ETV Bharat / state

Dalitha Bandhu: దళితవాడల్లో మౌలిక సదుపాయాలు.. చర్యలకు సీఎం ఆదేశాలు

author img

By

Published : Aug 4, 2021, 4:59 AM IST

దళితబంధు పథకం అమలుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. దళితవాడల్లో మౌలికవసతులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో యుద్ధప్రాతిపకన సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్‌లో ఆదిశగా ఇప్పటికే సర్వే, కసరత్తు సాగుతోంది. వాసాలమర్రి పర్యటనలోనూ సీఎం దళితబస్తీని ప్రత్యేకంగా సందర్శించనున్నారు.

Dalitha Bandhu
దళితబంధు పథకం అమలుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్

దళితుల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలుచేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఈనెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనుండగా ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన దళిత ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. పథకం లక్ష్యాలు వివరించిన సీఎం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు సహా దళితవాడల్లో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, విద్యుత్‌స్తంభాలు, డ్రైనేజీ సౌకర్యం లేవని నేతలతోపాటు పలువురు ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లారు.

దళితబస్తీల్లో మౌలిక సదుపాయాలు

స్పందించిన ముఖ్యమంత్రి దళితబంధు అమలుతోపాటు దళితవాడల్లో మౌలికసదుపాయాలను మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో దళితుల అసైన్డ్, గ్రామకంఠం వంటి భూసమస్యలు పరిష్కరించాలని.. దళితవాడల్లో తాగునీరు, రహదారులు సహా మౌలిక వసతులను సంపూర్ణస్థాయిలో మెరుగుపర్చి, దళితబంధు పథకం అమలుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలోని గ్రామకంఠాల భూముల వివరాల జాబితా సిద్ధంచేయడంతోపాటు. దళితులకే హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని.. ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్‌లో వారం, పది రోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అసైన్డ్ భూములు సహాదళితులకు చెందిన అన్ని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతి తెలిపేలా ప్రొఫైల్ తయారుచేయాలన్న ఆదేశాలతో వివిధశాఖలకు చెందిన ఇంజనీర్ల నేతృత్వంలోని 108 బృందాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించి మౌలిక సదుపాయాలు, వసతుల వివరాలు సేకరించాయి. ఆ వివరాల ఆధారంగాప్రొఫైల్ తయారు చేస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన చర్యలు


రాష్ట్రవ్యాప్తంగా అన్ని దళితబస్తీల్లోనూ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంత్రివర్గ భేటీలో స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగా దళితవాడల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన సహా మిగతా గ్రామంతో సమానంగా అన్నిహంగులు కల్పించాలని చెప్పారు ఇందుకోసం ఎలాంటి నిధుల కొరతా లేదని తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా సీసీ రోడ్లు రహదార్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, స్తంభాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్‌శాఖలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితబస్తీల్లో పరిస్థితిని అధ్యయనం చేసి వివరాలు తెప్పించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ వివరాలు క్రోడీకరించి దళిత వాడల్లో మౌలికసదుపాయాల మెరుగుదల కోసం ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి అమలు చేయనున్నారు. ఆయాశాఖల వద్ద ఉన్న వివిధ నిధులనుంచి ఆపని పూర్తిచేయనున్నారు. దత్తతగ్రామమైన వాసాలమర్రిలో నేడు పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితవాడపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.


ఇదీ చూడండి:

Vasalamarri: సీఎం కేసీఆర్​తో భోజనం చేసిన ఆగమ్మకు అస్వస్థత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.