ETV Bharat / state

ఏ రంగంలోనైనా విలువలే అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

author img

By

Published : Dec 11, 2020, 10:37 PM IST

ఏ రంగంలోనైనా విలువలే అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి
ఏ రంగంలోనైనా విలువలే అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

ఏ రంగంలోనైనా విలువలే అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్తశుద్ధి, కష్టపడి పని చేయటం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం ప్రతి రంగంలోనూ ప్రధానమన్నారు. తన జీవితంలో వాటిని మాత్రమే నమ్మి ఓ సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగానని తెలిపారు. ఏపీలోని విశాఖపట్టణం నుంచి వైపీవో గ్రేటర్ చాప్టర్​కు చెందిన యువ పారిశ్రామికవేత్తలనుద్ధేశించి అంతర్జాల మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు.

వ్యాపారం సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని.. అది విలువలతో కూడుకొని ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచించారు. ఏపీలోని విశాఖపట్టణం నుంచి వైపీవో గ్రేటర్ చాప్టర్​కు చెందిన యువ పారిశ్రామికవేత్తలనుద్ధేశించి అంతర్జాల మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు. వ్యాపారం సంపాదన కోసమే అయినా..ఆరోగ్యం కూడా అత్యంత కీలకమన్నారు. అదే సమయంలో సంపాదనలో కొంత భాగం సమాజానికి కూడా కేటాయించి, ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా వ్యాపార రంగం అంటే ఓ ప్రతికూల భావన ఏర్పడిన మాట వాస్తవమేనని..దాన్ని పోగొడుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు యువత ముందుకు రావాలన్నారు.

భారతీయ ధర్మం మనకు నేర్పిందదే...

సేవ చేయటంలో ఉన్న ఆనందం మరెందులోనూ లభించదని వెంకయ్య వ్యాఖ్యానించారు. నలుగురి మేలును కోరుకోవటం భారతీయ ధర్మం మనందరికీ నేర్పిందన్నారు. భారతదేశం ఎవరి మీద దాడులు చేయలేదని.. మన విజ్ఞానాన్ని నలుగురికి పంచేందుకు విశ్వగురువుగా నాయకత్వం వహిస్తూ దిశానిర్దేశం చేసిందన్నారు. ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించకుండా వసుధైక కుటుంబ భావనతో విశ్వమంతా మన కుటుంబంగానే భావించే గొప్ప సంస్కృతి మన సొంతమని తెలిపారు. ఆ విలువలే నేటికీ భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత దేశంగా నిలబెట్టాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మాతృభాషను మరువరాదు

చదువులు ఎంతో ముఖ్యమని... అదే సమయంలో సమాజాన్ని చదవటం కూడా అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. అది మనకు నిత్య జీవిత గమనంలో అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం ఎంతో కీలకంగా మారిందన్న ఆయన ఆంగ్ల భాషను నేర్చుకోవటంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఎన్ని భాషలైనా నేర్చుకోవాలని సూచించిన ఆయన.. మాతృభాషను మరువరాదని తెలిపారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా... పుట్టిన ఊరుకు, సమాజానికి మేలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. అదే స్ఫూర్తితో మిత్రుల సహకారంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. జీవితంలో ప్రతి సందర్భంలో మిత్రులు తన వెంటే నడిచారని..వాళ్ళే తన ప్రధాన బలమని వెంకయ్య వెల్లడించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటులో వారి సహకారం గొప్పదని తెలిపారు. అందుకే నేటికీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం పొందకుండా మిత్రుల సహకారంతోనే సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

ప్రకృతి సంరక్షణ అత్యంత కీలకం

వ్యాపారాల్లో ఎంత తలమునకలై ఉన్నా.. ఆరోగ్యం మీద ఆశ్రద్ధ పనికి రాదని అన్నారు. ఆహారం, ఆరోగ్యం విషయంలో కచ్ఛితంగా ఉండాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటం అలవాటు చేసుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రగతితో పాటు ప్రకృతి సంరక్షణ అత్యంత కీలకమని తెలిపారు. జంక్ ఫుడ్స్ లాంటి వాటిని మానుకుని..సంప్రదాయ ఆహారం మీద దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.