ETV Bharat / state

ఉపాధ్యాయుడిపై మూడో తరగతి పిల్లాడి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా...?

author img

By

Published : Mar 5, 2022, 7:27 PM IST

Updated : Mar 5, 2022, 7:45 PM IST

Student Complaint On Teacher: మూడో తరగతి చదివే పిల్లాడు పోలీస్​​స్టేషన్​కు వెళ్లి వాళ్ల సార్​పై ఫిర్యాదు చేశాడు. నేరుగా ఎస్సై దగ్గరికి వెళ్లి ఆయన్ను అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశాడు. అంత చిన్న పిల్లాడు పోలీస్​స్టేషన్​కు వెళ్లి కాంప్లైంట్​ ఇచ్చేంతగా.. ఆ సార్​ ఏం చేసుంటాడని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

3rd class student complaint to police on his teacher in bayyaram
3rd class student complaint to police on his teacher in bayyaram

ఉపాధ్యాయుడిపై మూడో తరగతి పిల్లాడి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా...?

Student Complaint On Teacher: ఎవరైనా మనకు అన్యాయం చేస్తేనో.. మనపై దాడులు చేస్తేనో.. బెదిరింపులకు పాల్పడితేనో.. వెంటనే గుర్తొచ్చేది పోలీస్టేషన్​. అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం. అయినా.. చాలా మంది పోలీస్​ ​స్టేషన్​కు వెళ్లేందుకు వెనకడుగువేస్తుంటారు. కానీ.. ఈ మధ్య కొందరు చిన్నారులు ఎలాంటి జంకు లేకుండా ఠాణాలకు వెళ్తున్నారు. భయం పక్కనపారేసి.. తమకొచ్చిన బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని ధైర్యంగా పోలీసులను అడుగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో జరిగింది.

మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అనిల్​కు ఓ బాధొచ్చింది. తనను ఓ ఉపాధ్యాయుడు తరచూ కొడుతున్నాడు. అయితే.. ఎలాంటి తప్పు లేకుండానే ఆ ఉపాధ్యాయుడు తనను కొడుతుండటాన్ని ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులకు చెప్పినా.. ఫలితం కనిపించలేదు. తనకు పోలీసులైతేనే న్యాయం చేస్తారని ఆ చిన్నారి నిర్ధరించుకున్నాడు. వెంటనే తన తండ్రిని పట్టుకుని పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. నేరుగా ఎస్సై రమాదేవి దగ్గరికి వెళ్లి తన బాధ మొత్తం వెల్లగక్కాడు. తనను కొట్టే సారును అరెస్ట్​ చేయాలని పట్టుబట్టాడు. పిల్లాడు చెప్పే ముచ్చట మొత్తం విన్న ఎస్సై.. కానిస్టేబుల్​ను పురమాయించారు. పాఠశాలకు వెళ్లి ఆ సారు ఎవరు..? అసలు సంగతేంటో కనుక్కొమ్మని పంపించారు.

అనిల్​తో కలిసి స్కూల్​కు వెళ్లిన కానిస్టేబుల్​ ఆరా తీశాడు. సార్లను పిలిపించి వాళ్ల ముందే.. పంచాయితీ పెట్టాడు. సార్లు ఉన్నారని కొంచెం కూడా భయపడకుండా.. "ఈ సారే నన్ను కొట్టింది. ఆ సారును అరెస్ట్​ చేసి కేసు పెట్టండి.." అని చెప్పాడు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. మళ్లీ ఎప్పుడూ కొట్టకుండా చెప్తామని ఎంత బుజ్జగించినా.. తగ్గేదేలే.. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు.

అనిల్​ ముందే సార్లకు కానిస్టేబుల్​ గట్టిగా చెప్పి.. ఇటు ఆ చిన్నారికి కూడా నచ్చజెప్పటంతో.. పంచాయితీ తెగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి ధైర్యానికి మెచ్చుకుంటూనే.. ఇంత చిన్న వయసులో ఇంత తెగింపేంటని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Mar 5, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.