ETV Bharat / state

ఎమ్మెల్యే హోలీ ధూంధాం.. కార్యకర్తలకు మందు.. విందు.. చిందు..

author img

By

Published : Mar 18, 2022, 3:49 PM IST

MLA Shankar Nayak Holi Celebrations: "హోలీ అంటేనే.. రంగులు చల్లుకోవటం.. డీజే పాటలకు చిందులేయటం. మరి ఆ చిందులు పడాలంటే.. లోపల మందు పడాల్సిందే.. అట్లుంటది మనతోని.." అంటున్నారు ఎమ్మెల్యే శంకర్​నాయక్​. హోలీ వేడుకల కోసం కార్యకర్తలంతా కలిసి క్యాంపు కార్యాలయానికి రాగా.. ఎవ్వరూ అసంతృప్తి చెందకుండా మందు, విందు, చిందు ఏర్పాటు చేసి అందరినీ అర్సుకున్నారు. ఇప్పుడు ఇదే సోషల్​ మీడియాలో చర్చనీయాంశమైంది.

MLA Shankar Nayak Holi Celebrations Controversial in mahaboobabad
MLA Shankar Nayak Holi Celebrations Controversial in mahaboobabad

ఎమ్మెల్యే హోలీ ధూంధాం.. కార్యకర్తలకు మందు.. విందు.. చిందు..

MLA Shankar Nayak Holi Celebrations: మహబూబాబాద్​లో హోలీ సంబురాలు జోరుగా సాగాయి. రంగులు.. పాటలకు చిందులతో పాటు.. ఎంచక్కా.. చుక్కా.. ముక్కా.. కూడా చేరి హోలీ దావత్​ గట్టిగానే జరిగింది. ఇదంతా.. స్వయానా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లోనే.. అది కూడా ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఆధ్వర్యంలోనే..! ఇంతేనా.. మద్యం బాటిల్​ చేతపుచ్చుకుని తలా కొంచెం తీర్థం పెట్టినట్టు నోట్లో మందు పోసి కార్యకర్తలకు మరింత ఊపునిచ్చారు మన ఎమ్మెల్యే. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

స్వహస్తాలతో తీర్థ, ప్రసాద వితరణ..

హోలీ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలంతా మహబూబాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఎమ్మెల్యే శంకర్​నాయక్ కూడా వేడుకల్లో పాల్గొని కార్యకర్తలకు రంగులు పూశారు. అంత వరకు బాగానే ఉన్నా... అప్పటి నుంచే అసలు కథ మొదలైంది. చుట్టూ కార్యకర్తల కోలాహలం. ఇంతలో ఎమ్మెల్యే చేతికి ఓ విస్కీ ఫుల్​బాటిల్​ వచ్చింది. ఇంకేముంది.. అందరూ ఖాళీ గ్లాసులతో రెడీ అయ్యారు. కానీ.. ఎమ్మెల్యే వాళ్ల కంటే ఒక అడుగు ముందుకేసి.. డైరెక్టుగా నోట్లోనే తీర్థం పోసినట్టు తలా కొంచెం పోశారు. ఇంకేముంది కేరింతలు రెట్టింపయ్యాయి. నీకు కావాలా.. నీకు కావాలా..? అంటూ అందరినీ అడుగుతూ మరి స్వహస్తాలతో మందు తీర్థం పంచారు. చుక్క సరే.. నంజుకోడానికి ముక్క కూడా కావాలి కదా.. ఆ సరంజామా కూడా సిద్ధంగా ఉండటంతో.. మటన్​ కూర ఉన్న పాత్ర తీసుకొచ్చి ఎమ్మెల్యేకు ఇచ్చారు. మళ్లీ మొదలు.. తీర్థం అయ్యాక మరి ప్రసాదమే కదా.. ఇక ఒక్కో ముక్క తీస్తూ నోటికందిస్తూ.. ఆ ముచ్చట కూడా తీర్చుకున్నారు శంకర్​నాయక్​. వచ్చిన కార్యకర్తలందరికీ బీర్లు, మందు, మటన్​ సరఫరా చేశారు. చేతుల్లో బీరు సీసాలు, మందు పెగ్గులు పట్టుకుని పాటలకు స్టెప్పులేస్తూ.. పండగను గట్టిగానే ఎంజాయ్​ చేశారు.

అధికారులూ చూసీచూడనట్టే..

పండగను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జరుపుకోవటంలో తప్పులేదు. కానీ.. ఈ సెటప్​ అంతా తీసుకొచ్చి ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే పెట్టటం ఇప్పుడు వివాదాస్పదమైంది. అందులోనూ ఎమ్మెల్యే చేసిన అతిపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. హోలీ సందర్భంగా రాష్ట్రమంతా.. వైన్స్​, బార్లు బంద్​ అని ప్రకటించినా.. యథేచ్చగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఈవిధంగా జరగటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం హైదరాబాద్​లో తప్పా.. పలు జిల్లా, మండల కేంద్రాల్లో బార్​ అండ్​ రెస్టారెంట్లు, వైన్​షాపులు తెరిచే ఉంచటంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.