ETV Bharat / state

Darbhanga Blast: దిల్లీకి దర్భంగ పేలుడు కేసు నిందితులు

author img

By

Published : Jul 1, 2021, 7:56 PM IST

బిహార్‌ దర్భంగ (Darbhanga blast) పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ (NIA)అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై దిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసు గురించి క్షుణ్ణంగా విచారించేందుకు నిందితులిద్దరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

Darbhanga blast
Darbhanga blast

బిహార్​లోని దర్భంగ (Darbhanga blast) పేలుడు కేసులో ఎన్‌ఐఏ (NIA) క్షుణ్ణంగా విచారణ జరుపుతోంది. నిందితులిద్దరిని ఎన్​ఐఏ అధికారులు నాంపల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి దిల్లీకి తీసుకెళ్లారు. ఘటన జరగడానికి కొద్ది నెలల ముందు అన్నదమ్ముల్లో చిన్నవాడైన నాసిర్‌ మాలిక్‌... ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లి వచ్చినట్టు దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. ఆ సమయంలోనే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.

ఐఈడీ రసాయనాన్ని ఎలా తయారు చేయాలనే విధానాన్ని నేర్చుకున్నట్టు తేలింది. గతంలో పాకిస్తాన్‌ వెళ్లి వచ్చిన నాసిర్‌... పేలుళ్లు ఏ విధంగా చేయాలి? ఏయే ప్రాంతాలు లక్ష్యంగా చేసుకోవాలనే విషయంలో తర్ఫీదు పొందినట్టు గుర్తించారు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కోడ్‌ భాషలో సంప్రదింపులు జరిపినట్టు బయటపడింది.

దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిలో సికింద్రాబాద్‌, దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ రైలును లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ముందుగానే పార్శిల్‌ ఎలా చేయాలి? ఏ విధంగా తరలించాలనే అనే అంశంపై రెక్కీ నిర్వహించి ఆ తర్వాత పథకాన్ని పక్కాగా అమలు చేశారు.

ఇదీ స్కెచ్​...

యూపీకి చెందిన మాలిక్‌ సోదరులు తమ తల్లితో కలిసి ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. ఫుట్‌పాత్​పై బట్టలు విక్రయిస్తు మల్లేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంగా ఉన్న తమ తల్లికి చికిత్స చేయించేందుకు వచ్చినట్టు ఇంటి యజమానికి తెలిపారు. లష్కరేతోయిబా ఆదేశాల కోసం వేచి చూసి ఆదేశాలు అందగా గత నెల 15న భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ముందుగా ఇంట్లోనే ఐఈడీ ద్రావణాన్ని తయారు చేసి వస్త్రాల మధ్య ఉంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్శిల్‌ కౌంటర్‌లో ఇచ్చారు.

55 కిలోల బరువున్న చీరల పార్సిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను పెట్టారు. గత నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్సిల్​ను... దర్భంగకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. చరవాణి నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్భంగలో పార్సిల్​ను రైలు నుంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం కలగలేదు.

అలాంటి వాళ్లు అనుకోలేదు..

ఎన్‌ఐఏ దర్యాప్తులో భాగంగా మల్లేపల్లిలో సోదాలు నిర్వహించడంతో విషయం తెలిసి స్థానికులు కంగుతిన్నారు. తమకెప్పుడు వారిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. వాళ్లు కేవలం బట్టల వ్యాపారం చేసుకునే వారే అనుకున్నామని.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డామన్నారు.

ఇదీ చూడండి: Darbhanga blast: పాకిస్థాన్​ కేంద్రంగానే దర్భంగా పేలుడు జరిగినట్టు అనుమానం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.