బైక్ లిఫ్ట్ మిస్టరీ ఛేదించిన పోలీసులు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

author img

By

Published : Sep 21, 2022, 6:41 AM IST

ఇంజక్షన్ దాడి హత్య ఘటనలో పోలీసుల కీలక పురోగతి.. ఆ వ్యవహారమే కారణం..!

Khammam bike lift murder case update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్ దాడి హత్య ఘటనలో ఖమ్మం జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటనపై 24 గంటల్లోనే నిందితులకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసుల విచారణ సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Khammam bike lift murder case update : ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని.. ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటన చేధించే దిశగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు సాగించారు. కేసును చేధించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ఖమ్మం గ్రామీణం ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు సంఘటన జరిగిన తీరు, నిందితుల ఆచూకీ కోసం ముమ్మర విచారణ చేపట్టాయి.

Bike Lift Murder Case Latest news : విశ్వసనీయ సమాచారం ప్రకారం చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్​ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. మత్తు మందును అధిక మోతాదులో ఇవ్వడం వల్లే జమాల్‌ చనిపోయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా.. ఓ ఆర్​ఎంపీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే.. ఈ ముగ్గురూ పరారీలో ఉండగా.. వీరి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Bike Lift Murder in Khammam Case : ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పూర్తిగా కేసు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. జమాల్ సాహెబ్ కుటుంబసభ్యుల ఫోన్ కాల్ డేటా సేకరించడం, ఆ కాల్ డేటాలో ఉన్న వివరాల ఆధారంగా ఎక్కువ సార్లు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తులను గుర్తించినట్లు సమాచారం. జమాల్ భార్య ఫోన్‌కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నెంబర్లు ఉండటం, వారితోనే ఎక్కువసార్లు మాట్లాడినట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించడం కేసుకు మరింత బలం చేకూరుస్తోంది. అందువల్లే పూర్తిగా వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసుల విచారణ సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు జమాల్ కుటుంబసభ్యులందరినీ ఇవాళ ముదిగొండ పోలీసుస్టేషన్‌లో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందింది.

ఇదీ జరిగింది.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ముదిగొండ మండలం వల్లభి సమీపంలో సోమవారం ఇంజక్షన్ దాడిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. వల్లభిలోని ఘటనా ప్రాంతాన్ని ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. జమాల్ సాహెబ్‌కు మంచినీళ్లు ఇవ్వడంతో పాటు వల్లభి ఆస్పత్రికి తరలించిన ఇద్దరు యువకులను ప్రశ్నించారు.

జమాల్ సాహెబ్‌తో ఆ ఇద్దరికీ గతంలో పరిచయం ఉందా..? జమాల్ సాహెబ్ వారితో ఏం మాట్లాడారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు యువకులు సమాధానమిచ్చారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. ఇదే ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వివరాలూ నమోదు చేసుకున్నారు. అయిప్పటికీ కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసుల దృష్టి జమాల్ సాహెబ్ కుటుంబీకుల వైపు మళ్లింది.

జమాల్ సాహెబ్ కుటుంబసభ్యుల కాల్ డేటాను సైతం పోలీసులు సేకరించారు. ఇక్కడే పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పోలీసులకు లభించిన ఆధారాలతో మున్నేరు ఒడ్డున ఉన్న గ్రామానికి చేరుకుని ఓ వ్యక్తిని విచారించేందుకు వెళ్లగా.. అతడు పోలీసులను ఏమార్చి పరారైనట్లు సమాచారం. హత్య కేసులో సూత్రధారులుగా ఉన్న మరో ఇద్దరికీ ఈ సమాచారం పొక్కడంతో వారూ పారిపోయినట్లు తెలిసింది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పూర్తి ఆధారాలు లభించినందున పోలీసులు ఇవాళ వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.