ETV Bharat / state

ఆ ఆస్పత్రిలో ఏం జరిగింది.. ఇద్దరు బాలింతలు ఎలా చనిపోయారు..?

author img

By

Published : Jan 13, 2023, 7:43 PM IST

Malakpet women
Malakpet women

Malakpet women death case : హైదరాబాద్‌ మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని ఆరోపిస్తూ.. కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులకు అన్ని రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏం లేదని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు.. సర్కార్‌ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. బాలింతల మృతిపై దర్యాప్తునకు వైద్యశాఖ కమిషనర్‌ కమిటీ వేశారు.

ఆ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు ఎలా చనిపోయారు

Malakpet women death case : హైదరాబాద్‌ మలక్‌పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు.

Malakpet area hospital incident : ప్రసవం తర్వాత సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురైంది. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివానిని కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత శివాని ఆరోగ్య పరిస్థితి విషమించింది. గాంధీకి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఒకేసారి ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. మలక్‌పేట ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.

ఆస్పత్రి వద్ద రోదనలు.. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. కుటుంబీకులు, బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే మృతి చెందారంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన సర్కార్‌ దవాఖానాల్లో.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.

నా బిడ్డకు తల్లిని దూరం చేశారు.. "నా భార్యను ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్‌లో పెట్టి మరుసటి రోజు సర్జరీ చేశారు. ఆ తర్వాత ఇక నా భార్యను ఎవరూ పట్టించుకోలేదు. డాక్టర్లకు చెప్పినా వాళ్లెవరూ పట్టించుకోలేదు. తర్వాత ఆమెను తీసుకొని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడి డాక్టర్లు చూసి నా భార్యకు డెంగీ జ్వరం ఉందని.. అలాంటి సమయంలో ప్రసవం ఎలా చేశారని అడిగారు. కనీసం డెలివరీ చేసిన తర్వాత ఉమ్మ నీరునీ క్లీన్ చేయలేదట. వారి నిర్లక్ష్యం వల్లే నా భార్య చనిపోయింది. నా బిడ్డ తల్లిలేని పిల్ల అయింది. మాకు న్యాయం జరగాలి." అని మృతురాలి భర్త గుండెలవిసేలా రోదించారు.

హరీశ్ రావు రాజీనామా చేయాలి.. మలక్‌పేట ఆసుపత్రి వద్ద ఆందోళనకారులకు... వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ.... కాంగ్రెస్‌, తెలుగుదేశం, బీఎస్పీ, బీఆర్ఎస్ నేతలు నినదించారు. వివిధ పార్టీల శ్రేణులను... పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి సమీప ఠాణాలకు తరలించారు. బాలింతల మృతి బాధాకరమన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... వారి కుటంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ... మంత్రి పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలని కోరారు.

వైద్యుల నిర్లక్ష్యం కాదు.. ‘‘మృతుల్లో ఒకరైన సిరివెన్నెలను రెండో కాన్పు కోసం 9న ఆస్పత్రికి తీసుకొచ్చారు. 11న కాన్పు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు చేసిన అన్ని పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. 11న ఉదయం కాన్పు చేశారు. 12న సాయంత్రం 4 గంటలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ సిరివెన్నెల వైద్యుల దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షిస్తే గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు తేల్చారు. వెంటనే గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందిగా వైద్యులు సూచించడంతో వెంటనే గాంధీకి రెఫర్‌ చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయారు. సరైన విచారణ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటాం." - సునీత, డీసీహెచ్‌ఎస్‌

‘‘మరో మృతురాలు శివాని డయేరియా సమస్యతో 10వ తేదీన మధ్యాహ్నం ఆస్పత్రికి తీసుకొచ్చారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉంది. ఫిజిషియన్‌ను సంప్రదిస్తే.. ఇది హైరిస్క్‌ కేసు అని చెప్పారు. నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో 11న మధ్యాహ్నం కాన్పు చేశారు. 12న రాత్రి మరోసారి అస్వస్థతకు గురైంది. కళ్లు తిరగడం, కనిపించకపోవడం, చెమట పట్టడం లాంటి ఇబ్బందులు ఉన్నట్లు శివాని వైద్యులకు చెప్పారు. సివిల్‌ సర్జన్‌ అభిప్రాయం తీసుకొని వెంటనే గాంధీకి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటూ ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శివాని మృతి చెందింది’’ అని డీసీహెచ్‌ఎస్‌ వివరించారు.

విచారణకు కమిటీ.. మలక్‌పేట ఆసుపత్రిని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సందర్శించారు. బాధ్యలైన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఐదు లక్షల రూపాయలు అందిస్తామని ఆర్డీవో ప్రకటించారు. మలక్‌పేట ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేశామని వైద్యశాఖ కమిషనర్‌ వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.