ETV Bharat / state

హుజూరాబాద్ ఉపసమరానికి సర్వం సిద్ధం.. ఓటు వేసే ప్రతి ఒక్కరు ఇవి పాటించాల్సిందే..!

author img

By

Published : Oct 29, 2021, 8:52 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉపపోరుకు సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేసిన ఉపఎన్నికకు రేపు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

huzurabad assembly by poll
huzurabad assembly by poll

హుజూరాబాద్ ఉపసమరానికి సర్వం సిద్ధం.. ఓటు వేసే ప్రతి ఒక్కరు ఇవి పాటించాల్సిందే..!

ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా బరిలో నిలిచినా హూజూరాబాద్‌ ఉపసమరానికి సర్వం సిద్ధమైంది. తెరాసపై గెలుపొందిన ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇందుకు సంబంధించి శనివారం జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 2లక్షల 37వేల 22మంది ఓటర్లు ఉండగా వీరిలో లక్షా 17వేల 922 మంది పురుషులు, లక్షా 19వేల 99మంది మహిళలు ఉన్నారు. 30మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ఈవీఎం ద్వారా ఓటింగ్‌ జరగనుంది.

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్‌ మండలాల్లోని 106 గ్రామపంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణపై ఈసారి అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిఘా పెట్టనున్నారు. అత్యంత సమస్యాత్మకమే కాకుండా అన్నిచోట్ల ఎన్నికల తీరును నిరాంతరాయంగా పరిశీలించనున్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది. వెబ్​ కాస్టింగ్​ ద్వారా ఓటింగ్​ ప్రక్రియను రికార్డు చేస్తాం.

-శశాంక్​ గోయల్​, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.

గుర్తింపు కార్డు పక్కా.. ఫోన్లు వద్దు

పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఓటర్‌ స్లిప్ గుర్తింపుకార్డు కాదన్న అధికారులు... కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వీ కర్ణన్‌ తెలిపారు.

ఎన్నికల సందర్భంగా విద్యుత్​ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశాం. సోలార్​ లైట్లు కూడా ఏర్పాటు చేశాం. ఓటు వేసేందుకు వెళ్లే ప్రతి ఒక్కరు ఓటర్​ గుర్తింపు కార్డు, ఆధార్​ లేదా ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్​ కేంద్రాల్లోకి ఫోన్​ అనుమతి లేదు. ఓటర్లు గాని పోలింగ్​ ఏజెంట్లు గాని ఎవ్వరూ ఫోన్​ తీసుకెళ్లకూడదు.

- ఆర్వీ కర్ణన్​, జిల్లా కలెక్టర్​.

సమాచారం ఇవ్వండి

హుజూరాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో 3,865 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 1,471 మంది ఇతర జిల్లాల నుంచి నియమించారు. నియోజకవర్గంలో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి... అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం పంపిణీ చేసే వారిని సీ- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే పట్టుకొని చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రజలు సమాచారం ఇవ్వకున్నా, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు వారిని గుర్తించి పట్టుకుంటాయని తెలిపారు. నకిలీ ఫిర్యాదులు ఇచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎక్కడైనా మద్యం, నగదు పంపిణీ సహా ఏదైనా ప్రలోభానికి పెట్టే చర్య జరుగుతున్నట్లయితే సీ- విజిల్​ యాప్​ ద్వారా ఫిర్యాదు చేయాలి. రౌడీలపై నిఘా పెట్టాం. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

-సత్యనారాయణ, కరీంనగర్​ పోలీస్​ కమిషనర్​.

పరీక్షలు వాయిదా..

జేఎన్‌టీయూహెచ్ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. హుజూరాబాద్ ఎన్నిక ఉన్నందున రేపటి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బీటెక్, బీ ఫార్మా, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ సెమిస్టర్ పరీక్ష వాయిదా పడ్డాయి. నవంబర్‌ 1 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జేఎన్‌టీయూ అధికారులు వెల్లడించారు. శనివారం హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపుచేపట్టనున్నారు.

ఇదీ చూడండి: Huzurabad By Election: ఇంత తక్కువిస్తున్నారేంది.. మా ఓట్లు అంత చీపా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.