ETV Bharat / state

RAGHUNANDAN RAO: చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధం : రఘునందన్‌రావు

author img

By

Published : Nov 8, 2021, 5:34 PM IST

భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వేధింపులు సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమితో ఈటలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. నిష్పక్షపాత సర్వే, విచారణకు సహకరిస్తానని ఈటల చెప్పారని రఘునందన్‌ పేర్కొన్నారు.

RAGHUNANDAN RAO
రఘునందన్‌రావు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి వల్లే చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈటలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. విచారణకు ఈటల సహకరిస్తానని చెప్పినా కూడా వేధింపులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. పోడు భూములు, అటవీ సంరక్షణపై మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఉప ఎన్నిక ముగిసిన తరువాత మళ్లీ కేసుల్ని తెరుపైకి తీసుకురావడం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలేనని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ఎదుర్కొనేందుకు మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన భార్య జమున భూముల సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. కానీ ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు ప్రభుత్వానికి మింగుడుపడడం లేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే ఈటలను వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా జరిగే ఎలాంటి విచారణకైనా ఈటల రాజేందర్ సహకరిస్తారని తెలిపారు. దీనిపై న్యాయ క్షేత్రంలో పోరాడుతామని రఘునందన్‌ రావు స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్‌ గారికి ప్రజాతీర్పు అనుకూలంగా వచ్చింది. ఉపఎన్నిక ముగిసిన తర్వాత మళ్లీ కేసులను తిరగొడుతున్నారు. మేం దీన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున గారు స్పష్టం చేశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినందుకు ఇలా చేయడం సరికాదు. అది ప్రభుత్వ భూమినా లేక అసైన్డ్‌ భూముల అనే విషయంలో సర్వేకు పూర్తిగా సహకరిస్తామని తెలిపాం. ప్రజలు ఓడించారని కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. దీనిపై న్యాయక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. - రఘునందన్‌ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

మరోసారి నోటీసులు

ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సమగ్ర సర్వే కోసం నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో భూముల ప్రాథమిక సర్వే చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గేవరకు సర్వే తాత్కాలిక నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించిందని.. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా డిప్యూటీ ఇన్​స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు ఇప్పుడు ఇచ్చారని ఆయన వివరించారు. ఈనెల 16,17 ,18 తేదీల్లో సర్వే ఉంటుందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.

రఘునందన్‌రావు

ఇదీ చూడండి:
Etela rajender land issues: మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.