ETV Bharat / state

Sand Dunes in Crop Lands khammam : పంట భూముల్లో ఇసుక మేటలు.. దశాబ్దాలుగా ఇదే దుస్థితి.. అందని ద్రాక్షగానే పరిహారం

author img

By

Published : Aug 3, 2023, 2:28 PM IST

Crop Loss in khammam : అకాల వర్షాలు, గోదావరి వరదలు.. ఇలా కాలమేదైనా ప్రకృతి ప్రకోపానికి రైతుకు కడగండ్లే మిగులుతున్నాయి. చేతికొచ్చే దశలో రూ.లక్షల పెట్టుబడి పెట్టినా పంటలు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఏటా ముంచెత్తుతున్న భారీ వరదలతో గోదావరి పరివాహక ప్రాంతంలో సాగు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కళ్ల ముందే ఆశల పంటలు నేలవాలిపోతుంటే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. దశాబ్దాలుగా ఇదే దుస్థితి ఎదుర్కొంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కర్షకులకు పరిహారం మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది.

Crop Loss in khammam
Crop Loss in khammam

పంట భూముల్లో ఇసుక మేటలు

Crop Loss in khammam : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతపై ప్రకృతి పగబట్టిన చందంగానే మారింది. వరుసగా మూడో సీజన్లోనూ సాగులో నష్టాలే మూటగట్టుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితులతో గింజలు మొలకెత్తకపోవటంతో 2-3మార్లు విత్తనాలు నాటడంతో పెట్టుబడి రెట్టింపైంది. ఆ తర్వాతైనా పంటలు చేతికొస్తాయా... అనే దశలో అధిక వర్షాలు అన్నదాత పుట్టి ముంచుతున్నాయి. గతేడాది చరిత్రలో లేనంతగా గోదారి ఉప్పొంగటం, యాసంగిలో వడగండ్ల ధాటికి కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత సీజన్‌లో దాదాపు 10 రోజుల పాటు కురిసిన ఏకధాటి వర్షాలకు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భారీ వరదలతో పంట క్షేత్రాల్లో బురద, ఇసుక మేటలు వేసి అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు.

Heavy Rains in Telangana : గత మార్చి, ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో 18వేల 500 మంది రైతులు 23 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో దాదాపు 3వేల మంది రైతులు 8000 ఎకరాల్లో దిగుబడులను కోల్పోయారు. ఇక ప్రస్తుత సీజన్ లోనూ రైతుల పంట వర్షాలు, వరదలపాలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి వర్షాలకు దాదాపు 6 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇలా ఏటా...రైతుల శ్రమ, పెట్టుబడి మొత్తం కలిపి కోట్లలో నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

'' కురిసిన భారీ వర్షాలకు కరెంటు మోటార్స్ కొట్టుకుపోయాయి. స్తంభాలు కింద పడిపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు పెట్టి అడవుల్లా మారి పోయాయి. మేము గిరిజన రైతులం అప్పు తెచ్చి పొలాల్లో మొక్కలు నాటాము. నాటు వేసిన తర్వాత వర్షాలు వచ్చి కొట్టుకపోవడం చాలా భాదాకరంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సహాయం చేయాలని కోరుతున్నాము.''-రైతులు

Godavari Floods Effect on Khammam : ఏటా గోదావరి వరదల ప్రళయం పరివాహక ప్రాంత రైతాంగానికి తీరని నష్టాలు మిగిలిస్తోంది. ప్రధానంగా భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో సాగు నానాటికీ దయనీయంగా మారుతోంది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి శ్రమించిన పంట వరదల్లో మునగటంతో రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. గతేడాది భద్రాచలం వద్ద 71.3 అడుగులకు చేరి గోదావరి చరిత్రలోనే అతిపెద్ద మూడో నీటి మట్టం నమోదైంది. వందలాది గ్రామాలు రోజుల తరబడి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 128 గ్రామాల్లో 17వేల 637 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుక పోయాయి. వరదల ధాటికి పంటపొలాల్లో 2 నుంచి 4 అడుగుల మేర ఇసుక మేటలు వేయటంతో రైతులకు అదనపు భారం తప్పట్లేదు.

'' భారీ వర్షాలకు పొలాల్లో బురద, , ఇసుక మేటలు వేయడంతో చాలా పంటలు నష్టపోయాము. సంవత్సరం నుంచి పొలాల్లో పెట్టుబడులు పెట్టి, రోజూ కష్టపడి నాట్లు వేసుకుంటే వరదలు వచ్చి గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచాయి. లక్షల్లో పంట నష్టపోయాము. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాము.-రైతులు

No compensation from the government : వ్యవసాయ అధికారులు ఏటా పంట నష్టం లెక్కలు తీసినా ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో పరిహారం అందట్లేదు. గోదావరి వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు అసలు పరిహారం అన్న ఊసేలేకుండా పోతోంది. కిందటి సారి రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10వేల రూపాయల ప్రపకటించినా..అది కొంతమేర మాత్రమే లబ్ది చేకూర్చింది. వివిధ కారణాలతో అనేక మంది కర్షకులకు సర్కార్‌ సాయం అందలేదు. వాస్తవానికి ఎకరంలో పత్తి, వరి, మొక్కజొన్న సాగుకు 30వేల, మిర్చి పంటకు 70వేల వరకు రైతులు ఖర్చు చేస్తారు. కానీ ప్రభుత్వ సాయం అందక హలధారులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్నారు.

ఇవీ చదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.