ETV Bharat / state

VENKAIAH NAIDU: తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి: ఉపరాష్ట్రపతి

author img

By

Published : Jul 31, 2021, 12:47 PM IST

Updated : Jul 31, 2021, 2:42 PM IST

మాతృభాషను కోల్పోతే గుర్తింపు, గౌరవం కోల్పోతామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(VENKAIAH NAIDU) అన్నారు. వాటిని కాపాడుకునేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

VENKAIAH NAIDU on mother tongue, mother tongue importance
మాతృభాషపై వెంకయ్యనాయుడు, మాతృభాషలు కాపాడుకునేందుకు దృష్టి పెట్టాలి

మాతృ భాషలు కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఆకాంక్షించారు. తెలుగు కూటమి సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌గా జరిగిన భాషాభిమానుల 'అంతర్జాల సదస్సు'లో ఆయన ప్రసంగించారు. మాతృభాష కాపాడుకునేందుకు 5 సూత్రాలను ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆంగ్లంలో తన సమస్య చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళకు తెలుగులో మాట్లాడే అవకాశం ఇచ్చి... 21 ఏళ్లుగా సాగుతున్న భార్యాభర్తల వివాదం సానుకూల మార్గంలో పరిష్కరించిన చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ చొరవను అభినందించారు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యలు తమ మాతృభాషలో తెలియజేసే అవకాశం ఇవ్వాడాన్ని కొనియాడారు.

భాషా వికాసానికి బాటలు

భారతీయ భాషలు ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రధాని, తెలుగు భాషాభివృద్ధిపై సానుకూలమైన ఆలోచన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల భాషా వికాసానికి బాటలు పడుతున్నాయన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. అన్ని శాస్త్రాలను వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్ల దేశాలతో పోటీ పడుతున్నాయన్నారు.

వెంకయ్యనాయుడు సూచించిన ఐదు సూత్రాలు

  • ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం
  • పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం
  • న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం
  • క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగాలి
  • ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడటం

దృష్టి పెట్టాలి

మాతృభాషలు కాపాడుకునేందుకు దృష్టి పెట్టాలి. మాతృభాషల రక్షణకు సృజనాత్మక విధానాలు అవసరం. భాషను సృజనాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలి. భాషలు సృజనాత్మకంగా ఉంటేనే భవిష్యత్‌ తరాలను ఆకర్షిస్తాయి. మాతృభాషను కోల్పోతే గుర్తింపు, గౌరవం కోల్పోతాం. తెలుగు కూటమిని ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి. ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతోంది. కానీ తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావట్లేదు.

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ప్రణాళికలు రచించుకోవాలి

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ మాతృభాషలను సంరక్షించుకునేందుకు అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి... మన మాతృభాషల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర రావు, విశ్రాంత ఐపీఎస్‌ చెన్నూరు ఆంజనేయరెడ్డి, తానా మాజీ ఛైర్మన్‌ తాళ్లూరి జయశేఖర్, ద్రవిడ విశ్వవిద్యాలయ డీన్‌ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, భారత భాషాశాస్త్రవేత్తల సంఘం అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వర రావు సహా పలు దేశాలకు చెందిన దాదాపు 1000 తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు వర్చువల్‌గా హాజరయ్యారు.

ఇదీ చదవండి: మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!

Last Updated : Jul 31, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.