ETV Bharat / state

తెలంగాణ తిరుపతి కురుమూర్తి దేవస్థానం.. సమస్యలకు నెలవు..!

author img

By

Published : Oct 22, 2022, 10:14 PM IST

Kurumurthi Devasthan
కురుమూర్తి దేవస్థానం

kurumurthy temple: లక్షలాది మంది భక్తులు హాజరయ్యే జాతర అది. ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. అయినా జాతరకు వెళ్లే రోడ్డు మార్గాల్లో పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో.. ఈసారి వాహన దారులకు తిప్పలు తప్పేలా లేవు. శిథిలమైన రోడ్లు, తవ్వి పూడ్చకుండానే వదిలేసిన గుంతలు.. జాతరకొచ్చే భక్తులకు పరీక్షగా మారనున్నాయి.

kurumurthy temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి దేవస్థానం. కురుమూర్తి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు ఈ తిరునాళ్లు కొనసాగుతాయి. జాతరను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. జాతరకొచ్చే భక్తులకు ఈసారి ప్రయాణం పరీక్షగా మారనుంది. కారణం ఆ మార్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉండటమే. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు... మహబూబ్‌నగర్, దేవరకద్ర మీదుగా 2 మార్గాల ద్వారా కురుమూర్తి జాతరకు చేరుకోవచ్చు. దేవరకద్ర నుంచి పుట్టపల్లి, కౌకుంట్ల, వెంకంపల్లి మీదుగా కురుమూర్తిని చేరుకోవచ్చు. ఈ దారిలో 2 రైల్వే గేట్లున్నాయి. ఇదేమార్గంలో ప్రమాదకరంగా 9 కల్వర్టులున్నాయి. గతంలో ఈ కల్వర్టుల వద్ద ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జాతర ప్రారంభానికి ఇంకా కొన్నిరోజులే ఉండటం, ఎక్కడా మరమ్మతులు చేపట్టకపోవడంతో.. వాహన దారులకు.. ఈసారి ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇక కోయల్ సాగర్ కాల్వల నుంచి సాగునీటిని తీసుకు వెళ్లేందుకు పైప్ లైన్ల కోసం రైతులు ఇష్టానుసారంగా రోడ్లను తవ్వేశారు. వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో వేగంగా వచ్చే వాహనదారులు ఆ గుంతల్ని గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో పుట్టపల్లి రైల్వేగేటు అవతల, ఇవతల, డోకూరు కేజీవీబీ దగ్గర, కౌకుంట్ల పాతరైల్వే గేటు వద్ద మలుపులు ప్రమాదకరంగా మారాయి. పుట్టపల్లి నుంచి పాత రైల్వేగేటు వరకూ కిలోమీటర్ కు పైగా రోడ్డుమార్గం పూర్తిగా గుంతలమయమైంది. దేవరకద్ర నుంచి గుడిబండ, ముచ్చింతల, అప్పంపల్లి మీదుగా జాతర వెళ్లే మార్గం రెండోదారి. ఈ మార్గంలోనూ 6చోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. సూచిక బోర్డులు సరిగా లేవు.

జాతర ప్రారంభం నాటికి అవసరమైన మరమ్మతులు పూర్తి చేస్తామని, ప్రధాన ఘట్టం ఉద్దాలోత్సవం నాటికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు రోడ్డు భవనాల శాఖ, ఏఈఈ శ్రీరామ్ రెడ్డి చెబుతున్నారు. కడప, కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి వచ్చేభక్తులు జూరాల డ్యాం మీదుగా ఆత్మకూరు నుంచి కురుమూర్తి ఆలయాన్ని చేరుకుంటారు. ఈ మార్గంలో ఆత్మకూర్ నుంచి అల్లిపూర్ వరకు రహదారి గుంతలమయంగా మారింది. అలంకరణ మహోత్సవం కోసం స్వామివారి ఆభరణాలు సైతం ఈ మార్గంలోనే తీసుకుస్తారు. గుంతలు అధికంగా ఉండటం వల్ల రవాణాకు ఇబ్బందులు తప్పేలా లేవు.

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి దేవస్థానం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.