ETV Bharat / state

వర్షాభావం... అన్నదాతల పాలిట శాపం

author img

By

Published : Jul 15, 2019, 11:17 AM IST

వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొలం పనులు లేకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు పనుల కోసం పట్టణ బాట పడుతున్నారు. ఎక్కువ శాతం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా... మరికొందరు ఏ పని వీలైతే దానికి వెళ్తున్నారు. చాలా ఏళ్లుగా నేలమ్మను నమ్మి బతుకుతున్న తాము ఇప్పుడు పనుల కోసం వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మంలో కూలీలుగా మారుతున్న రైతులు

ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లోటు వర్షపాతంతో వ్యవసాయ పనులు కుంటుబడ్డాయి. వ్యవసాయ కూలీలతో పాటు సొంతంగా భూమి కలిగి ఉన్న రైతులు సైతం పనుల కోసం పట్టణాల బాట పడుతున్నారు. సాధారణంగా అయితే ఈ సమయానికి మెట్ట పైర్లు పచ్చగా... మాగాణి భూములు దమ్ముకు సిద్ధంగా ఉండాల్సి ఉండగా ఎటు చూసినా వ్యవసాయ భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. వర్షాభావం వల్ల వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అన్నదాతల జీవన విధానమే పూర్తిగా మారిపోయింది.

ఆర్థిక పరిస్థితి అతలాకుతలం

వరుణుడు ముఖం చాటేయడం వల్ల అన్నదాత ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఉన్న కొద్ది మొత్తాన్ని దుక్కి, విత్తనాలు, ఇతర ఖర్చులకు వినియోగించాడు. వాన జాడ లేకపోవడం వల్ల వ్యాపారులు కూడా రైతులకు అప్పు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. మరోవైపు పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, కుటుంబం ముందుకు నడపడానికి అన్నదాత కూలీ అవతారమెత్తుతున్నాడు..

నగరానికి రోజుకు 1500 మంది

భద్రాద్రి జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ దాదాపు 1500 మంది వరకూ ఖమ్మం నగరానికి వలస వస్తున్నారు. వీరంతా కరెంటు స్తంభాల ఏర్పాటు, భవన నిర్మాణ పనుల్లో రోజు కూలీ కింద పనిచేస్తున్నారు.

వరుణుడు కరుణిస్తేనే...

వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప మార్పు రాదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయం భారమై... తప్పనిసరి పరిస్థితిలోనే ఇలా వలస బాట పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పది మందికి పని ఇచ్చే వారు సైతం ఇప్పుడు పనులు కోసం చూస్తున్నట్లు వాపోయారు.

ఇదీ చూడండి : రుణమాఫీపై అయోమయంలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.