అగ్గి రాజేస్తున్న పోడు భూముల వివాదం.. ఆయుధాలు ఇవ్వాలని అధికారుల డిమాండ్‌

author img

By

Published : Nov 23, 2022, 10:23 PM IST

Updated : Nov 23, 2022, 10:36 PM IST

Podu Land Issue

Podu Land Issue in Telangana: రాష్ట్రంలో పోడు భూమల సమస్య అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య అగ్గి రాజేస్తోంది. ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా అటవీ భూముల సంరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది దాడులకు గురవతుంటే... అమ్మ లాంటి అడవిని తమకు దూరం చేస్తే సహించబోమంటూ గిరిజనులు తిరగబడుతున్నారు. వారసత్వంగా సాగు చేసుకుంటున్న అటవీ భూములపై గిరిజనులకు హక్కు పత్రాలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పోడు భూముల సర్వే నిర్వహించి, అర్హులకు హక్కులు కల్పిస్తామంటోంది. అయితే తాము సాగు చేసుకుంటున్న భూములన్నింటికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిందే అంటున్నారు పోడు రైతులు. సర్వేల పేరుతో కొందరికే పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపు కుంటోందనీ, పోడు రైతులందరికీ భూమిపై హక్కులు కల్పించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కానీ... 2005 డిసెంబర్‌ తర్వాత సాగులోకి వచ్చిన అటవీ భూములకు పత్రాలివ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. అటవీ చట్టాల ఉల్లంఘన జరిగిందని భావించిన చోట పంటల సాగును ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటుంటే.. అడవినే నమ్ముకున్న ఆదివాసి గిరిజనులు తాము దున్నుకుంటున్న భూముల కోసం తెగించి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ పరిసర గ్రామాల్లో నిత్యం ఘర్షణలు తలెత్తుతున్న పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

అగ్గి రాజేస్తున్న పోడు భూముల వివాదం.. ఆయుధాలు ఇవ్వాలని అధికారుల డిమాండ్‌

Podu Land Issue in Telangana: రాష్ట్రంలో పోడు భూమల వివాదాలకు శాశ్వత పరిష్కారం కొనుగొని, సాగు దారులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ తరుణంలోనే గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఎండనకా, వాననకా అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం శ్రమిస్తున్న అధికారులు పోడు రైతుల చేతుల్లో దాడులకు గురవుతున్నారు. రాష్ట్రమంతా ఏజెన్సీలు, మైదాన ప్రాంతాల్లోని పోడు భూముల్లో చెదురుమదురు ఘర్షణలు జరుగుతున్నా... అప్పుడప్పుడు అవి దాడులు, ప్రతిదాడుల స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. పచ్చటి వనాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడే క్రమంలో తరచూ గాయాల పాలవుతున్న అటవీ సిబ్బంది, కొన్నిసార్లు అనుకోని రీతిలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏటి కేడు పోడు సాగు విస్తీర్ణం విపరీతంగా పెరుగుతోంది... అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో పోడు సాగు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2005 తర్వాత పోడు సాగైన భూముల వివరాలు సేకరిస్తోంది. దాని ప్రకారం ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో పోడు సాగును అడ్డుకుంటూ, మండలాల వారీగా వందలాది ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు పెంచుతోంది. అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. దీంతో పరస్పర ఘర్షణలు, వాగ్వాదాలు చోటుకుంటున్నాయి. ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీల్లో పోడు భూములను నమ్ముకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. వాటిని అటవీ అధికారులు గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం సాగుదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వివాదాలు ముదిరిన చోట పోడు రైతులు అటవీ అధికారులను నిర్బంధిస్తుంటే... అటవీశాఖ... పోడు సాగుదారులపై కేసులు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏళ్లుగా పోడు భూముల వివాదం రగులుతూ ఉంది.

గత కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఘర్షణలు వెలుగుచూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లోనూ పోడు భూముల రగడ కొనసాగుతోంది. ఏటా సీజన్ ఆరంభంలో పోడు భూముల్లో దుక్కులు దున్నేందుకు సాగుదారులు ప్రయత్నించడం, అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటే క్రమంలోనే ఎక్కువగా ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుంటున్నాయి. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో ఈ ఏడాది జూన్ లో పోడుసాగుదారుల పాదయాత్రపై అధికారులు ఆంక్షలు విధించారు. కొందరిని అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బూర్గంపాడు మండలం లోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2010 నుంచి పోడు సాగుదారులు, అటవీశాఖ అధికారుల మధ్య వైరం కొనసాగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో పోడు సర్వే జోరుగా సాగుతోంది. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రామం, మండలం, డివిజన్, జిల్లా వారీగా పోడు భూముల సర్వే చేపడుతున్నారు. పోడు భూముల సర్వేపై పోడు సాగుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి బలవంతంగా లాక్కున్న పోడు భూముల్లో సైతం సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఈ పద్దతి నిబంధనలకు విరుద్ధం అని అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో... సాగుదారులు రగిలిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 42వేల 409 ఎకరాల్లో హక్కుల కోసం 18వేల 295 మంది సాగుదారులు దరఖాస్తులు వచ్చాయి. భద్రాద్రి జిల్లాలో 2లక్షల 60వేల 474 ఎకరాల్లో పోడు హక్కుల కోసం 82వేల 621 దరఖాస్తులొచ్చాయి. ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 70శాతం పోడు సర్వే పూర్తయింది. అయితే.. ఈ సర్వేలో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం సాగుదారుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష 10 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో 63వేల 77 ఎకరాల అటవీ భూమిని గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్నారు. ములుగు జిల్లాలో 92 వేల ఎకరాల భూమి సాగులో ఉంది. వీటికి తోడు గొత్తికోయ గిరిజన గూడాలు 74 దాకా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 34వేల 884 దరఖాస్తులొచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పోడును అడ్డుకునే క్రమంలో అధికారులపై సాగుదారులు దాడులకు తెగబడుతున్నారు. ఏడాది కాలంలో... ఇలా 16 ఘటనలు జరిగాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో పోడు జరుగుతుందని బీట్ అధికారి శ్రీనివాస్, సెక్షన్ అధికారి ప్రభాకర్‌ను పోడుదారులు కర్రలతో కొట్టారు. కుక్కలతో దాడి చేయించారు. జూన్ నెలలో తాడ్వాయి మండలం గంగారంలో అధికారులకు, గొత్తి కోయగూడెం వాసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.

అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొన్న గొత్తికోయలతో ఘర్షణలు, అటవీ అధికారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. పోడు వ్యవసాయం, వన్య ప్రాణుల వేట జరుగుతోందని చాలాసార్లు వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేసిన అధికారులు విఫలం అయ్యారు. పోడు సాగుదారులు గొడ్డళ్లు, కర్రలతో దాడులకు తెగబడుతుంటే... అటవీ అధికారులు, సిబ్బంది అడవుల్లో ఆయుధాలు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు, పోడుదారులు, వేటగాళ్ల నుంచి వీరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో అటవీ అధికారుల ఆత్మరక్షణకు ఆయుధాలు ఇవ్వాలని, ఆర్ముడ్ రిజర్వు బలగాలను అటవీ సిబ్బందికి తోడుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కర్ణాటక, అసోం, మహారాష్ట్ర తరహాలో ఇక్కడా అటవీ అధికారులకు ఆయుధాలుంటే వారి ప్రాణాలకు రక్షణ ఉండేదన్న వాదన ముందుకొస్తోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించక పోతే... మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీప్రాంతాల్లో క్షీణించిన అటవీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చాలా చోట్ల పంటలను తొలగించి మొక్కలు నాటారు. దీంతో ఏజెన్సీల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. స్థానికులతో పాటు ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన గుత్తికోయలు కూడా అడవులను ధ్వంసం చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. వారిని అటవీ అధికారులు అడ్డుకున్నప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి. అటవీహక్కుల చట్టం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4.98లక్షల ఎకరాల పోడు భూమి ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. 57వేల 831 రైతులు అటవీ హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోడు వ్యవసాయం పెరగడమే ఘర్షణలకు కారణమని అటవీశాఖ వాదిస్తోంది.

రాష్ట్రంలో 2006లోనే 91 వేలకు పైగా పోడు భూముల సాగు దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. వాటి విస్తీర్ణం అప్పుడు 3 లక్షల 20వేల ఎకరాలకు పైగా ఉంది. మరో 50 వేల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి, ఇంకో 15వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వాటితో పాటు అదనంగా మరో 3 లక్షలకు పైగా ఎకరాల్లోనూ ఈ వివాదాలున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే... గతంలో దరఖాస్తులు తిరస్కరించినప్పటికీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకపోవడం ఇప్పుడు సమస్యగా మారిందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు దక్కాలంటే చట్టం వచ్చిన 2005 డిసెంబర్ 13వ తేదీకి ముందు 3 తరాలు 75 ఏళ్ల పాటు ఆ భూములను సాగు చేసుకుంటూ ఉండాలి. 2005 నుంచి ఇప్పటి వరకు మరో 17 ఏళ్లు అదనం. ఒక్కొక్కరికి గరిష్టంగా 4 హెక్టార్ల వరకు సాగు చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పలు దఫాలుగా, వివిధ వేదికల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పోడు సాగు చేసుకునే వారిని గుర్తించి అర్హులందరికీ పట్టాలు ఇస్తామని... రైతుబంధు సహా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది కూడా చేకూరుస్తామని సీఎం ప్రకటించారు. ఇదే సమయంలో పోడుకు పోగా మిగిలిన అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో రక్షించేలా, భవిష్యత్ లో అటవీవిస్తీర్ణం తగ్గకుండా ప్రణాళికలు రూపొందిస్తామని... ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే సమయంలోనే ఇందుకు సంబంధించి అండర్ టేకింగ్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ లో ఇక ఎంత మాత్రం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా కార్యాచరణ రూపొందించే ఆలోచనలో సర్కార్ ఉంది. చాలా చోట్ల అటవీప్రాంతాల అంచుల్లో పోడుసాగు చేస్తుండగా... కొన్ని చోట్ల మాత్రం అడవుల మధ్యలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిని కూడా అటవీప్రాంతాల అంచులకు తరలించాలని భావిస్తున్నారు. తాజాగా పోడుభూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది.

పోడుపట్టాల పంపిణీ కోసం గ్రామ కమిటీ నుంచి డివిజినల్ కమిటీకి, అక్కణ్నుంచి జిల్లా కమిటీకి హక్కు ప్రతిపాదనలు పంపుతారు. గిరిజన సంక్షేమ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఈ కమిటీల్లో ఉంటారు. జిల్లా కమిటీ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో అటవీ అధికారులు శాటిలైట్‌ మ్యాపులు, సాంకేతిక అంశాలను వినియోగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల్లో ప్రజాప్రతినిధులు ఉండడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికారులతో కసరత్తు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోని 2వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4లక్షల 14వేల 353 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వారు పట్టాలు కోరుతున్న భూమి విస్తీర్ణం 12లక్షల 46వేల 846 ఎకరాలు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు జరుగుతోంది. నెలాఖర్లోగా అన్ని జిల్లాల్లోనూ పోడుభూముల సర్వే పూర్తిచేసి, పట్టాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పోడు సమస్యను పరిష్కరించి 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.

రాష్ట్రంలో పోడుభూముల సమస్య ఏళ్ల తరబడి నలుగుతూనే ఉంది. పోడుసాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని గిరిజనులు కోరుతుంటే... అటవీ పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ ఎక్కడో చోట ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. వివాదాలున్న భూములపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.