RAIN EFFECT: జోరువానతో సాగునీటి ప్రాజెక్టులకు జలకళ.. తగ్గిన బొగ్గు ఉత్పత్తి

author img

By

Published : Jul 16, 2021, 1:09 PM IST

HEAVY RAINS IN KUMURAM BHEEM DISTRICT

కుమురం భీం జిల్లాలో జోరువానల ఫలితంగా పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా.. గోలేటి, బెల్లంపల్లి ఏరియా ఉపరితల గనుల ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా సింగరేణికి నష్టం వాటిల్లింది.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న జోరువానలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 15 రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. చేళ్లలో విత్తనాలు నాటే కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా.. కలుపు తీసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

జలసిరి..

జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులు జలసిరిని సంతరించుకున్నాయి. కుమురం భీం, వట్టి వాగు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరిగింది. జిల్లాలో 338.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా.. 478.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా 85% వర్షపాతం లింగాపూర్ మండలంలోనే రికార్డయింది. అత్యల్పంగా -10% వర్షపాతం కురిసింది.

కుమురం భీం జలాశయం..

కుమురం భీం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 242.2 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు వద్ద 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఇన్​ఫ్లో 4,842 క్యూసెక్కులు ఉంది. నీటి మట్టం పెరుగుతుండడం వల్ల కుమురం భీం ప్రాజెక్టులో నాలుగు, ఐదు, ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

వట్టి వాగు..

వట్టి వాగు ప్రాజెక్టులోనూ నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుత 237.5 మీటర్లకు చేరింది. ఇన్​ఫ్లో 405 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

తగ్గిన బొగ్గు ఉత్పత్తి..

HEAVY RAINS IN KUMURAM BHEEM DISTRICT
జోరువానతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

జోరువానలతో రెబ్బెన మండలంలోని గోలేటి, బెల్లంపల్లి ఏరియా ఉపరితల గనుల ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచి సింగరేణికి నష్టం వాటిల్లింది. ఏరియాలోని ఖైరిగూడ, బీపీఏఓసీసీపీ2లో ఒక్క రోజుకు 8,593 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. మొదటి షిఫ్ట్​ నుంచి రాత్రి షిఫ్ట్​ వరకు కేవలం 3,123 టన్నులు అంటే 36 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఖైరిగుడా ఓసీ పీలో 8,333 టన్నులకు 3,123 టన్నులు అంటే కేవలం 37% బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేశారు. బీపీఏఓసీపీ2లో ఉత్పత్తి నిలిచిపోయింది. మొదటి షిఫ్ట్​లో 2864 టన్నులకు గాను 1220.2 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఏరియా జీఎం సంజీవరెడ్డి పర్యవేక్షణలో వరద నీటిని పంపుల ద్వారా బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.

HEAVY RAINS IN KUMURAM BHEEM DISTRICT
బొగ్గు గని వద్ద నిలిచిన లారీలు

ఇవీచూడండి: RAINS: జలకళను సంతరించుకున్న జలాశయాలు, చెరువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.