ETV Bharat / state

Purchase of Grain: తరుగు పేరుతో సొసైటీలు, మిల్లర్ల ఆగడాలు

author img

By

Published : Aug 10, 2021, 7:15 AM IST

తరుగు పేరుతో ధాన్యం తీస్తే సహించేది లేదని, రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. రైస్‌ మిల్లుల వద్దకు వెళ్లాక చాలాచోట్ల ఒక్కో బస్తాలో 5 కేజీల వరకు కోత పెడుతున్నారు. అలా మిగుల్చుకున్న ధాన్యాన్ని లెక్కేసి సొసైటీల వారు తమ వద్ద పనిచేసే సిబ్బందే పంట సాగుచేసి అమ్మినట్లు కొన్నిచోట్ల నకిలీ పర్వానికి తెరదీశారు.

millers depravity in telangana
ధాన్యం కొనుగోలులో భారీగా అవినీతి ఆరోపణలు

యాసంగిలో ధాన్యం కొనుగోలులో భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ కళ్లెదుటే తూకం వేసిన ధాన్యం లెక్కలకు, బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్ముకు పొంతనే లేదని అనేక మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోటీ 30లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో 92.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ తరఫున గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)వారు, ఇందిరాక్రాంతిపథం(ఐకేపీ) మహిళా సంఘాల వారు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుంచి కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌ల వంటివి కూడా కొన్నిచోట్ల కొన్నాయి. ఇప్పుడు వెల్లువెత్తుతున్న విమర్శలు... ఆరోపణలు ప్రధానంగా ప్యాక్స్‌ పైనే. అక్కడక్కడా వ్యవసాయ మార్కెట్లపైన కూడా వస్తున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పుడు వాటి నాణ్యతను పరిశీలించి వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తారు. అలా ధ్రువీకరించారంటే మద్దతు ధర ప్రకారం లెక్కకట్టి పౌరసరఫరాల సంస్థ రైతు ఖాతాలో సొమ్ము జమచేయాలి.

కుమ్మక్కు ఇలా...

కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ అధికారి ధ్రువీకరించి తూకం పూర్తయ్యాక ఎన్ని క్వింటాళ్లో తెలియజేస్తూ రైతుకు చిట్టీ ఇస్తారు. బ్యాంకులో ఎంత సొమ్ము పడేది అక్కడే తేలిపోతుంది. కానీ దాని ప్రకారం కాకుండా తక్కువ పడుతున్నాయనేది రైతుల ఆవేదన. వివాదాలు ముసురుతున్నదీ ఇక్కడే. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సొసైటీల(ప్యాక్స్‌) వారు మిల్లర్లకు పంపుతారు. వారు మరాడించి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాలి. ఈ క్రమంలో సొసైటీవారు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు. లారీల్లో ధాన్యం రాగానే మిల్లర్లు తనిఖీ చేసుకొని.. నాణ్యత లేదని చాలా తరుగు తీయాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సొసైటీ వారు నాణ్యతను ధ్రువీకరించిన వ్యవసాయాధికారికి తెలియజేయాలి. ఆ అధికారి సంబంధిత మిల్లరు వద్దకు వెళ్లి తాను ధ్రువీకరించిన ధాన్యంలో నాణ్యత లేదని కొర్రీ పెట్టడం ఏమిటని ప్రశ్నించాలి. కావాలంటే మళ్లీ నాణ్యత పరీక్షలు చేపట్టవచ్చు. మిల్లరు వాదనలో డొల్లతనం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా జరగలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చిన చిట్టీ మేరకు సొమ్ము ఇప్పించే బాధ్యత ఎవరూ తీసుకోకపోవడం కర్షకులను కంటతడి పెట్టిస్తోంది. మిల్లర్లు, సొసైటీల వారు రైతులను నయానో భయానో మభ్యపెట్టి కొన్నిచోట్ల తరుగు పేరిట కోతేయగా... మరికొన్ని ఉదంతాల్లో బ్యాంకులో సొమ్ము పడ్డాక కానీ ఎంత నష్టపోయింది వారికి తెలియడంలేదు. ఇలాంటి కేసులు బయటకొచ్చినప్పుడే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తరుగు పేరుతో మిగుల్చుకున్న ధాన్యాన్ని లెక్కేసి సొసైటీల వారు తమ వద్ద పనిచేసే సిబ్బందే పంట సాగుచేసి అమ్మినట్లు కొన్నిచోట్ల నకిలీ పర్వానికి తెరదీశారు. అలా బినామీల ఖాతాల్లో సొమ్ము జమవగానే మిల్లర్లు, సొసైటీ వారు పంచుకుంటున్నారనే ఆరోపణ వినిపిస్తోంది.

ఒక కిలో వరకూ అంగీకరిస్తున్న రైతులు

వరి ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలో నింపి రైతుల నుంచి కొనాలి. ధాన్యంలో కొంత తాలు ఉంటుందని చెప్పి కొనుగోలు కేంద్రాల వారు ఒక కేజీ అదనంగా అడుగుతున్నారు. సంచి(బస్తా) బరువు 650 గ్రాములు కలిపి ఒక్కో బస్తా ధాన్యాన్ని 41.650 కేజీల చొప్పున తూకం వేస్తున్నారు. ఇక్కడి వరకూ రైతుల వైపు నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండడం లేదు. రైస్‌ మిల్లుల వద్దకు వెళ్లాక చాలాచోట్ల ఒక్కో బస్తాలో 5 కేజీల వరకు కోత పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ సొసైటీలో ఏకంగా 7 కిలోలకుపైగా తరుగు తీశారు.

150 మంది రైతుల ఫిర్యాదు

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ గ్రామంలో ప్యాక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తమ ఖాతాల్లో డబ్బులు తక్కువ జమ అయ్యాయని 150 మంది రైతులిచ్చిన ఫిర్యాదుపై అధికారులు సీఈవోను సస్పెండ్‌ చేశారు. ఈ సంఘానికి మొత్తం 1,858 మంది రైతులు 1,45,300 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించగా తూకాల్లో మోసాలు జరిగాయని రైతులు చెబుతున్నారు. తరుగు పేరిట తీసుకున్న ధాన్యాన్ని ఈ సహకార సంఘంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసే సిబ్బంది, వరి సాగు చేయని బినామీ రైతుల పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదుచేసి సొమ్ము దండుకున్నారు. రైతుల ఫిర్యాదుతో రెవెన్యూ డివిజనల్‌ అధికారితో ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఇదే జిల్లా అమ్రాద్‌ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక రైతు నెలన్నర రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి ఈ అవినీతిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రూ.67,995 తగ్గించారు

.

ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి వరి రైతు గాదె వెంకట్రామిరెడ్డి కాకర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 202.40 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు. క్వింటాకు మద్దతు ధర రూ.1,888 చొప్పున రూ.3.82 లక్షలు రావాలి. రూ.3.14 లక్షలే జమయ్యాయి. అంటే 36 క్వింటాళ్ల విలువైన రూ.67,995 తగ్గించారు. 40 కిలోల బస్తాకు 7 కిలోలకు పైగా తరుగు కింద తీసుకున్నారు. దీనిపై సంఘంలో అడిగితే సమాధానం చెప్పేవారు లేరని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనలాగే మోసపోయిన 10 మంది రైతులు జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు.

అడిగితే సమాధానం లేదు

చీలం నారాయణరెడ్డి

నాకున్న 8 ఎకరాలకు తోడు మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని గత యాసంగిలో వరి సాగు చేశా. రెంజల్‌ సహకార సంఘంలో 634 బస్తాలు తూకం వేయించా. బస్తాకు తరుగు 2 కేజీలు అడిగారు. అయినా అంగీకరించా. ఇవన్నీ పోను రావాల్సిన డబ్బు కంటే రూ.20 వేలు తగ్గాయి. సొసైటీకి వెళ్లి అడిగితే సమాధానం లేదు. వందమందికి పైగా రైతులం ఆర్డీవోకు ఫిర్యాదు చేశాం. విచారణ చేస్తున్నామంటున్నారు.

- చీలం నారాయణరెడ్డి, రెంజల్‌, నిజామాబాద్‌ జిల్లా

6 క్వింటాళ్ల తరుగు తీశారు

ఆంజనేయులు

రబీలో మొత్తం ఏడు ఎకరాల్లో వరి సాగు చేశా. మొత్తం 503 బస్తాల ధాన్యం వచ్చింది. పెద్దరాజమూరులోని సహకార సంఘం పరిధిలోని కేంద్రంలో విక్రయించా. అక్కడ వేసిన తూకంలో 200.40 క్వింటాళ్ల ధాన్యం వచ్చిందని మిల్లులకు పంపించారు. తరుగు పేరుతో 6 క్వింటాళ్ల ధాన్యం తగ్గించారు.

- ఆంజనేయులు, పెద్దరాజమూరు, దేవరకద్ర మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

రూ.30 వేలు తగ్గించారు

యాస సూరారెడ్డి

నూతనకల్‌లోని కొనుగోలు కేంద్రానికి ఏప్రిల్‌ 20న ధాన్యం తీసుకెళ్తే.. 45 రోజుల తర్వాత ప్రమాణాల మేరకు ఉందని జూన్‌ 2న తూకం చేశారు. మొత్తం 898 బస్తాల ధాన్యం వచ్చింది. మిల్లర్ల వద్దకు వెళ్లాక 38 బస్తాలు కోత విధించారు. సుమారు రూ.30 వేలు తగ్గించి డబ్బులను నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దని రెండు సార్లు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశా.

-యాస సూరారెడ్డి, నూతనకల్‌, సూర్యాపేట జిల్లా

ఆర్డీవో, కలెక్టరు చుట్టూ తిరుగుతున్నా...

బత్తుల జానకిరెడ్డి

నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో 210 క్వింటాళ్ల ధాన్యం విక్రయించా. అధికారులు రాసి కాగితం ఇచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా తరుగు పేరుతో 20.80 క్వింటాళ్లకు కోత పెట్టారు. దీంతో రూ.39,270 తక్కువగా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ అన్యాయంపై రెండు నెలలుగా నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌, నల్గొండ ఆర్డీవో, జిల్లా కలెక్టరు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు.

- బత్తుల జానకిరెడ్డి, బొప్పారం, కేతేపల్లి మండలం, నల్కొండ జిల్లా

మిల్లు వద్దకు వెళ్లాక లెక్కలు మారాయ్‌

పదెకరాల్లో వరి సాగు చేశా. స్థానిక అమ్రాద్‌ సొసైటీలో ధాన్యం విక్రయించా. బస్తాకు 41.800 చొప్పున తూకం వేశారు. నేను విక్రయించిన బస్తాల సంఖ్య, సహకార సొసైటీలో నా ముందు రాసిన తూకం లెక్కలు రైస్‌ మిల్లు వద్దకు వెళ్లాక మారిపోయాయి. సొసైటీ సిబ్బంది, మిల్లర్లు తమ ఇష్టం మేరకు తూకాలు రాసుకొని బస్తాల్లో కోత విధించారు. బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ అయ్యాక చూసి నేను, ఇంకొందరు రైతులు సొసైటీ కార్యదర్శిని నిలదీశాం. అడిగితే తరుగు తీసినట్లు చెప్పారు. మా అంగీకారం లేకుండా ఎలా తీశారని గట్టిగా అడిగితే డబ్బు ఎక్కడికీ పోదు.. వస్తాయంటూ సమాధానం చెబుతున్నారు.

- రాజన్న, అమ్రాద్‌ గ్రామం, మాక్లూర్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా

సెర్ప్‌ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన తమకు పూర్తిస్థాయిలో డబ్బులు అందించాలంటూ పలువురు రైతులు సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని సెర్ప్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. కాంటా వేసిన ధాన్యం వివరాలను తెల్లకాగితంపై రాసిచ్చినా డబ్బులు చెల్లించే సమయానికి రసీదులో తక్కువ సరకు నమోదుచేసి తరుగు పేరిట డబ్బుల్లో కోత విధించారని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. విసుగు చెందిన రైతులు కార్యాలయానికి తాళం వేసి తహసీల్దారుకు అందజేశారు. ఇక నుంచి నూతనకల్‌లో నిత్యం నిరసనలు చేపడతామని తెలిపారు.

ఇదీ చూడండి: LOAN APPS: లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ.5 వేలు ఇస్తామంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.