ETV Bharat / state

భయానకం.. బీభత్సం.. మాచర్లలో వైసీపీ నేతల అరాచకం

author img

By

Published : Dec 18, 2022, 10:56 AM IST

YCP Attacks on TDP Leaders In Macherla: బీభత్సం.. భయానకం.. ఏపీలోని మాచర్లలో కొనసాగుతున్న అరాచకం రాజ్యమేలుతున్న తీరిది. నియోజకవర్గంలో అధికారమే అండగా వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్షపార్టీ నేతల ఆస్తులు, ప్రాణాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వారికి అండగా నిలవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పట్టపగలు గ్రామం నడిబొడ్డున గొంతు కోసి హత్య చేయడం ఇక్కడ జరుగుతున్న దమనకాండకు నిదర్శనం. ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం అమలవుతోంది. ప్రజా ప్రతినిధి ఆదేశాలు చట్టంగా ఇక్కడి యంత్రాంగం చక్కబెడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Macherla
Macherla

భయానకం.. బీభత్సం.. మాచర్లలో వైసీపీ నేతల ఆరాచకం

YCP Attacks on TDP Leaders In Macherla: ఆంధ్రప్రదేశ్​లోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి పట్టణంలో ఇల్లు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకునే దుస్థితికి మాచర్ల రాజకీయం దిగజారింది. ప్రతిపక్షపార్టీ నేతలకు ఏవిధంగానైనా నియోజకవర్గానికి చెందినవారు సహకరిస్తే వారిని గుర్తించి వెంటాడి వివిధ రకాలుగా వేధించి అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారి ఆగ్రహం పరాకాష్ఠకు చేరింది. ప్రతిపక్షపార్టీలకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019లో వైసీపీ అధికారం చేపట్టగానే అరాచక పర్వానికి తెరలేచింది.

దుర్గి మండలం ఆత్మకూరు, జంగమహేశ్వరపాడు గ్రామాల్లో టీడీపీకు ఓటేశారన్న కక్షతో వారిని గ్రామ బహిష్కరణ చేశారు. టీడీపీ బాధితులకు శిబిరం నిర్వహించి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈక్రమంలో అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక వాహనాల్లో కొన్ని కుటుంబాలను సొంత గ్రామాలకు తరలించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచీ బయటకు రాకుండా గేట్లకు తాళ్ళు కట్టి మరీ నిర్బంధించారు.

జంగమహేశ్వరపాడులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ వారిపై వైసీపీ వారు దాడిచేసి గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు వెళ్లిపోయేలా చేశారు. 2019 నుంచి శుక్రవారం రాత్రి దాడుల వరకు ఆరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 సంవత్సరంలో వెల్దుర్తి మండలంలోని బోదిలవీడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున మహిళా అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించింది. వైసీపీ నాయకులు ఆమె నామినేషన్‌ పత్రాలు చింపేశారు.

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం: దీంతో చంద్రబాబునాయుడు ఆదేశాలతో టీడీపీ నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్న, న్యాయవాదులతో కలిసి వెల్దుర్తికి బయలుదేరారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోకి ప్రవేశించిన బొండా ఉమా, బుద్దా వెంకన్న వాహనంపై అప్పటి వైసీపీ పట్టణ యువజన అధ్యక్షుడు తురక కిషోర్‌ అనుచరులతో దాడిచేశారు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడి తరువాత కిషోర్‌ను పురపాలకసంఘం ఛైర్మన్‌ చేయడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని చెప్పుకోవాలి.

2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై పట్టపగలే వైసీపీ నాయకులు గొంతు కోసి హత్యచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించింది. టీడీపీ అధినేత చంద్రబాబు గుండ్లపాడు వచ్చి హంతకులు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అదే గ్రామానికి చెందిన శివరామయ్యతో పాటు, మరికొందరు నిందితులు కొన్ని రోజులు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చారు.

శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉండి ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉండటం గమనార్హం. వైసీపీ దాడుల నేపథ్యంలో టీడీపీకు చెందిన కొన్ని కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్లారు. వైసీపీ దాడిలో హత్యకు గురయిన కుటుంబ సభ్యుల మీదనే పోలీసులు అక్రమ కేసులు బనాయించడం గమనార్హం.

పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడం: 2022 జూన్‌ నెలలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దారి కాచి హత్యచేశారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోను నిందితులు కొన్ని రోజులు జైలుకెళ్లి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ గ్రామంలో టీడీపీకి చెందిన చాలా కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాడుల్లో నిందితులకు పదవులు ఇస్తుండటం, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడంతో ఆరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ వారిపై దాడిచేస్తే గుర్తింపు వస్తుందన్న పరిస్థితికి కొందరు రావడం గమనార్హం.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం: శుక్రవారం రాత్రి టీడీపీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తోంది. వైసీపీకు చెందిన పురపాలకసంఘం మాజీ ఛైర్మన్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో భారీగా యువకులు గుమిగూడారు. బహిరంగంగా కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో రహదారులపై హల్‌చల్‌ చేశారు. పోలీసులు కనీసం వీరిని వారించే ప్రయత్నం చేయలేదు. టీడీపీ శ్రేణులు ప్రదర్శన చేసుకుంటుండగా ముందుగా వైసీపీ నుంచి రాళ్లు విసిరారు. దీంతో టీడీపీ ప్రతిఘటించింది. ఈ సందర్భంగా వైసీపీ వైపు టీడీపీ వాళ్లు దూసుకువెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బ్రహ్మారెడ్డిని గుంటూరుకు బలవంతంగా పంపించారు.

ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణి: వైసీపీకు చెందిన పలువురు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చి టీడీపీ నాయకుల వాహనాలు, ఆస్తుల ధ్వంసమే ధ్యేయంగా దమనకాండకు దిగారు. ఇంత జరిగినా ఉదయం 9గంటల వరకు బాధితుల వద్దకు పోలీసులు వెళ్లకపోవడం అక్కడి పోలీసు యంత్రాంగం తీరుకు నిదర్శనం. టీడీపీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరుగుతున్న క్రమంలో వైసీపీ రాళ్లు, సీసాలు, కర్రలతో అడ్డుకోవడానికి సిద్దమై గుంపుగా ఉన్నారు. ఈవిషయాన్ని గుర్తించి వారిని అదుపు చేయాల్సిన యంత్రాంగం ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణి ప్రదర్శించింది. ఈక్రమంలో పరస్పర దాడులు జరిగాయి. అప్పటికి అదుపు చేసి బ్రహ్మారెడ్డిని పంపిన తర్వాత వైసీపీ వారిని కూడా పంపించి వేయకుండా మిన్నకుండిపోయారు.

సినిమాను తలపించేలా: సినిమాను తలపించేలా పట్టణంలో 200 మందికిపైగా కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఈలలు, కేకలు వేస్తూ హల్‌చల్‌ చేస్తుంటే పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసుల ఎదురుగానే వాహనాలకు నిప్పంటిస్తున్నా నివారించలేకపోయారు. పట్టణ శివారులో సొసైటీ కాలనీలో ఉన్న బ్రహ్మారెడ్డి ఇల్లు, కార్యాలయానికి నిప్పు పెట్టడానికి ప్రదర్శనగా వైసీపీ కార్యకర్తలు వెళుతున్నా పోలీసులు అడ్డుకోలేదు.

తామేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమా: పట్టణంలో మూడు గంటలపాటు భయానక వాతావరణం సృష్టించినా ఏదశలో వారిని నిలువరించలేకపోయారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు వారిపైనే కేసులు పెట్టడం దౌర్జన్యకారులకు కలిసి వస్తోంది. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమా అధికారపార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న బహుళ అంతస్థుల భవనంలోకి వందలమంది వెళ్లి టీడీపీ నేత బ్రహ్మారెడ్డికి చెందిన నాలుగు వాహనాలు, ఇతరుల వాహనాలు నాలుగు ధ్వంసం చేశారు. అదే భవనంలో రెండు ఫ్లాట్లలో నివసిస్తున్న టీడీపీ వారి ఇళ్లకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. సామగ్రి ధ్వంసం చేసిన తీరు చూస్తే ఎంత ఆరాచకంగా వ్యవహరించారో అవగతమవుతుంది.

వాహనం వెనక్కి : మాచర్లలోని బ్రహ్మారెడ్డి ఇల్లు, కార్యాలయానికి వైసీపీ వారు నిప్పుపెట్టారని స్థానికులు ఫోన్‌ చేస్తే అగ్నిమాపక వాహనం బయలుదేరింది. దారిలో కేసీపీ ఫ్యాక్టరీ వద్ద నీరు సైతం నింపుకున్నారు. బ్రహ్మారెడ్డి కార్యాలయం వద్ద మంటలు ఆర్పడానికి బయలుదేరుతున్న కమంలో ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో కానీ మంటలు ఆర్పడానికి రాకుండానే వాహనం వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఉదయం వరకు బ్రహ్మారెడ్డి కార్యాలయం తగలబడుతూనే ఉంది. కార్యాలయం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ఇవీ చదవండి: మాచర్లలో విధ్వంసం.. సినిమాను తలదన్నేలా రావణకాష్ఠం

అసలేంటీ కొలీజియం? కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ ఎందుకు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.