ETV Bharat / state

చీమలపాడు ఘటన.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అధికార, విపక్ష నేతలు

author img

By

Published : Apr 12, 2023, 3:56 PM IST

CM KCR
CM KCR

CM KCR reacts on Cheemalapadu Fire Accident : కారేపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్​రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి చెందడం విచారకరమన్న కేసీఆర్... మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బీఆర్​ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్​ఎస్ స్వార్థ రాజకీయాలకు పేదలు బలయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

CM KCR reacts on Cheemalapadu Fire Accident : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల బీఆర్​ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలిండర్‌ పేలి ఇద్దరు మృతిచెందడం విచారకరమని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి జరగటం బాధాకరమన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... మంత్రి పువ్వాడ, ఎంపీ నామాతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : కారేపల్లి ప్రమాద ఘటన దురదృష్టకరమని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అగ్నిప్రమాదం ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఖమ్మం జిల్లా అధికారులు, నేతలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు అండగా ఉంటామన్న మంత్రి.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాద బాధితులకు తాము అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కారేపల్లి అగ్నిప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు... ఇద్దరు చనిపోవటం బాధాకరమన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడిన హరీశ్​రావు.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నిమ్స్‌కు తరలించాలని ఆదేశాలు పంపారు.

బీఆర్​ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి : ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్ ఆత్మీయ సమావేశంలో బాణాసంచా నిప్పురవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం పట్ల బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని సంజయ్ డిమాండ్‌ చేశారు. బీఆర్​ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ మండిపడ్డారు. బాధ్యులైన బీఆర్​ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల వ్యాఖ్యానించారు.

బీఆర్​ఎస్ స్వార్థ రాజకీయాలకు పేదలు బలయ్యారు : ఖమ్మం జిల్లాలో అగ్నిప్రమాదం ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చెందారు. బీఆర్​ఎస్ స్వార్థ రాజకీయాలకు పేదలు బలయ్యారన్న రేవంత్‌.. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

అసలేం జరిగిందంటే : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశ వేదిక సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సమావేశానికి నాయకులు వస్తున్న వేళ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అప్పుడు ఆ నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని గుడిసెపై పడి మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలుడు ధాటికి పోలీసు 8 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమించి ఇద్దరు మృతిచెందారు. ఘటనలో బానోతు రమేశ్‌, అంగోతు మంగు మృత్యువాతపడ్డారు. బంధువుల హాహాకారాలతో చీమలపాడు శోకసంద్రంలో మునిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.