ETV Bharat / state

Mini Lift Irrigation Projects in Telangana : మినీ ఎత్తిపోతల పథకాలు.. పట్టించుకునే నాథుడే లేడు

author img

By

Published : Jun 25, 2023, 10:50 AM IST

Mini
Mini

Mini Lift Irrigation Projects in Mahbubnagar : ఎత్తైన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన.. మినీ ఎత్తిపోతల పథకాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. నిర్వహణ లేక.. మరమ్మత్తులకు నిధులు మంజూరు కాక.. మూలన పడుతున్నాయి. మోటార్లు, యంత్ర సామగ్రి, కాలువలు ధ్వంసమైనా పట్టించుకునే దిక్కు లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. గతంలో వాటిపై ఆధారపడి పంటలు పండించిన రైతులు.. ఏ మార్గమూ లేక వర్షాధార పంటలపైనే అధారపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మినీ ఎత్తిపోతల పథకాల దుస్థితిపై ప్రత్యేక కథనం..

Negligence in Mini Lift Irrigations Projects Management : ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. వేల ఎకరాలకు సాగునీరు అందించిన మినీ ఎత్తిపోతల పథకాలు... ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతున్నాయి. మరమ్మత్తులు చేయించాల్సిన నీటి పారుదల శాఖ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు కూడా సరైన నిర్వహణ లేదు. నపర్తి జిల్లా చిన్నమారూర్‌లో 1995లో అప్పటి తెలుగుదేశం సర్కారు మినీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగైదేళ్లు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందింది. తర్వాత నిర్వహణ సరిగా లేక మూలన పడింది.

2019లో రూ.ఆరున్నర కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టి.. కొత్తగా 4 మోటార్లు బిగించారు. కానీ వాటి సామర్థ్యం సరిపోక... ఆయకట్టుకు సాగు నీరందలేదు. డీ-3 వద్ద కాల్వలు తెగిపోవడంతో... నీరు విడుదల చేసినా వృథాగా పోతోంది. ఐదారేళ్లుగా చిన్నమారూరు ఎత్తిపోతల పథకం పని చేయక ఆయకట్టు ఎండిపోతోంది. జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీరు అందుతున్నా.. అది అరకొరగానే ఉంది. పెద్దమారూరు, చిన్నమారూరు, వెల్టూరు, కొప్పునూరు, అయ్యవారిపల్లిలోని ఆయకట్టు రైతులు.. సాగునీరు లేక వర్షాధార పంటలపైనే ఆధార పడుతున్నారు.

Chellepadu Lift Irrigation Project Issues : చిన్నంబావి మండలం చెల్లెపాడు ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా దాదాపుగా అంతే. 1991లో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. పదిహేనేళ్లు బాగానే నడిచింది. ఆ తర్వాత నిర్వహణ లేక మూలనపడింది. 2019లో ఈ లిఫ్ట్ పునరుద్దరణ కోసం రూ.47 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఉన్న మోటార్లను మరమ్మత్తుల కోసం తొలగించారు. తిరిగి వాటిని బిగించనేలేదు. కాల్వలు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. చెల్లపాడు, కాలూరు, అయ్యవారిపల్లిలోని ఆయకట్టు రైతులు నదిలో మోటార్లు వేసుకుని పైప్ లైన్ల ద్వారా తమ పొలాలకు నీరు పారించుకుంటున్నారు. నదికి దూరంగా ఉండే వాళ్లు మాత్రం వర్షాధార పంటలే వేస్తున్నారు. చెల్లపాడుతో పాటు ప్రారంభించిన బెక్కెం ఎత్తిపోతల పథకం అసలు ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది.

'చెల్లెపాడు పథకం ప్రారంభించి 30 ఏళ్లు అవుతుంది. పదిహేనేళ్లు బాగానే పని చేసింది. మోటార్లు పాడయ్యాయని ఇప్పుకుని పోయారు. ఇప్పటి వరకు వాటి జాడ లేదు'.-బాధిత రైతులు.

Gopalapuram Mini Lift Irrigation Project Problems : నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురం మినీ ఎత్తిపోతల పథకం దాదాపుగా మూలన పడింది. జూరాల ఎడమ కాల్వ నుంచి గోప్లాపూర్ ఆయకట్టుకు సాగునీరు అందుతుండటంతో ఈ ఎత్తిపోతలను పట్టించుకునే వారు కరవయ్యారు. ఐదారేళ్లుగా ఈ ఎత్తిపోతల నడవడం లేదు. మరమ్మత్తుల పేరుతో మోటార్లను అక్కడి నుంచి తరలించారు. తిరిగి బిగించలేదు. కాల్వలు, పైప్‌లైన్ల సామగ్రి ధ్వంసమవుతోందని... ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాధవ స్వామినగర్ మినీ ఎత్తిపోతలకు 850 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ అక్కడి మోటార్లు దొంగతనానికి గురయ్యాయి. కాల్వలు పూడిపోయాయి. పంటలకు నీరందక రైతులు పక్కనే ఉన్న కృష్ణానదిలో మోటార్లు వేసుకుని పైపుల ద్వారా సాగునీరు పారించుకుంటున్నారు.

'1994లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. నాలుగైదేండ్లు బాగానే పని చేసింది. చిన్నపాటి రిపేర్లు ఉన్నా చేయడం లేదు.'-బాధిత రైతులు.

యంగంపల్లి తండా రామలింగేశ్వర మినీ ఎత్తిపోతల పథకం బాగానే పనిచేస్తున్నా నది లోపలి నుంచి నీరు తీసుకునే అవకాశం లేక... ప్రస్తుతం 300 ఎకరాల వరకే సాగునీరు అందుతోంది. మోటార్ల సామర్థ్యం పెంచడంతో పాటు, మరో మోటారు అమర్చితే.. మరో 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు కోరుతున్నారు. నదిలో ఎప్పుడూ నీళ్లుండే ప్రాంతం వరకూ పైప్‌లైన్‌ వేస్తే రెండు పంటలూ పండించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలాంటి ఎత్తిపోతలు 47 ఉన్నాయి. వాటి పరిధిలో 86 వేల ఎకరాల ఆయకట్టుంది. గతంలో వీటి పర్యవేక్షణ ఆయకట్టు అభివృద్ధి శాఖ చూసేది. ప్రభుత్వం అన్ని నీటి పారుదల శాఖల్ని ఒకే గొడుకు కిందకు తీసుకురావడంతో మినీ ఎత్తిపోతలను పట్టించుకునే వారు కరవయ్యారు.

ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.