ETV Bharat / state

Huzurabad By Elections: కాంగ్రెస్​కు ఉపఎన్నిక గండం.. ఈసారి రేవంత్​ హస్తవాసి పనిచేసేనా?

author img

By

Published : Aug 3, 2021, 8:31 AM IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఉపఎన్నికల గండం వెంటాడుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తరువాత జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ పార్టీ.. తన ఉనికిని చాటుకోలేకపోయింది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గమైనా, బలమైన అభ్యర్థి ఉన్న స్థానమైనా హస్తం పార్టీ విజయతీరాలను తాకలేకపోతోంది. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక రూపంలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీలో టెన్షన్ మొదలైంది.

will congress party win in huzurabad by elections in telangana
will congress party win in huzurabad by elections in telangana

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌... ప్రజల నుంచి మాత్రం ఆశించిన ఆదరణ పొందలేకపోతోంది. ఏ ఎన్నికలు వచ్చినా... ఓటమినే మూటగట్టుకుంటోంది. ప్రత్యేకించి ఉపఎన్నికలు మాత్రం హస్తం పార్టీకి కలిసి రావడం లేదు. సిట్టింగ్ స్థానాలను సైతం నిలబెట్టుకోలేక చతికిలపడుతూ వస్తోంది.

అప్పటి నుంచే ఓటమి పరంపర...

రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ రాజీనామాతో వచ్చిన మెదక్ ఉపఎన్నికతో మొదలైన కాంగ్రెస్ ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. నారాయఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలోనూ హస్తం పార్టీ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత కడియం శ్రీహరి రాజీనామాతో జరిగిన వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలోనూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి రాజీనామాతో వచ్చిన హుజూర్​నగర్ ఉప ఎన్నికలోనూ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో పార్టీ మొత్తం పనిచేసినా డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కూడా విజయఢంకా మోగించలేకపోయారు.

పార్టీ కేడర్​లో ఆందోళన..

తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో కాంగ్రెస్​ పార్టీ మరో సవాల్‌ను ఎదుర్కోబోతోంది. వాస్తవానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 1983 తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ గెలువలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 62వేల ఓట్లు సాధించి కొంత ప్రభావాన్ని చూపగలిగింది. ఈటల రాజేందర్... పార్టీ మారిన తర్వాత ఆ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పాడి కౌశిక్ రెడ్డి... ఇటీవలే తెరాస గూటికి చేరారు. ఈ తాజా పరిణామంతో అభ్యర్థి ఎవరనే అంశంపై ఆ పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది.

రేవంత్​కు మొదటి సవాల్​...

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న మొదటి ఉప ఎన్నిక కావడం వల్ల... అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారు? ఫలితాలు ఏవిధంగా ఉండబోతాయి? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్‌ రెడ్డి మాత్రం ఆ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, అదొక ప్రక్రియ... ఆ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని తమ కార్యక్రమాలు, కార్యచరణలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేశారు. తమ లక్ష్యం అంతా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలేనని రేవంత్​ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం సాధించే దిశగా తమ పోరాటాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు..

హుజూరాబాద్ ఉపఎన్నికల పూర్తి బాధ్యతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కమిటీకి అప్పగించారు. మండలాల వారిగా ఇంఛార్జీలను నియమించి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దామోదర రాజనర్సింహ ప్రత్యేక దృష్టి పెట్టారు. మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ గతం కంటే మంచి ఫలితాలు రాకపోయినా... అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకునైనా నిలబెట్టుకుంటే చాలన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.