ETV Bharat / state

Mango Crop Loss In Telangana : 'ఫల రాజా' ఎంత పనైపాయే.. ధరలు లేక రైతన్నల విలవిల

author img

By

Published : May 20, 2023, 4:10 PM IST

Mango Crop Loss
Mango Crop Loss

Mango Crop Loss In Telangana : అకాల వర్షాలు.. రైతులకు ఎంత నష్టం తెచ్చిపెట్టాయో ఇప్పటికే చూశాం. ప్రధానంగా వరి రైతులను వర్షాలు నట్టేట ముంచగా.. మామిడి రైతులదీ అదే పరిస్థితి. కరోనా కాలం నుంచి నష్టాల బాటపట్టిన మామిడి రైతులు.. ఈసారైనా లాభాలు అందుతాయని అశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నిటినీ అకాల వర్షాలు మింగేశాయి. దేశమంతా వచ్చే మామిడి దిగుబడుల్లో సగం వాటా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఇందులో 10 నుంచి 15 శాతం వాటా తెలంగాణలోని జగిత్యాల మామిడిదే ఉంటుంది. ప్రకృతి పగబట్టిన కారణంగా జగిత్యాల మార్కెట్‌కు మామిడి రావడం పూర్తిగా తగ్గిపోగా.. ధరలు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతుల గోడు ఎలా ఉంది? ప్రభుత్వానికి వారు ఏం విన్నవించుకుంటున్నారో ఓసారి చూద్దాం..

మామిడి ధరలు లేకపోవడంతో రైతుల కష్టాలు

Mango Crop Loss In Telangana : అసలే ఎండాకాలం.. మామిడి సీజన్‌ కాలం. కానీ ఈ కాలంలో వచ్చిన అకాల వర్షాలు మామిడి రైతులను నష్టాల్లోకి నెట్టేశాయి. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టినట్లుగా కురిసిన వర్షాలతో అన్ని రకాల పంటలూ దెబ్బతిన్నాయి. వరి పంటతో పాటు మామిడి దిగుబడిలోనూ రైతుకు తీవ్ర నిరాశే మిగిలింది. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా మామిడి తోటలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోనే దాదాపు 50 వేల ఎకరాల్లో లక్ష 15 వేల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది.

ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగినపల్లి, హిమాయత్, దశేరీ రకాలనే ఇక్కడి రైతులు సాగు చేస్తారు. వాటిని గ్రేడింగ్​ చేసి ఉత్తర భారతదేశం పంపిస్తారు. అక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. దశేరి రకం హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి మెట్రో సిటీలకు ఎగుమతవుతోంది. నాణ్యతతో పాటు రుచి, మంచి పరిమాణంతో కూడిన జగిత్యాల మామిడి కాయలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. ఏటా అధిక మామిడి దిగుబడులతో కళకళలాడే జగిత్యాల మార్కెట్‌.. ఇప్పుడు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది.

Jagtial Mango Market : ఈసారి ప్రకృతి పగ బట్టడంతో మామిడి రైతుల ఆశలు రాలిపోతున్నాయి. తెగుళ్లతో పాటు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పూత, పిందెలు రాలిపోయాయి. దీంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు అంటున్నారు. ఓ వైపు మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు కొడుతుండగా.. మరోవైపు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు మామిడి రైతుల్ని నష్టాల పాలు చేస్తున్నాయి. మామిడి తోటలు కౌలు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రూ.10 లక్షలు పెట్టి మామిడి తోటను కౌలుకు తీసుకుంటే.. ఇప్పుడు కనీసం రూ.3 లక్షలు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొందని కౌలు రైతులు వాపోతున్నారు.

గత 2 సీజన్‌లలో కరోనా ప్రభావం వల్ల మార్కెటింగ్‌ లేక నష్టాల పాలైన మామిడి రైతులు.. ప్రస్తుత సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. దిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉండటం వల్ల గత 2 సంవత్సరాలుగా మామిడికి తగిన మార్కెటింగ్‌ లేకుండా పోయింది. దిల్లీ నుంచి వ్యాపారులు రాకపోవడం, వచ్చిన వ్యాపారులు నామమాత్రంగా కొనుగోలు చేయడంతో మామిడి రైతులకు గత 2 సీజన్‌లలో ఆశించిన ధరలు రాలేదు.

రైతులను ఆదుకోవాలి: ఈదురు గాలుల వల్ల దాదాపు 731 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 42 హెక్టార్లు, మల్లాపూర్‌లో 128 హెక్టార్లలో, జగిత్యాల రూరల్‌ మండలంలో 121 హెక్టార్లు, రాయికల్‌లో 320 హెక్టార్లు, ధర్మపురిలో 48 హెక్టార్లు, పెగడపల్లి 32 హెక్టార్లు, వెల్గటూరులో 40 హెక్టార్లలో మామిడి పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రూ.లక్షల పెట్టుబడులు పెట్టి ఇంత తక్కువ ధరకు అమ్ముకోవడంతో ఒకింత పంటను తొలగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మామిడి రైతులు చెబుతున్నారు. మామిడినే నమ్ముకొని బతుకు సాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.