ETV Bharat / state

కిష్టవ్వ కథ చితికి.. ఎట్టకేలకు అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్న పిల్లలు

author img

By

Published : May 8, 2023, 2:07 PM IST

human Incident in kamareddy
human Incident in kamareddy

human Incident in kamareddy: ఆస్తి పంపకాలు చేయలేదని కన్నతల్లి శవాన్ని దవాఖానాలో వదిలేసిపోయిన కుమారుడు, కుమార్తెలు.. ఎట్టకేలకు తల్లి మృతదేహన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు. అనారోగ్యంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం మృతి చెందిన కిష్టవ్వ అనే వృద్దురాలి మృతదేహాన్ని పోలీసుల కౌన్సిలింగ్​తో ఆమె పిల్లలు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఎట్టకేలకు ఒప్పుకున్నారు.

అందరూ ఉన్నా.. అనాథ శవంగా మిగిలింది

'రూపాయి రూపాయి ఏం చేస్తావ్ అంటే.. అన్నదమ్ములను విడదీస్తాను.. భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతాను. ప్రపంచాన్నే శాసిస్తాను' అందటా. వింటుంటే ఇదేదో సినిమాలో డైలాగ్​లా ఉంది కదా. సినిమా డైలాగే.. కానీ నేటి తరానికి ఇది కరెక్టుగా సూటయ్యే మాట. మానవ సంబంధాలన్నీ నేడు మనీ సంబంధాలుగా మారిపోయాయి. అలా మనీయే ముఖ్యం అనుకుంటూ కన్నవాళ్లను కూడా పట్టించుకోని ప్రబుద్ధులెందరో ఉన్నారు. ఆస్తులు కూడబెట్టలేదని కొందరు.. కూడబెట్టిన ఆస్తి పంచలేదని మరికొందరు.. పంచిన ఆస్తులు సరిపోలేదని ఇంకొందరు.. ఇలా రకరకాల కారణాలతో వృద్ధాప్యంలో కన్నవాళ్లపై కనికరం లేకుండా నరకం చూపిస్తున్నారు. బతికుండగానే జీవచ్ఛవాలుగా మార్చేస్తున్నారు.

అలాంటి ఓ ఘటనే ఇటీవల కామారెడ్డిలో జరిగింది. అయితే ఇక్క ఆస్తుల కోసం చంపడం కాదు కానీ.. చనిపోయిన తల్లికి కర్మకాండలు చేయడానికి నిరాకరించారు ఆమె పిల్లలు. ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నా.. ఆ తల్లి మృతదేహం రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో ఒంటరిగా విలవిలలాడింది. అయితే ఎట్టకేలకు పోలీసులు చొరవ తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతో దిగొచ్చిన పిల్లలు ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నారు. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయి.. మానవత్వం ఎన్నడో మసకబారిపోయిందనడానికి ఈ కిష్టవ్వ కన్నీటిగాథయే ఓ ఉదాహరణ.

అసలేం జరిగింది: కామారెడ్డి జిల్లా ఆర్​బీ నగర్​ కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కిష్టవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా.. గత నెల 21న కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 15 రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీన రాత్రి ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మరణ వార్తను ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయినా రెండు రోజులుగా ఆమె కొడుకు, కూతుళ్లు అటువైపు కన్నెత్తి చూడలేదు, మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. కిష్టవ్వ మృతదేహాన్ని అంతవరకు మార్చురిలో భద్రపరిచారు.

Kishtavva story in Kamareddy: కిష్టవ్వకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. వాళ్లు కామారెడ్డిలోనే నివసిస్తున్నారు. కిష్టవ్వ పేరుతో ఓ ఇల్లు కూడా ఉంది. బ్యాంకులో రూ.1.70లక్షలు డిపాజిట్ సొమ్ము ఉంది. ఈ ఆస్తి, డబ్బులను ఎవరికీ పంపకం చేయకపోగా.. వాటికి ఓ బంధువును నామినీగా పెట్టిందన్న కారణంతో కిష్టవ్వపై కుమారుడు, కూతుళ్లు ఆమెపై కోపం పెంచుకున్నారు. ఆ కోపంతోనే తల్లి మరణించినా ఆమెకు కర్మకాండలు నిర్వహించలేదు. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన తర్వాతైనా కిష్టవ్వపై ఆమె కూతుళ్లు, కుమారుడికి హృదయం కరగలేదు. కనీసం అంత్యక్రియలు చేసేందుకు కూడా వెనుకాడారు.

చివరకు ఇవాళ పోలీసుల రంగప్రవేశం చేసి ఆమె పిల్లలకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల.. తమ తల్లి శవాన్ని తీసుకెళ్లాలేకపోతున్నామని పోలీసులకు తెలిపారు. తల్లి భిక్షాటన చేసి జమ చేసిన డబ్బును బ్యాంక్​ ఖాతాలో వేసి నామినీగా తమ దగ్గరి బంధువు రోజా పేరును నమోదు చేసిందని చెప్పారు. పోలీసులు నామినీ రోజాను పిలిపించి.. బ్యాంకులో నుంచి డబ్బులు తీసి ఇవ్వాలని చెప్పారు. సరేనని తెలపడంతో ఎట్టకేలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు ఒప్పుకున్నారు.

ఇవీ చదవండి:

Inhuman Incident in kamareddy : కాసుల కోసం కూతుళ్ల కక్కుర్తి.. ఏ కన్నతల్లికి రాకూడదీ దుస్థితి

అమ్మా.. నన్ను ఎందుకు అమ్మేశావ్.. నేనేం తప్పు చేశాను..?

తన 'బలగం'ను విడిచి వెళ్లలేక.. చితిలో దూకిన కన్నతండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.