ETV Bharat / state

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రతిభ.. తక్కువ ఖర్చుతోనే వినూత్న గృహం

author img

By

Published : Apr 11, 2021, 3:49 PM IST

ఓ ఇంజినీరింగ్​ విద్యార్థిని వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది. పేదలకు పక్కా గృహమే లక్ష్యంగా పనిచేసింది. కేవలం ఆరునెలల్లోనే ఆమె కల సాక్షాత్కారమైంది. 20వేల మిల్లీ మీటర్ల వ్యాసార్థం గల పైపులైనునే ఇంటిగా మార్చింది.

engineering student innovation
ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రతిభ.. తక్కువ ఖర్చుతోనే వినూత్న ఇల్లు

పేదలకు పక్కా గృహమే లక్ష్యంగా ఆ యువతి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వారి దుస్థితి చూసి చలించిపోయింది. తక్కువ ఖర్చుతో నివాసయోగ్యంగా ఉండే ఓ గూడును నిర్మిస్తే బాగుంటుందని తలచింది. 6 నెలల కష్టం కళ్ల ముందే సాక్షాత్కరించింది. ఆమే కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని పేరాల మానసారెడ్డి.

కృషి.. పట్టుదలే లక్ష్యంగా..

గతేడాది పంజాబ్‌లోని లవ్‌లీ యూనివర్సిటీలో బీటెక్‌ ముగించుకొని నగరానికి వచ్చిన ఆమె బోడుప్పల్‌ నగర పాలక సంస్థలోని.. చెంగిచర్ల క్రాంతి కాలనీలోని బాబాయి ఇంటికి చేరింది. తను చేయాలనుకుంటున్న ప్రాజెక్టు గురించి బాబాయికి చెప్పడంతో తనకున్న ఖాళీ స్థలాన్ని ఇచ్చారు. 20వేల మిల్లీ మీటర్ల వ్యాసార్థం గల పైపులైనునే ఇంటిగా మార్చింది. 120 అడుగుల విస్తీర్ణమున్న ఓపడక గదిని సిద్ధం చేసింది. అందులో వంటగది, శౌచాలయం, బెడ్‌రూంతో పాటు సిట్టింగ్‌ ఏరియాను రూపొందించింది.అందుకు రూ.4 లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. 5 మీటర్ల పొడవు, 10 అడుగుల వెడల్పుతో అద్భుత నిర్మాణం చేపట్టొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కేవలం రూ.3.5 లక్షలకే నిర్మించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

విదేశాల్లో అధ్యయనం

మానసారెడ్డిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. తల్లి రమాదేవి, చెల్లి చైతన్య ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో 5 నుంచి 10 వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలో చదువుకున్నారు. ఇంటర్‌ నగరంలోని మణికొండలోనూ, బీటెక్‌ పంజాబ్‌లోని లవ్‌లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. బీటెక్‌ పూర్తయిన తర్వాత ఆరు నెలల పాటు గృహ నిర్మాణాలపై అధ్యయనానికి హాంకాంగ్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించే కట్టడాలపై అధ్యయనం చేశారు. అక్కడి విషయ జ్ఞానం ఎంతో ఉపయోగపడిందంటారు. ముఖ్యంగా తీరప్రాంత వాసులకు ఇలాంటి నిర్మాణాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పర్యాటకరంగం అభివృద్ధికి ఈ నిర్మాణాలు బాగుంటాయని పేర్కొన్నారు.

ఇవీచూడండి: క్రోమ్​ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.