Telangana govt schools : సర్కారు బడుల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత

author img

By

Published : Sep 25, 2021, 8:50 AM IST

Sanitation workers issue

సర్కారు బడుల(Telangana govt schools)ను పారిశుద్ధ్య కార్మికుల కొరత వేధిస్తోంది. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించింది. కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులే సొంత ఖర్చులతో స్వచ్ఛ కార్మికులను నియమించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల పాఠశాల(Telangana govt schools)ల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో వేల సంఖ్యలోని ప్రభుత్వ పాఠశాల(Telangana govt schools)ల్లో స్వచ్ఛ కార్మికులు పనిచేస్తున్నారు. కాకపోతే వారిని ప్రభుత్వం నియమించలేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తలా కొంత మొత్తం వేసుకొని రూ.1500 నుంచి 2 వేల వేతనాలు చెల్లిస్తూ వారిని ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల(Telangana govt schools)ల్లో పారిశుద్ధ్య బాధ్యత చూడాల్సిన స్థానిక సంస్థలు ముఖం చాటేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ‘‘కొన్ని చోట్ల స్థానిక సంస్థల సిబ్బంది వచ్చినా ప్రాంగణాన్ని మాత్రమే శుభ్రం చేసి వెళ్లిపోతున్నారు. శౌచాలయాల జోలికి వెళ్లడం లేదు. నిత్యం వారి కోసం ఎదురుచూడ లేక గతంలో పనిచేసిన స్వచ్ఛ కార్మికులను నియమించుకున్నాం’’ అని పలు పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 3 వేల పాఠశాల(Telangana govt schools)ల్లో ఇలా సొంతంగా నియమించుకొని ఉంటారని తెలుస్తోంది.

పారిశుద్ధ్య పనులు చేసేందుకు 2018-19 విద్యా సంవత్సరంలో దాదాపు 25 వేల పాఠశాల(Telangana govt schools)ల్లో 25 వేల మంది స్వచ్ఛ కార్మికులను నియమించారు. వారికి నెలకు రూ.2,500 వేతనం ఇచ్చేవారు. గత విద్యా సంవత్సరం నుంచి వారిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు. కరోనా సమయంలో వారి అవసరం మరింత పెరిగిందని ఉపాధ్యాయ సంఘాలు వివరించినా విద్యాశాఖ వినలేదు. స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల సిబ్బందే బడుల్లో పారిశుద్ధ్య పనులు చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెలలో ప్రకటించారు. ఆయా శాఖలు కూడా ఆదేశాలు జారీచేశాయి. అయినా అధిక శాతం బడులకు పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఒకరిని ప్రత్యేకంగా పాఠశాలకు కేటాయించాలి

‘ప్రతి పంచాయతీకి నిధులిచ్చి ఒక కార్మికుడిని ప్రత్యేకంగా ఒక పాఠశాలకు కేటాయించాలి’ అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాతు సురేష్‌, టీఎస్‌టీయూ ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మచ్చుకు కొన్ని పాఠశాలల్లో పరిస్థితి ఇదీ..

నారాయణపేట జిల్లా బాసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన స్వచ్ఛ కార్మికురాలు కేశమ్మను నెలకు రూ.2 వేల వేతనంతో ఉపాధ్యాయులు తిరిగి నియమించుకున్నారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమూడర్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఇద్దరు కార్మికులను నియమించుకున్నారు. వారి వేతనాలకు ప్రధానోపాధ్యాయుడు నెలకు రూ.500, ఉపాధ్యాయులు తలా రూ.300 వెచ్చిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్ద్యారం హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు ఒక్కరే నెలకు రూ.1500 చొప్పున భరిస్తూ కార్మికురాలిని నియమించుకున్నారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్సుపడక ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులున్నారు. 12 తరగతి గదులు, ఆరు శౌచాలయాలున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు రూ.2 వేలు భరిస్తూ ఓ స్వచ్ఛ కార్మికుడిని నియమించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.