MINISTER PUVVADA AJAY KUMAR: తెరాస.. కేవలం కొందరు నాయకుల పార్టీ కాదు.!

author img

By

Published : Sep 10, 2021, 5:20 PM IST

minister puvvada ajay kumar

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు అందించి ఉమ్మడి ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తన సంకల్పమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ స్పష్టం చేశారు. నలుగురు, ఐదుగురు నాయకుల మీద ఆధారపడిన పార్టీ తెరాస కాదని.. సీఎం కేసీఆర్ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సాగుతుంటే.. ఆ నలుగురి మీదో.. ఈ ఐదుగురి మీదో తెరాస నడుస్తుందని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మంత్రిగా ఈ రెండేళ్లలో సంతృప్తికరమైన ఫలితాలు చూశానని.. రాబోయే మూడేళ్లలో మరింత ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. మంత్రిగా సెప్టెంబరు 8వ తేదీతో రెండేళ్లు పూర్తి చేసుకున్న పువ్వాడ.. ఈనాడు, ఈటీవీ-భారత్​, ఈటీవీ- తెలంగాణతో ముచ్చటించారు.

మంత్రిగా రెండేళ్లలో పువ్వాడ అనుభవాలు, విజయాలపై చిట్​చాట్​

ఈటీవీ భారత్: మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. మీ అనుభూతి, సాధించిన విజయాలు ఏంటి?

మంత్రి పువ్వాడ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం నా అదృష్టం. అభివృద్ధి, రాజకీయపరంగా నా రెండేళ్ల పదవి ఎంతో సంతృప్తి నిచ్చింది. అన్ని ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపాం. పల్లె, పట్టణ ప్రగతిలో ఉమ్మడి జిల్లా తొలి మూడు స్థానాల్లో నిలవడం గర్వంగా ఉంది. గత ఖమ్మం జిల్లాను ప్రస్తుతాన్ని పోల్చిచూసుకుంటే ప్రజల కళ్లముందే అభివృద్ధి కనిపించేలా పనులు చేపట్టాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన సహకారంతో రూ.వేల కోట్లతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సమగ్ర అభివృద్ధి సాగుతోంది. ఈ రెండేళ్లలో జరిగిన స్థానిక సంస్థల నుంచి ఇటీవలి నగరపాలక సంస్థ ఎన్నికల వరకు తెరాసకు దక్కిన అప్రతిహత విజయాలు సంతృప్తినిచ్చాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ మరింత సంకల్పంతో పనిచేసేందుకు రానున్న రోజుల్లో ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తా.

ఈటీవీ భారత్: రవాణాశాఖలో చేపట్టిన సంస్కరణలు ఏమేరకు సత్ఫలితాలిచ్చాయి. భవిష్యత్ లక్ష్యాలు ఏంటి.?

మంత్రి: రవాణాశాఖను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపట్టాం. సింహభాగం సేవలను ఆన్​లైన్ చేశాం. త్వరలో ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ అద్భుతంగా సాగుతుందన్న నమ్మకం ఉంది. అనేక ఒడుదొడుకులను తట్టుకుని ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు వడివడిగా పరుగులు పెట్టేలా అనేక చర్యలు చేపట్టాం. కొవిడ్ మహమ్మారిని తట్టుకుని నిలబడేలా చేశాం. టికెట్ ఆదాయం రూపంలో రూ.2 వేల కోట్లు కోల్పోయినా సంస్థ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లిస్తున్నాం. రోజుకు రూ.10 కోట్లకుపైన ఆదాయం వచ్చేలా చేశాం. ఆర్టీసీలో మిగిలిన సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తా. ఆర్టీసీని పూర్తిగా సొంతకాళ్లమీద నిలబడేలా చేయడమే మా లక్ష్యం.

ఈటీవీ భారత్: గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు సేవలు నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైంది. మళ్లీ సేవలు పునరుద్ధరిస్తారా..?

మంత్రి: కొవిడ్ పరిస్థితులు, ఆదాయం లేక అద్దె బస్సులకు అద్దెలు చెల్లించలేకపోవడం వల్ల గ్రామాలకు ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చి వరకు వాళ్లకు అందాల్సిన బకాయిలు చెల్లించాం. తిరిగి మళ్లీ సేవలు ప్రారంభమవుతున్నాయి. కానీ ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. పల్లె వెలుగు తిరిగే ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ పెరగాల్సి ఉంది. ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉంది.

ఈటీవీ భారత్: సీతారామ ప్రాజెక్టు కోసం ఉభయ జిల్లాల రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలోగా రైతులకు సాగు నీరు అందిస్తారు.?

మంత్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. బ్యాంకు రుణాలకు సంబంధించిన కొన్ని లింకేజీలు ఉన్నాయి. కేంద్రం వద్ద గోదావరి ప్రాజెక్టుల వ్యవహారం నలుగుతోంది. బ్యాంకు లోన్లు మంజూరు కావాల్సి ఉంది. వీటిన్నంటినీ అధిగమించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టులో మొదటి మూడు పంపుహౌస్​లు సిద్ధంగా ఉన్నాయి. నీళ్లు ఎత్తిపోసేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉంది. కొత్త ఆయకట్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ సిద్ధం కావాల్సి ఉంది. సత్తుపల్లి ప్రధాన ట్రంక్ కెనాల్ పనులు సాగుతున్నాయి. పాలేరు లింకు కెనాల్​కు సంబంధించి భూ సేకరణ పూర్తయింది. ఈ రెండు పూర్తయితే ప్రాజెక్టు ద్వారా దాదాపు 50-60 శాతం ఆయకట్టును స్థిరీకరించవచ్చు. రాబోయే ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే ఖరీఫ్​ సీజన్​కు సాగు నీరు అందిస్తాం.

ఈటీవీ భారత్: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇది పేదల వైద్యంపై ప్రభావం చూపుతుంది. శాశ్వత పరిష్కారం ఎలా చూపుతారు.?

మంత్రి: కొవిడ్ సమయంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్యం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు అందించాయి. వేలాది మంది కరోనా బాధితులకు ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం అందించడం గర్వంగా ఉంది. ఐదేళ్ల క్రితం ఉన్న ఆస్పత్రిని ప్రస్తుతానికి పోల్చుకుంటే అనేక ఆధునిక సొబగులు సంతరించుకుంది. మిగతా ఆస్పత్రులు అత్యుత్తమ సేవలు అందించాయి. 250 పడకల ఆస్పత్రి.. 500 పడకల ఆస్పత్రిగా మారింది. సిబ్బంది కొరత వేధిస్తున్న మాట వాస్తవమే. అందుకోసం అవసరమైన నియామకాలు జరుగుతున్నాయి. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నది సీఎం ఆలోచన. రాబోయే రోజుల్లో ఖమ్మం ఆస్పత్రి వైద్య కళాశాల అయ్యే అవకాశం ఉంది. సిబ్బంది కొరత, ఇతర ఏ విధమైన అవసరాలు ఉన్నా ఏర్పాటు చేస్తాం.

ఈటీవీ భారత్: ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని ప్రభుత్వం చెబుతుంది. జిల్లాలో మాత్రం ఎన్నెస్పీ, సీలింగ్, అసైన్డు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

మంత్రి: ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం అధికారుల బాధ్యత. ఇందుకోసం టాస్క్​ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశాం. ఖమ్మంలో అనేక చోట్ల కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకున్నాం. ఎక్కడా ప్రభుత్వ భూముల కబ్జాలను సహించేది లేదు. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భూముల ధరలు పెరిగినప్పుడు కబ్జాలు చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తుంటారు. వారిని ఎక్కడికక్కడే అడ్డుకోవాలి.

ఈటీవీ భారత్: గ్రీన్ ఫీల్డ్ రహదారికి భూములిచ్చే రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. పరిహారం పెంచాలన్న డిమాండ్లపై మీరేమంటారు.?

మంత్రి: ఈ వ్యవహారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కేంద్రం ఎంతమేర భూమికి పరిహారం ఇస్తే అంత వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయగలుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర భూ సేకరణ వరకే ఉంటుంది. పరిహారం ఎంత ఇవ్వాలన్న నిర్ణయం కేంద్రానిదే. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపుతోంది.

ఈటీవీ భారత్: దళితబంధు పథకంలో జిల్లాకు స్థానం దక్కింది. అమలుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు.?

మంత్రి: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన దళితబంధు పథకం అమలు కోసం జిల్లాకు స్థానం దక్కడం ప్రజల అదృష్టం. సీఎంతో సమావేశం తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం. దళితులు ఎక్కువగా ఉన్న 10 మండలాలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడే కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో దళితులకు పథకం ఫలాలు అందేలా చూస్తాం.

'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 8 మంది తెరాస వారే ఉన్నారు. వారందరిదీ ప్రధాన బాధ్యతే. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసి 2023లో అన్ని స్థానాల్లో తెరాసను గెలిపించడమే నా కర్తవ్యం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమగ్రాభివృద్ధివైపు నడిపిస్తా.'

ఈటీవీ భారత్: ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎలాంటి కార్యాచరణ ఉంది. నేతల మధ్య విబేధాలపై మీరేమంటారు.?

మంత్రి: పార్టీ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తాం. 2023లో అద్భుత విజయాలు సాధించేందుకు ఇది దోహదపడుతుంది. అందుకోసం వ్యక్తిగత నిర్ణయాలతో కాకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్టీకి గట్టి పునాదులు వేస్తా. నలుగురి మీదో, ఐదుగురి నాయకుల మీదో ఆధారపడిన పార్టీ కాదు. కేసీఆర్ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ. ఎవరికి వారు యమునాతీరే అన్నట్లు ఉన్నారన్నది వాస్తవం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు అంతా కలిసి పనిచేస్తాం. క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలను బలోపేతం చేసి తెరాసను గెలిపించడమే నా కర్తవ్యం.

ఈటీవీ భారత్: వచ్చే మూడేళ్లలో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు.?

మంత్రి: స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.ఈ రెండేళ్లలో స్వల్పకాలిక లక్ష్యాలను సాధించాం. ఉభయ జిల్లాలోని ప్రతీ పల్లె, పట్టణం అభివృద్ధి చెందాలన్నదే దీర్ఘకాలిక లక్ష్యం. ఏజెన్సీ పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో దశలవారీగా అభివృద్ధి కాంతులు తీసుకురావాలన్నది లక్ష్యం. 2023 ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించాలన్నది నా రాజకీయ లక్ష్యం.

ఇదీ చదవండి: Dalit Bandhu: దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సన్నాహక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.