శ్రీరాంపూర్​ ప్రమాద బాధితులను ఆదుకుంటాం:సింగరేణి సీఎండీ

author img

By

Published : Nov 10, 2021, 10:03 PM IST

singareni cmd sridhar

శ్రీరాంపూర్​ ప్రమాదంపై సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగమిస్తామని ప్రకటించారు. యాజమాన్యం తరఫున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేయనున్నామని శ్రీధర్​ తెలిపారు.

శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ - 3, 3ఏ ఇంక్లైన్​లో ఇవాళ జరిగిన ప్రమాదంపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన కార్మికులకు కంపెనీ తరఫున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని అధికారులను సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. కార్మికుని మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారి లేని లోటును తీర్చలేకపోయినా.. బాధిత కుటుంబాలకు యాజమాన్యం అండగా ఉంటుందని సీఎండీ శ్రీధర్ భరోసా కల్పించారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు యాజమాన్యం తరఫున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేయనున్నామని శ్రీధర్​ తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఆర్‌పీ - 3, 3ఏ ఇంక్లైన్‌ ప్రమాదంలో టింబర్ మెన్​ వీ.కృష్ణారెడ్డి (57), టింబర్ మెన్​ బి.లక్ష్మయ్య(60), బదిలీ వర్కర్​ జి.సత్యనారాయణ రాజు (32), బదిలీ వర్కర్​ ఆర్.చంద్రశేఖర్ (32) మృతిచెందినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.

ఇదీచూడండి: Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.