పనిచేసే నేతలు.. సహకరించే ప్రజలు.. ఇదీ సదాశివనగర్​ అభివృద్ధి మంత్రం

author img

By

Published : Sep 29, 2021, 5:56 PM IST

sadashiv nagar village

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త.. నిర్వహణ లేని మురుగు కాల్వలు.. సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు.. మచ్చుకైనా కనిపించని పచ్చదనం.. ఇవీ పల్లె ప్రగతికి ముందు గ్రామాల్లో పరిస్థితి. కానీ నాలుగు విడతల పల్లె ప్రగతిలో పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎటు చూసినా పచ్చదనం, అనునిత్యం పరిసరాలను శుభ్రం చేయడం.. స్వచ్ఛతపై ప్రజలను అప్రమత్తం చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచి.. పల్లె ప్రగతి (pallepragathi program)కార్యక్రమానికి ఉదాహరణగా నిలుస్తోంది కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామం. ఇవేకాక వంద శాతం వ్యాక్సినేషన్​తో (corona vaccination) ఆదర్శంగానూ నిలుస్తోంది. పల్లె ప్రగతికి ముందు, తర్వాత అని చెప్పుకునేలా జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించిన సదాశివనగర్ గ్రామంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

పనిచేసే నేతలు.. సహకరించే ప్రజలు.. ఇదీ సదాశివనగర్​ అభివృద్ధి మంత్రం

కామారెడ్డి జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ సదాశివనగర్ గ్రామం. జిల్లా కేంద్రం కామారెడ్డికి 15 కి.మీ.ల దూరంలో 44వ జాతీయ రహదారి ఆనుకొని ఉంటుంది. తొమ్మిది వేల జనాభా ఉంటే.. 5,300 మంది ఓటర్లు ఉన్నారు. 14 మంది వార్డు సభ్యులు ఉన్నారు. 8 మంది మహిళలు ఉండగా.. మిగతా ఆరుగురు పురుషులు ఉన్నారు. పంచాయతీ పాలకవర్గం పార్టీలకతీతంగా ఐకమత్యంతో ముందుకునడుస్తోంది. వార్డు సభ్యులందరూ ఒకే మాట మీద ఉంటూ కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. సర్పంచ్​కు సహకరిస్తూ తమవంతు పాత్ర పోషించారు. ఫలితంగా మిగిలిన పంచాయతీలతో పోల్చితే సదాశివనగర్​ అభివృద్ధిలో ముందు నిలిచింది. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో అందరినీ ఆకట్టుకుంటోంది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, మంకీ ఫుడ్ కోర్టు (monkey food court), అవెన్యూ ప్లాంటేషన్​, సహా వందశాతం కరోనా వ్యాక్సినేషన్​ (corona vaccination) పూర్తిచేసి జిల్లాలోనే గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు.

అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా..

పల్లె ప్రగతికి ముందు.. గ్రామంలో అంతగా పచ్చదనం ఉండేది కాదు. ఎటు చూసినా రోడ్లపై చెత్త దర్శనమిచ్చేది. రోడ్డు పక్కన మురుగు నీరు చేరి దుర్గంధం వచ్చేది. పిల్లలు ఆడుకునేందుకు.. గ్రామస్తులు సేద తీరేందుకు పార్కు ఉండేది కాదు. పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ అయినా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండేవి. కానీ పల్లె ప్రగతి కార్యక్రమంతో సదాశివనగర్​ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలోనే (sadashivanagar got best panchayat award) ఉత్తమ పంచాయతీగా నిలిచింది. రూ.5 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్ట్​షెడ్, రూ.2 లక్షలతో మంకీ ఫుడ్​కోర్టు, రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, రూ.50 లక్షలతో 3 వేలమీటర్ల సీసీ మురుగు కాల్వలు నిర్మించారు. పల్లె ప్రగతి ప్రారంభంలో ట్రాక్టర్, ఇతర సామగ్రిని రూ.11.50 లక్షలతో కొనుగోలు చేశారు.

మంత్రులు, అధికారుల ప్రశంసలు..

పల్లె ప్రగతిలో పచ్చదనానికి సర్పంచ్ బద్దం శ్రీనివాసరెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చారు. గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, కబ్రస్థాన్, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఆర్అండ్ బీ రోడ్డులో జాతీయ రహదారి నుంచి తిర్మన్​పల్లి శివారు వరకు మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో ఎకరం విస్తీర్ణంలో 37 రకాలైన 4 వేల మొక్కలు నాటారు. ప్రత్యేకంగా నడకదారి, కూర్చునే బెంచీలు, చుట్టూ సోలార్ సాయంతో ఫెన్సింగ్, మొక్కలకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈత వనం, మంకీ ఫుడ్ కోర్టులో 2 వేల మొక్కలు నాటారు. మొత్తం గ్రామంలో 20 వేల మొక్కలు నాటారు. దీంతో గ్రామం అంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి రెండు సార్లు గ్రామంలో పర్యటించి హరితహారం, కోటి వృక్షార్చనలో మొక్కలు నాటారు. పల్లె ప్రగతి ట్రాక్టర్​ను నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా.. పల్లె ప్రగతి పనులను పరిశీలించి పార్కులో ఒక గంటపాటు సేదతీరి పాలకవర్గానికి కితాబునిచ్చారు.

నాలుగు అవార్డులు..

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకవర్గం, సిబ్బంది నిత్యం శ్రమిస్తున్నారు. రోజూ ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నారు. గ్రామంలో ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై చెత్త వేయరు. నెలకోసారి సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తారు. నిత్యం రోడ్లు శుభ్రం చేస్తారు. నీళ్ల ట్యాంకులు, పశువుల తొట్టెలను నెలకు కనీసం మూడుసార్లు బ్లీచింగ్​తో శుభ్రం చేస్తారు. పంచాయతీలో మొక్కలు కాపాడేందుకు 14 మంది, పరిసరాలు శుభ్రం, ఇతర పనుల కోసం పంచాయతీ కింద మరో 14 మంది పని చేస్తున్నారు. రూ.2.80 లక్షల విలువైన వైకుంఠ రథాన్ని తన తండ్రి బద్ధం ఆశిరెడ్డి పేరుమీద సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గ్రామానికి విరాళంగా అందించారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ సైతం రూ.50 వేల విలువైన ఫ్రీజర్​ను పంచాయతీకి అందించింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని వందశాతం అమలు చేసి మంచి ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిపినందుకుగానూ ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సదాశివనగర్​ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి.. జిల్లా ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. వీటితోపాటు ఉత్తమ మండలం, ఉత్తమ పంచాయతీ కార్యదర్శి, ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ దాత అవార్డులను సైతం సాధించి సదాశివనగర్​ గ్రామం మిగిలిన పంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచింది.

ఇవే కాకుండా గ్రామంలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిచేసి.. ఆదర్శంగా నిలిచింది.. సదాశివనగర్​ గ్రామం. ఇంకుడు గుంతలు, ఇంటింటి మరుగుదొడ్లలోనూ మిగతా గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీచూడండి: ktr about dairy development: 'పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.