellam Sales in Medaram Jatara

jaggary Sales in Medaram Jatara : తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేది వరకు జరగనుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి మేడారం తరలి వస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు మొక్కు చెల్లింపుల్లో ప్రధానమైనది బెల్లం.. కోరిన కోర్కెలు తీరితే ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించుకుంటామని మొక్కుకున్న వారు సమ్మక్క పున్నం (పౌర్ణమి) మొదలుకుని జాతర వరకు బెల్లాన్ని సమర్పించుకుంటారు. మేడారం జాతరకు నెల రోజుల ముందు నుంచే బెల్లం వ్యాపారం జోరందుకుంది. వరంగల్ ప్రాంతానికి భారీగా బెల్లం దిగుమతి అవుతోంది.

బీటు బజార్​లో బెల్లం..

bellam Sales in Medaram Jatara : వరంగల్​లోని పాత బీటు బజారు నిత్యావసర సరుకులకు కొనుగోలు చేసే వినియోగదారులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పాత బీటుబజార్ నుంచే అత్యధికంగా బెల్లం రవాణా అవుతుంది. జాతర సమయంలో ఇక్కడికి అన్ని వర్గాల వ్యాపారులు చేరి.. బెల్లం విక్రయాలను ప్రారంభిస్తారు. జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల భక్తులు రోడ్డు, రైలు మార్గం ద్వారా వరంగల్ మీదుగా వెళ్తుంటారు. అదే సమయంలో పాత బీటుబజారుకు చేరుకొని బెల్లం కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఉమ్మడి వరంగల్​లోని వివిధ ప్రాంతాలకు టోకుగా కూడా ఇక్కడి నుంచే వ్యాపారులు తీసుకెళ్తారు. ఇటీవల జనగాం, మహబూబాబాద్, పరకాల, వర్ధన్నపేట, స్టేషనఘనపూర్, భూపాలపల్లి, ములుగు, ఇతర పట్టణాల్లో కూడా బెల్లం వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఆ రాష్ట్రాల నుంచి దిగుమతి..

Jaggery Trading in Medaram Jatara : పాత బీటుబజారుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మహారాష్ట్ర, కర్ణాటకలోని మాండ్యతో పాటు ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి, చిత్తూరు నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్, పూణే నుంచి ఎక్కువ శాతం బెల్లం దిగుమతి అవుతుంది. అలాగే నేరుగా కూడా మేడారానికి తెచ్చుకుంటున్నారు.

భారీ ఎత్తున బెల్లం వ్యాపారం..

Jaggery Traders in Medaram Jatara : మమూలు రోజుల్లో సుమారు 10 టన్నుల వరకు వ్యాపారం జరిగితే జాతర సమయంలో 35 నుంచి 40 టన్నుల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అంటే దాదాపు ఒక్క బీటు బజారులోనే నెల రోజులకు సుమారుగా 1200 టన్నుల బెల్లం దిగుమతి అవుతున్నట్లు అంచనా. ఒక్కో టన్నుకు రూ. 35 వేలు అయినా రూ. 42 కోట్ల టోకు వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. టోకు వర్తకమే రూ.14 కోట్ల వరకు అవుతుంది. చిల్లర ధరతో దాదాపుగా జాతర పేరిట రూ.20 కోట్ల విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. జాతర ముగిసే వరకు ఇంకా.. వ్యాపారం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

జాతర మొదలైతే.. ధర పెరుగున్..

Bellam Price in Medaram Jatara: సంవత్సరం పొడవునా పాత బీటుబజార్​లో కొద్ది మంది వ్యాపారులు సిండికేట్​గా మారి బెల్లం రేట్​ను నియంత్రిస్తారని సమాచారం. ఇది బహిరంగ రహస్యం. వారికి ఎక్సైజ్ శాఖ అధికారులు అండగా ఉంటారనే ఆరోపణలూ ఉన్నాయి. హోల్​సేల్​ మార్కెట్లో కిలో బెల్లం రూ. 30 నుంచి 35 మధ్య ఉండగా సిండికేట్ వ్యాపారులు పది రూపాయల వరకు ఎక్కువ పెంచి విక్రయిస్తారని తెలిసింది.

ధరల భారం

Medaram Jatara 2022: హోల్ సేల్​లో కిలో బెల్లం 30 నుంచి 35 రూపాయల వరకు దొరుకుతున్నా మేడారంలో చిల్లర ధర కిలో రూ. 60లకు పైనే విక్రయిస్తున్నారు. కొందరు నేరుగా బెల్లం ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసుకుని మేడారానికి తరలిస్తున్నారు. మేడారంలో ధరల నియంత్రణను ఎవరూ పట్టించుకోకపోవడంతో భక్తులకు భారం తప్పడం లేదు. సాధారణ రోజుల్లో బెల్లం విక్రయాలపై పోలీసు, ఆబ్కారీ శాఖల నియంత్రణ ఉంటుంది. కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన జాతర సమయంలో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వ్యాపారులు తమకు ఇష్టమొచ్చిన ధరలకు బెల్లాన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు నష్టపోతున్నారు. బాధలు చెప్పుకోవడానికి అమ్మవార్ల వద్దకు వస్తే.. ఈ ధరలతో భారం మోసుకు వెళ్లాల్సివస్తోందని వాపోతున్నారు.

వాళ్లకు కొంగు బంగారం..

Jaggery Cost in Medaram Jatara : మరోవైపు జాతరలో భక్తులు సమర్పించిన బెల్లాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నల్లబెల్లాన్ని నిషేధించడం వల్ల ఈ బెల్లంతోనే కొందరు గుడుంబా తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. సమ్మక్క-సారలమ్మల జాతర వ్యాపారులకే కాదు.. కేటుగాళ్లకు కొంగు బంగారమవుతోంది.

Last Updated : Feb 1, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.