ETV Bharat / state

వారెవ్వా... అనిపిస్తున్న వరుణ్ చిత్రలేఖనం!

author img

By

Published : Mar 25, 2021, 10:46 PM IST

అమ్మ చూపించిన బొమ్మలే అతనికి ఆలోచనలు రేకెత్తించాయి. నాన్నతో కలిసి చూసిన ప్రకృతి అందాలు సృజనాత్మకతను కలిగించాయి. మాటలు రాని అతడికి... చిత్రలేఖనం రూపంలో మరో ప్రపంచం రా రమ్మని స్వాగతం పలికింది. అంగవైకల్యం శరీరానికే కానీ, స్పందించే మనసుకు... కష్టపడేతత్వానికి కాదంటున్నాడు... ఏపీలోని గుంటూరుకు చెందిన వరుణ్‌.

guntur varun
artist, varun, disable artist, painter

వారెవ్వా... అనిపిస్తున్న వరుణ్ చిత్రలేఖనం!

ఎదురుగా కనిపించే బొమ్మయినా... ప్రకృతిలోని అందాలైనా వరుణ్‌ కంటపడితే తన చేతిలోని కుంచె చకచకా కదులుతుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా కాన్వాస్ పై చిత్రాలుగా మారిపోతాయి. బొమ్మలు గీయటమే కదా..! ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే వరుణే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వెన్నుపూస సమస్య కారణంగా తక్కువ మెడతో జన్మించాడు.

వెన్నుపూస సమస్య కారణంగా వరుణ్‌ మూడేళ్ల వరకూ కనీసం నిలబడలేని పరిస్థితి. దీనికి తోడు అతడికి వినపడదు. అయినా అతని‌ తల్లిదండ్రులు కుంగిపోలేదు. వరుణ్‌కు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. స్పీచ్ థెరపీ ద్వారా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవటం, తిరిగి చిన్నచిన్న మాటలతో సమాధానం ఇవ్వటం నేర్పించారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహమే

వరుణ్ తండ్రి ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్​గా​ పని చేసేవారు. తాను రాసుకుంటున్నప్పుడు టేబుల్ పై ఉన్న పెన్సిల్ తీసుకుని వరుణ్‌ పేపర్ పై గీతలు గీయటం మొదలు పెట్టాడు. పాఠశాలలో చేర్పించిన తర్వాత చదువుతో పాటు... బొమ్మలు గీయడం మెుదలుపెట్టాడు. వరుణ్ ఆసక్తి చూసి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. విశాఖపట్నంలోని బీచ్ వద్దకు రోజూ తీసుకెళ్లేవారు. వరుణ్ అక్కడి ప్రకృతి అందాలను చూసి చిత్రాలుగా మలిచేవాడు.

మనుషుల చిత్రాలు

ఆ తర్వాత ఎదురుగా ఉన్న మనుషుల్ని కూడా చిత్రీకరించటం మొదలుపెట్టాడు. తనను దేవుడు మెడ లేకుండా పుట్టించినా... తాను గీసే చిత్రంలో మాత్రం మెడతో తాను ఎలా ఉంటాలో గీసి మురిపోతున్న వరుణ్‌ని చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేయాల్సిందే.

జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిప్లొమా

వరుణ్‌ మైసూర్‌లో జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తరువాత.. ఆంధ్రా యూనివర్శిటిలో మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివాడు. సింబయాసిస్‌ యానిమేషన్‌ సంస్థలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు. అలా, తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడలోని ఎన్.ఐ.డిలో ఉద్యోగం చేస్తున్నాడు.

అన్నిరకాల బొమ్మల గీయటమే ప్రత్యేకత

అన్ని రకాల బొమ్మలు గీయటం వరుణ్ ప్రత్యేకత. సినిమాలంటే వరుణ్ కి చాలా ఇష్టం. తాను బొమ్మలు వేస్తుంటే అమ్మానాన్నలు ఎంతో సంతోషిస్తారని... అదే తనను ఈ రంగంలో ముందుకు వెళ్లేలా చేసిందని వరుణ్ వచ్చిరాని మాటలతో చెబుతుంటాడు. వరుణ్ శారీరకంగా ప్రత్యేకంగా ఉండొచ్చు గానీ, అతడు మాత్రం అందరి పిల్లాల్లానే ఆనందంగా పెరిగాడు.

పిల్లలకు ఇష్టమైనదే చేయనివ్వండి

వైకల్యం వెక్కిరించిన వెన్నుచూపని ధైర్యం వరుణ్‌ది అయితే, కొడుకు ఎలా ఉన్నప్పటికీ వారికి అండగా నిలబడాలన్న తీరు తల్లిదండ్రులుగా వారిని మరోమెట్టు ఎక్కిస్తోంది. మేము ఇది చేశాం కాబట్టి, మీరు ఇదే చేయాలని పిల్లల్ని ఇబ్బందిపెట్టకుండా వారికి ఇష్టమైన రంగం వైపు ప్రోత్సహిస్తే రాణిస్తారు అనడానికి వరుణ్‌ ప్రయాణమే నిదర్శనం.

ఇదీ చూడండి: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: వైఎస్ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.