cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల

author img

By

Published : Aug 7, 2021, 10:14 AM IST

catton

రాష్ట్రంలో విత్తన పత్తి పంట సాగుచేసిన రైతుల (cotton farmers) పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకుని పంట సాగుచేయించిన కంపెనీలు.. గిరాకీ లేదనే నెపంతో ఇప్పుడు ముఖం చాటేయడంతో రైతులు నిండా మునిగారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిని నష్టపోయిన కొందరు.. మధ్యలోనే పంటలను ధ్వంసం చేస్తున్నారు.

ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో పత్తిసాగు రికార్డు స్థాయికి పెరుగుతుందని, కనీసం కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ గతంలో అంచనా వేసింది. విత్తనాలు అందుబాటులో ఉంచాలని అన్ని విత్తన కంపెనీలకు సూచించింది. ఈ మేరకు కంపెనీలు విత్తనాలు సిద్ధంచేశాయి. తీరా ఈ సీజన్‌ మొదలైన తరవాత కోటి ప్యాకెట్ల వరకే అమ్ముడైనట్లు కంపెనీలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ లెక్కలు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అరకోటి ఎకరాల్లోనే పత్తి సాగైనట్లు(ఎకరం సాగుకు 2 విత్తన ప్యాకెట్లు అవసరం) ఆ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. అంటే అరకోటి విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోలేదన్న మాట. ఈ కారణంగా ఈ సీజన్‌లో విత్తన పంటల సాగు విస్తీర్ణాన్ని పలు కంపెనీలు తగ్గించేశాయి. రెండేళ్ల క్రితం వరకూ జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో 55 వేల ఎకరాలకు పైగా పత్తి విత్తన పంట సాగుచేసేవారు. ఈ సీజన్‌లో విస్తీర్ణం 30 వేల ఎకరాలకు మించలేదు.

పెట్టుబడి ఖర్చులతో ఆర్థిక భారం..

సాధారణంగా ఈ పంటల్లో పూత వచ్చాక పరపరాగ సంపర్కం కోసం మగపువ్వును, ప్రతి చెట్టులో ఉండే ఆడపూలతో రుద్దే(క్రాసింగ్‌) పనులు కూలీలతో చేయిస్తారు. ఈ పనులకుగానూ ఎకరానికి కనీసంగా నలుగురు కూలీలు దాదాపు 50 నుంచి 60 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూలీ రోజుకు రూ.600 కావడంతో ఆ వ్యయమే ఎకరానికి రూ.50 వేల నుంచి 60 వేలవుతోందని రైతులు (cotton farmers) వాపోతున్నారు.

నలుగుతున్న రైతులు..

పలు కంపెనీలు రాతపూర్వకంగా నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోవడం లేదు. మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుని విత్తన పంటలు సాగుచేయిస్తున్నాయి. మధ్యవర్తులంతా గ్రామస్థాయి నాయకులు కావడంతో వారి మీద నమ్మకంతో కర్షకులు పంటవేసి కంపెనీలకు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయశాఖ చోద్యం చూస్తుండటంతో అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. ‘ఈ సీజన్‌లో జరిగింది ఇదే. దళారుల మీద నమ్మకంతో పంట సాగుచేశాం. ప్రస్తుతం పంట పువ్వుల దశకు వచ్చింది. కంపెనీలు ముఖం చాటేశాయి. మధ్యవర్తులు మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నష్టపోయాం. వేసిన పంటను అర్ధంతరంగా దున్నడం తప్ప మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని’ బాధిత రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అటు బ్యాంకులు, కంపెనీలు, ఇటు వ్యవసాయశాఖ నుంచి సాయం అందక తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు.

సహకరించని బ్యాంకులు..

సాధారణ పత్తి పంట సాగుకు బ్యాంకులు ఎకరానికి రూ.40 వేలే పంటరుణంగా ఇస్తున్నాయి. 2021 వానాకాలంలో విత్తన పత్తి పంటకు ఎకరానికి రూ.1.25 లక్షల నుంచి లక్షా రూ.45 వేల దాకా పంటరుణం ఇవ్వాలని క్షేత్రస్థాయి బ్యాంకులు రాష్ట్ర బ్యాంకర్ల సమితికి గత మార్చి నెలలో సిఫార్సు చేశాయి. రూ.లక్షా 10 వేల నుంచి రూ.లక్షా 40 వేల మధ్యలో ఇవ్వాలని సమితి నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బ్యాంకులు సాధారణ పత్తి పంటకు ఇచ్చే రూ.40 వేలే ఈ పంటకూ ఇస్తున్నాయి’’ అని రైతులు ఆరోపిస్తుండగా, ‘‘కంపెనీల నుంచి విత్తన పంట ఒప్పంద పత్రాలు లేనందునే సమితి నిర్ణయం మేరకు పంటరుణం ఇవ్వలేకపోతున్నట్లు’’ బ్యాంకులు వాదిస్తున్నాయి.

ఇదీ చూడండి: TSRTC CARGO: ముఖ్య పట్టణాల్లో ఆర్టీసీ కార్గో, హోం డెలివరీ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.