ETV Bharat / state

కేసీఆర్​కు దీదీ ఫోన్.. జాతీయ పార్టీపై ఏమన్నారంటే..!

author img

By

Published : Jun 12, 2022, 7:42 AM IST

Mamatha call to KCR: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం కేసీఆర్​తో సహా మరో ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు దీదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆరా తీశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం దిల్లీలో నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని కోరారు.

Mamatha call to KCR
కేసీఆర్​కు మమత ఫోన్

Mamatha call to KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం దిల్లీలో నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని కోరారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నాలను ఆమె అభినందించినట్లు తెలిసింది. దేశంలో భాజపాను ఓడించేందుకు కొత్త పార్టీల అవసరం ఉందని మమత చెప్పినట్లు తెలుస్తోంది. తమ పార్టీ సైతం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగిందని, తెరాస సైతం అలాగే విస్తరించాలని ఆకాంక్షించినట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహాలను మమతకు కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఈనెల 15న ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ఇతర నేతల సంయుక్త సమావేశం కోసం ఆహ్వానాలను మమత పంపారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ బలం అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇందుకు చొరవ తీసుకొన్నారు. 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేస్తున్న సమావేశానికి రావాలంటూ ఆమె శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు.

‘‘ముంగిట్లో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విభజన శక్తులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు బలంగా, సమర్థవంతంగా నిలిచేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ నెల 15న ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ఇతర నేతల సంయుక్త సమావేశం కోసం ఆహ్వానాలు పంపారు’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో దిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌, నవీన్‌పట్నాయక్‌, ఎంకే స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, హేమంత్‌ సోరెన్‌, భగవంత్‌ మాన్‌ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌధరి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు హెచ్‌డీ దేవేగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు పవన్‌కుమార్‌ చామ్లింగ్‌, ఐయూఎంల్‌ అధ్యక్షుడు మొహిదీన్‌ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, అసదుద్దీన్‌ ఒవైసీల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. అన్ని పార్టీలూ కలిసి ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలపడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. బలమైన పోటీ ఇచ్చేలా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నిలపడంపైనే ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో శరద్‌పవార్‌, దేవెగౌడలాంటి సీనియర్ల పేర్లను తెరపైకి తేవొచ్చని సమాచారం.

ఇది సరైన అవకాశం: విభజన శక్తులు దేశాన్ని పీడిస్తున్న తరుణంలో.. జాతీయ రాజకీయాల భవిష్యత్తుపై చర్చించేందుకు అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు రాష్ట్రపతి ఎన్నిక సరైన అవకాశం కల్పిస్తోందని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. బలమైన ప్రజాస్వామ్య లక్షణాలు గల దేశానికి బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని స్పష్టం చేశారు. విభజన శక్తులను అడ్డుకునేందుకు అన్ని ప్రగతిశీల పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘వివిధ కేంద్ర సంస్థలతో ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దెబ్బతింది. దేశంలో తీవ్ర విభేదాలు సృష్టించారు. మన ప్రతిఘటనను బలోపేతం చేయాల్సిన సమయమిది’’ అని తెలిపారు. ‘‘సంక్లిష్ట పరిస్థితుల గుండా మన ప్రజాస్వామ్యం పయనిస్తున్న ప్రస్తుత సమయంలో అణగారిన వర్గాల గొంతుకలను ప్రతిధ్వనింపజేసేందుకు.. విపక్ష గొంతుకల ఫలవంతమైన సంగమం తక్షణావసరం’’ అని వివరించారు.

మమత చర్య విపక్షాల ఐక్యతకు దెబ్బ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాల ఐక్యతకు మమతా బెనర్జీ చేస్తున్న ఏకపక్ష యత్నం.. విఫలమవుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మమతా బెనర్జీ లేఖపై శనివారం ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌లు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ నెల 15న సమావేశమవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. ‘‘మమత నాకు కూడా లేఖ పంపినట్లు సామాజిక మీడియా ద్వారా తెలిసింది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు పరస్పర సంప్రదింపుల అనంతరమే నిర్వహిస్తారు. ఏకపక్షంగా చేపట్టే ఏ చర్య అయినా బెడిసికొడుతుంది. విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తుంది’’ అని చెప్పారు.

ఎవరిని సంప్రదించారో తెలియదు: మమతా బెనర్జీ రాసిన లేఖ తనకు ఈ-మెయిల్‌ ద్వారా అందిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. అయితే సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు ఆమె ఎవరిని సంప్రదించారన్నది మాత్రం తెలియదని వ్యాఖ్యానించారు. ‘‘ అన్ని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు ఏకమవ్వాలని పరిస్థితులు డిమాండ్‌ చేస్తున్నాయి. మమత పిలుపుపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలియదు. తుది నిర్ణయం ముందు అంతర్గతంగా చర్చించుకుంటాం’’ అని చెప్పారు.

ఎలాంటి ప్రయోజనం ఉండదు: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి లేఖపై అధికార భాజపా స్పందించింది. మమతా బెనర్జీ చర్య ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోదని వ్యాఖ్యానించింది. ‘‘2017 రాష్ట్రపతి ఎన్నికల నుంచి మనం ఇలాంటి ప్రయత్నాలను చూస్తున్నాం. కానీ, ఈ యత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.’’ అని భాజపా పశ్చిమబెంగాల్‌ అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య పేర్కొన్నారు.

పౌరులను రక్షించగల రాష్ట్రపతిని ఎన్నుకోవాలి: కాంగ్రెస్‌

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు విభేదాలను అధిగమించాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ప్రస్తుతం అధికార భాజపా కొనసాగిస్తున్న దాడి నుంచి రాజ్యాంగం, సంస్థలు, పౌరులను కాపాడగలిగే రాష్ట్రపతిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికారప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం మా పార్టీ ప్రత్యేకంగా ఎలాంటి పేరునూ సూచించకున్నా.. ధ్వంసమైన సామాజిక వ్యవస్థకు చికిత్స చేయగల, మన రాజ్యాంగాన్ని రక్షించగల రాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో మేం మా ప్రజలకు రుణపడి ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ఈ చర్చను ముందుకు తీసుకెళ్లగలదని మేం నమ్ముతున్నామని సూర్జేవాలా పేర్కొన్నారు.

ఇవీ చదవండి: రెండేళ్ల తర్వాత.. జూన్​లో తెరుచుకుంటున్న బడులు

డేటింగ్ యాప్​తో చీటింగ్.. ఏడుగురిని పెళ్లాడి రూ.లక్షలు కాజేసిన కి'లేడీ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.