New Ration Cards: నేడు లాంఛనంగా కొత్త రేషన్​కార్డుల పంపిణీ

author img

By

Published : Jul 26, 2021, 4:49 AM IST

New Ration Cards

రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్​కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. జయశంకర్ భూపాలపల్లిలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా 3 లక్షల 9 వేల 83 రేషన్ కార్డుల ద్వారా.. 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధి పొందనున్నారు. నెలకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఏటా రేషన్​పై రూ.2,766 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం వెచ్చించనుంది.

దారిద్య్ర రేఖకు దిగువన ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని.. దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఉదయం 10 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ప్రతి మండలం కేంద్రాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారు. నూతన రేషన్ కార్డులు అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నాయి.

అదనంగా రూ.168 కోట్ల ఖర్చు..

కొత్తగా 3 లక్షల 9 వేల 83 రేషన్ కార్డుల ద్వారా.. 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిపొందనున్నారు. నెలకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. వీటికి ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డులతో కలిపి దాదాపు 90.50 లక్షలు ఉండగా.. 2 కోట్ల 88 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా దాదాపు రూ.231 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.2,766 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

బేగంపేటలో తలసాని..

ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట జురాస్టియన్ క్లబ్​లో అర్హులైన లబ్ధిదారులకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, ఖమ్మంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.

ఇదీ చూడండి: RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.